న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌కు సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ క్షమాపణలు చెప్పారు. 2019, జనవరి 17న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జైరామ్ రమేశ్ వివేక్ దోవల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. వివేక్‌తోపాటు ఆయన కుటుంబానికి చెందిన బిజినెస్ వెంచర్ జీఎన్‌ఏ ఆసియా ఫండ్‌పై విమర్శలు, ఆరోపణలు చేశారు. తనపై వ్యతిరేక కామెంట్స్ చేయడంతోపాటు ఆర్టికల్స్ ప్రచురించినందుకు జైరామ్ రమేశ్‌తోపాటు కారవాన్ మ్యాగజీన్‌పై ఢిల్లీ కోర్టులో వివేక్ పరువు నష్టం కేసు వేశారు. ఈ విషయంలో తాజాగా రమేశ్ సారీ చెప్పారు. ఆయన క్షమాపణలను వివేక్ స్వీకరించడం గమనార్హం. తన కామెంట్స్‌పై రమేశ్ స్పందిస్తూ.. కొన్ని విషయాల్లో స్వతంత్ర్యంగా ధృవీకరించుకుంటే బాగుండేదన్నారు.
‘నా వ్యాఖ్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని అర్థమైంది. కారవాన్ మ్యాగజీన్‌లో క్రితం రోజు వచ్చిన ఆర్టికల్ ఆధారంగా నేను కామెంట్స్, ఆరోపణలు చేశా. కేసు ముందుకు సాగుతున్న క్రమంలో నా వ్యాఖ్యల విషయంలో స్వతంత్రంగా ధృవీకరించుకుంటే బాగుండేదని అనిపించింది. నా వ్యాఖ్యలకు గాను మీకు, మీ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నా. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లను వెబ్‌సైట్ నుంచి తొలగించాలని ఐఎన్‌సీని కోరుతున్నా’ అని వివేక్ దోవల్‌కు రాసిన లేఖలో జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.

