ఉన్నయే పోతున్నయ్​!  కొత్త కంపెనీలు రావట్లే

ఉన్నయే పోతున్నయ్​!  కొత్త కంపెనీలు రావట్లే
  • కరీంనగర్, వరంగల్ టవర్స్ వైపు చూడని ఐటీ కంపెనీలు

కరీంనగర్, వెలుగు :  రాష్ట్రంలో టైర్ 2 సిటీస్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసినఐటీ టవర్స్ కు కొత్త ఐటీ కంపెనీలు రావట్లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, రాయితీలు ఇవ్వకపోగా చార్జీల పేరిట బాదడం, కనీస సౌకర్యాలు అరకొరగా ఉండడంతో ఉన్న కంపెనీలనే తరలించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ ఐటీ టవర్ లో మూడు కంపెనీలు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేయగా.. మిగతా కంపెనీలు ఇబ్బందులతో నెట్టుకొస్తున్నాయి. బాదుడుపై ఎవరైనా అడిగితే.. ఇష్టముంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి అంటున్నారని ఓ కంపెనీ సీఈఓ ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు ఫ్లోర్లు, 50 వేల ఎస్ఎఫ్‍ టీ తో నిర్మించిన కరీంనగర్ ఐటీ హబ్ లో 60 శాతం స్పేస్ ఖాళీగానే ఉంది. హనుమకొండ, ఖమ్మం ఐటీ టవర్లలోనూ ఇదే పరిస్థితి. వరంగల్‍ సిటీని ఐటీ హబ్‍గా మార్చి రాబోయే రెండు మూడేండ్లలో 8, 9 వేల ఉద్యోగాలు పెంచేలా చూస్తామని 2020లో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తీరా మూడేండ్ల తర్వాత చూస్తే.. 300 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు రాలేదనే విమర్శ ఉంది.

భారంగా మారిన రెంట్, మెయింటనెన్స్ ఛార్జీలు 

గతంలో  కరీంనగర్ ఐటీ టవర్ లో రెంట్ స్క్వెయిర్​ఫీట్ కు రూ.13 ప్లస్ జీఎస్టీ, మెయింటనెన్స్ స్క్వెయిర్​ఫీట్ కు రూ.18 ప్లస్ జీఎస్టీ వసూలు చేసేవారు. మెయింటనెన్స్ ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయని కంపెనీల నిర్వాహకులు గగ్గోలు పెట్టడంతో ఈ ఏడాది జనవరిలో రెంట్, కరెంట్, ఇంటర్నెట్, మెయింటనెన్స్ కలిపి పర్ సీట్ రూ.35‌‌00గా నిర్ణయించారు. ఈ లెక్కన చూసినా మళ్లీ పాత ఛార్జీలతో సమానంగా ఉన్నాయంటున్నారు. సెంట్రల్ స్కీమ్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్‌‌ఐ)లో భాగంగా 2001లోనే హనుమకొండలో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్ లో ప్రస్తుతం రెంట్, కరెంట్, ఇంటర్నెట్, మెయింటనెన్స్ కలిపి పర్ సీటుకు రూ.2200 చార్జీ చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.35‌‌00 వసూలు చేయడం గమనార్హం. ఇది హైదరాబాద్ తో సమానంగా ఉందని స్థానిక కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని తాము ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ బాధ్యుల దృష్టికి తీసుకెళితే ఎస్టీఎఫ్‌‌ఐలో ఇచ్చే ఫెసిలిటీస్ కు తాము ఇచ్చే ఫెసిలిటీస్ కు చాలా తేడా ఉందని చెప్తున్నారని, కానీ ఎస్టీఎఫ్‌‌ఐలోనే ఫెసిలిటీస్ బాగున్నాయని కంపెనీల నిర్వాహకులుంటున్నారు. ఐటీ టవర్ కు 18‌‌00  కేవీ కరెంట్ కనెక్షన్ ఇవ్వడంతో స్లాబ్ రేట్ మారి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని, తమకు 200 కేవీ కనెక్షన్ సరిపోతుందని చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. అలాగే ఐటీ టవర్ లో ఇంటర్నెట్ ప్రొవైడర్ ను మార్చుకునే సౌకర్యం లేదని, తక్కువ రేట్ కు ఇంటర్నెట్ ఇచ్చే వారిని ఎంచుకునే అవకాశమివ్వాలని కోరుతున్నారు.

