
స్కూల్లో చదివే రోజుల నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకున్నాడు. అబ్దుల్ కలాంను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయనలా సైంటిస్ట్ అవ్వాలని అనుకున్నాడు. అందరూ కష్టమైన సబ్జెక్ట్ అనుకునే ఫిజిక్స్‌ని ఇష్టంగా చదవడమే కాకుండా, అందులోనే పీహెచ్డీ కూడా చేశాడు. ఫిజిక్స్‌లో కొత్త రీసెర్చ్‌లు చేస్తూ ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు జక్కపల్లి పుండరీకం గౌడ్. మెదక్ జిల్లాలోని చిలప్‌చెడ్ మండలంలో ఉన్న అంతారం ఇతని సొంతూరు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. మారుమూల పల్లెటూరు నుంచి దక్షిణ కొరియా వరకు వెళ్లిన అతని రీసెర్చ్ జర్నీ ఇది...
‘‘మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ పేరు లక్ష్మమ్మ, నాన్న అంజా గౌడ్. నాకు ముగ్గురు అన్నలు, ఒక అక్క. పదో క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. హైస్కూల్ నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద, ఎక్స్పరిమెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నా. ‘కలలు కనండి. వాటిని నిజం చేసుకోండి’ అని అబ్దుల్ కలాం చెప్పిన మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని సైంటిస్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యా. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివా. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఫిల్ చదివేటప్పుడు అక్కడి ప్రొఫెసర్లు రీసెర్చ్ వైపు నన్ను ఎంకరేజ్ చేశారు.
లేజర్ టెక్నాలజీ సాయంతో...
ఎంఫిల్ తర్వాత హైద్రాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ జాయిన్ అయ్యా. ప్రొఫెసర్ కేసీ. జేమ్స్రాజ్ నాకు గైడ్. నా పీహెచ్డీ టాపిక్ ఏమిటంటే... లేజర్ టెక్నాలజీ ఉపయోగించి బేరియం, స్ట్రాన్షియం, టైటానియం వంటి మూలకాల్ని తక్కువ ఉష్ణోగ్రత దగ్గర క్రిస్టలైజ్ చేయడం. సబ్జెక్ట్ పుస్తకాలు చదవడం, ల్యాబ్లోఎక్స్పరిమెంట్స్ చేయడం, ఆర్టికల్స్ రాయడం.. పీహెచ్‌డీలో ఇదే నా దినచర్య.
పేటెంట్‌కోసం...
గైడ్ జేమ్స్ రాజ్ఆధ్వర్యంలో మా రీసెర్చ్ టీం బేరియం, స్ట్రాన్షియం, టైటానెట్ (బి.ఎస్.టి) పల్చని ఫిల్మ్‌లను తక్కువ ఉష్ణోగ్రతలో లేజర్ టెక్నాలజీ సాయంతో క్రిస్టలైజ్ చేశాం. దాంతో వీటిని మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలకు, కెపాసిటర్ల అనువర్తనాలకు పనికొచ్చే విధంగా తయరు చేశాం. ట్యూనబుల్ మైక్రోవేవ్ పరికరాల కోసం ఫెర్రో ఎలక్ట్రిక్ పల్చని ఫిల్మ్‌ను 300 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర లేజర్ సాయంతోక్రిస్టలైజ్ (స్పటికీకరించడం) చేశాం. మా ఇన్నొవేషన్‌కు ఇండియా పేటెంట్ రైట్స్ కోసం అప్లై చేశాం. ఈ రీసెర్చ్‌కు సంబంధించి నేను రాసిన ఆర్టికల్ 20 ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో పబ్లిష్ అయింది. పోయిన ఏడాదే థీసిస్ సబ్మిట్ చేసి, డాక్టరేట్ పట్టా సాధించాను.
రెండు లక్షలు అప్పు చేసి...
పీహెచ్డీ అవ్వగానే దక్షిణ కొరియాలోని యంగ్నమ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా (పీడీఎఫ్) అడ్మిషన్ రావడంతో ఎగిరి గంతేశా. కానీ, అక్కడికి వెళ్లేందుకు వీసా, ఫ్లైట్ టికెట్, అక్కడ రూం కోసం రెండు లక్షల రూపాయలు అవసరం అయ్యాయి. దాంతో, అప్పుచేయక తప్పలేదు. ఇప్పుడు రీసెర్చ్ ప్రొఫెసర్‌గా నెలకు లక్ష రూపాయల పైనే సంపాదిస్తున్నా. దక్షిణ కొరియా వెళ్లేందుకు చేసిన అప్పు కూడా తీర్చాను. పోయిన ఏడాది నవంబర్‌లో అక్కడి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్కూల్లో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా చేరాను. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ మెజర్మెంట్స్ సిస్టం, కెపాసిటర్స్, సెన్సర్స్, ఎనర్జీ హార్వెస్టింగ్ వంటి అప్లికేషన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచి నేను చదువులో ఎప్పుడూ ఫస్ట్ ఉండటంతో ‘నీకు నచ్చింది చదువుకో బిడ్డా’ అన్నారు అమ్మానాన్న. నన్ను బాగా చదివించేందుకు చాలా కష్టపడ్డారు. పేద కుటుంబంలో పుట్టినప్పటికి డెడికేషన్, హార్డ్‌వర్క్‌తో ఈ పొజిషన్‌కి వచ్చా. రీసెర్చర్‌గా సమాజానికి ఉపయోగపడే పరికరాలు తయారుచేయాలన్నదే నా లక్ష్యం.
::: తిమ్మన్నగారి శ్రీధర్, మెదక్, వెలుగు.