- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో వచ్చే నెల 1 నుంచి 4వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కలెక్టర్ కొండగట్టులో జయంతి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ గతంలో కంటే ఘనంగా హనుమాన్ చిన్న జయంతి నిర్వహిస్తామన్నారు. హనుమాన్ దీక్ష పరులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. పార్కింగ్, కోనేరు, క్యూలైన్ వ్యవస్థలను చలువ పందిళ్లను నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేస్తామన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నడక దారుల్లో వచ్చే భక్తులకు తాగునీటి, విశ్రాంతి సౌకర్యాలు కలగ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈవో అంజనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