సిద్దిపేటకు ఆఫర్​

సిద్ధిపేటలో త్వరలో ప్రారంభం కాబోతున్న ఐటీ టవర్ లో కంపెనీలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు రెండేండ్ల పాటు రెంట్, ఇంటర్నెట్, మెయింటనెన్స్, కరెంట్ ఫ్రీగా ఇవ్వనున్నట్టు ఇటీవల మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. సిద్ధిపేటలాంటి హామీ కరీంనగర్, వరంగల్ లో ఎందుకు ఇవ్వడం లేదని ఇక్కడి కంపెనీల సీఈఓలు ప్రశ్నిస్తున్నారు.

11 కంపెనీలు 350 మంది స్టాఫ్.. 

కరీంనగర్ ఐటీ టవర్ లో ప్రస్తుతం సుమారు రూ.5 కోట్ల పెట్టుబడితో11 కంపెనీలు రాగా.. ఇందులో మూడు కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిసింది. మరో రెండు కంపెనీలు సీటింగ్ కెపాసిటీ తగ్గించుకునేందుకు తమ ఎంప్లాయీస్ లో కొందరిని హైదరాబాద్ ఆఫీసులకు ట్రాన్స్ ఫర్ చేశాయి. కొత్తగా కార్యకలాపాలు స్టార్ట్ చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావడం లేదు.  ఇప్పటి వరకు వెయ్యి మంది ఫ్రెషర్స్ కు ఐటీ సెక్టార్ లో ట్రైనింగ్ ఇవ్వగా  ప్రస్తుతం 35‌‌0 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మిగతావాళ్లు ఇతర నగరాలకు వెళ్లిపోయారు. 

వరంగల్ లోనూ అంతే..

2020 జనవరిలో హనుమకొండ జిల్లా మడికొండలో టెక్ మహీంద్రా బ్రాంచ్, సైయెంట్ ఐటీ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ​మాట్లాడుతూ వరంగల్‍ సిటీని ఐటీ రంగంలో ముంబై, పుణే చేసే బాధ్యత తనదేన్నారు. తీరా చూస్తే మూడేండ్లు గడుస్తున్నా ఒక్క ఐటీ కంపెనీ రాలేదు. వరంగల్ లో  మూడో కంపెనీగా క్వాండ్రంట్‍ రిసోర్సెస్‍ సంస్థ తమ బ్రాంచ్‍ ఓపెన్‍ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం 1.5 ఎకరాల స్థలం ఇస్తున్నామని, 500 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆ కంపెనీ ప్రతినిధులు భూమి పూజ చేసినప్పటికీ.. పనులు అవలేదు. ‘త్వరలోనే వరంగల్ లో ఎల్‍అండ్‍టీ అనుబంధ సంస్థ మైండ్‍ ట్రీ కంపెనీ’ అంటూ 2020 ఫిబ్రవరి 12న కేటీఆర్ ట్విట్టర్‍ పోస్ట్ పెట్టారు. కానీ ఇప్పటికీ ఆ కంపెనీ రాలేదు. 

200 మందికి ఒకటే టాయిలెట్​

కరీంనగర్ ఐటీ టవర్ లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఏ ఫ్లోర్ లోనూ ఏసీలు పని చేయడం లేదు. ఒకరు ఏసీ పెంచితే.. మరొకరు బంద్ చేసే పరిస్థితి నెలకొంది. దీంతో మండు వేసవిలోనూ కిటికీలు తీసి, ఫ్యాన్లు వేసుకుని పని చేయాల్సి వస్తోంది. ఒక ఫ్లోర్ లో 200 మంది పని చేస్తుండగా.. కేవలం ఒక టాయిలెట్ మాత్రమే అందుబాటులో ఉంది.  రెండు లిఫ్టుల్లో ఇటీవల ఒక లిఫ్ట్ పాడైపోయింది. ఇటీవల ఈదురుగాలులు, వర్షాలతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగిన సందర్భాల్లో జనరేటర్ వేయలేదని, పాత డీజిల్ బిల్లులు మంజూరు కాకపోవడంతో డీజిల్ కొనడం లేదని నిర్వాహకులు చెప్పారని ఓ ఐటీ టవర్ ఎంప్లాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న రోడ్డు మీదుగా వెళ్లే హెవీ వెహికిల్స్ వైబ్రేషన్స్ కు ఇప్పటికే రెండు గ్లాసులు పగిలిపోయాయి.