కొత్త ఏడాది జనవరిలో వచ్చే పండుగలు ఏంటీ.. వాటి విశిష్టత..

కొత్త ఏడాది జనవరిలో వచ్చే పండుగలు ఏంటీ.. వాటి విశిష్టత..

కొద్ది రోజుల్లో  కొత్త సంవత్సరం (2024)లోకి అడుగుపెట్టబోతున్నాం. జనవరి అంటే గుర్తొచ్చేది కొత్త సంవత్సరం (New Year) మాత్రమే కాదు, సంక్రాంతి సందడి కూడా. మరి జనవరిలో సంక్రాంతి తో పాటు ఏఏ పండుగలు ఉన్నాయో... వాటి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

జనవరి 2024 లో హిందువులకు సంబంధించి ఆరు పండుగలు ఉన్నాయి. ఈ పండుగులకు ఎంతో ప్రాధాన్యత.. విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు. 

జనవరి నెలలో వచ్చే పండుగల వివరాలు

  • 1.  సఫల ఏకాదశి (జనవరి 7)
  • 2. హనుమాన్​ జయంతి (జనవరి 11)
  • 3. భోగి (జనవరి 14)
  • 4. మకర సంక్రాంతి( జనవరి 15)
  • 5. శాకంబరీ నవరాత్రి(జనవరి 18)
  • 6. థాయ్​ పూసం (జనవరి 25 లేదా 26న)

1. సఫల ఏకాదశి(జనవరి 7)

ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి. ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉవవసించి.. జాగరణ చేసి.. శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. ముక్తి లభిస్తుంది. ఆ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఆ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

2. హనుమాన్​ జయంతి (జనవరి 11)

ఆంజనేయుని జననం వెనుక ఎన్నిరకాల గాథలు ఉన్నాయో… వాటిని జరుపుకొనేందుకు కూడా అన్ని రకాల తిథులు ఉన్నాయి. ఉత్తరాదిలో, తెలుగునాట, తమిళనాట… ఇలా ఒకోచోట ఒకో సమయంలో ఈ జయంతిని నిర్వహిస్తారు.అంజన అనే అస్పరస, కేసరి అనే మహనీయులకు జన్మించినవాడే ఆంజనేయుడు. అంజనాదేవి సాక్షాత్తు ఆ శివుడే తనకు బిడ్డగా జన్మించాలని కోరుకుందట. దాంతో ఆయన అంశతో ఉద్భవించాడు హనుమ. మరో ఐతిహ్యం ప్రకారం… ఆయన జననంలో వాయుదేవుని మహిమ కూడా ఉంది. అందుకనే తనకి పవనసుతుడనే పేరు వచ్చింది.

ఏకాదశ రుద్రులలో ఒకడు ఆంజనేయుడు, పరమేశ్వరుడి అంశతో జన్మించినవాడు, సప్త చిరంజీవుల్లో ఒకడు. ఇప్పటికీ  హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ జీవించి ఉన్నాడని విశ్వసిస్తారు.  ఎక్కడ రామనామం జపిస్తారో, ఎక్కడ రామాయణం చెబుతుంటారో అక్కడ ఆనంద భాష్పాలతో చేతులు జోడించి నమస్కరిస్తూ ఆంజనేయుడు కూర్చుని ఉంటాడట. రామకధ చెప్పే సభకు అందరి కన్నా ముందుగా వచ్చి అందరూ వెళ్లిపోయేవరకూ ఉంటాడట. హనుమంతుడిని పూజిస్తే రోగాలు నయమవుతాయి, భూతప్రేత పిశాచాలు పారిపోతాయి, చేసే పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది, శని బాధలు తొలిగిపోతాయి, బుద్ధి బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం పెరుగుతుందని పండితులు చెబుతారు...

3. భోగి (జనవరి 14)

తెలుగు లోగిళ్ల ముంగిట ముచ్చటైన ముగ్గులతో ఆడపడుచుల సందడి మొదలైంది. మూడు రోజుల సంక్రాంతి పండుగకు సమయం ఆసన్నమైంది. ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి. దక్షిణాయనంలో సూర్యుడు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ.. దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై చలి పెరుగుతుంది.ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రజలు సెగ కోసం చలి మంటలు వేసుకునేవారు. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ.. రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలను భోగి మంటలుగా వ్యవహరిస్తారు. 

 4. మకర సంక్రాంతి( జనవరి 15)

సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని భారత్ లో అందరూ జరిపుకుంటారు. తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి కాలంతో పనిలేదనే సిద్ధాంతాన్ని పక్కనబెడితే, కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. పవిత్రమైన, శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైందని ఆగమాలు విశదీకరిస్తున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయం. దేశమంతటా ఈ పర్వదినానికి ప్రాముఖ్యమున్నా, ఆచరించే పద్ధతుల్లో మాత్రం వైవిధ్యం కనిపిస్తుంది. ఆ రోజునే కేరళ శబరిమల కొండల్లో అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారని భక్తు విశ్వాసం.

5. శాకంబరీ నవరాత్రి(జనవరి 18)

శాకంబరీ  నవరాత్రి  పండుగను  2024 జనవరి 18 న జరుపుకుంటారు.  దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఆ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. దేవి శాకంబరీ పూర్ణిమ రోజున శాకంబరీ దేవి అవతరించినట్లు నమ్ముతారు.  తొమ్మిది రోజుల శాకంబరి నవరాత్రి ఉత్సవాల ముగింపును కూడా సూచిస్తుంది. కర్ణాటకలో శాకంబరి దేవిని పూజిస్తారు,మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ మరియు రాజస్థాన్ లో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 

శాకంబరీ జయంతి దుర్గామాత అవతారంగా నమ్మబడే శాకంబరీ మాతకు అంకితం చేయబడింది. శాకంబరి మాత  కూరగాయలు, పండ్లు ,  పచ్చి ఆకులకు సంబంధించిన  దేవత. వందేళ్ల కరువు తర్వాత దుర్గాదేవి శాకంబరీ మాతగా దర్శనమిచ్చినట్లు దేవి మహాత్యంలో పేర్కొన్నారు. మొక్కలన్నీ చచ్చిపోయి తినడానికి ఏమీలేకుండా ఉన్న సమయంలో  శాకంబరీ మాత ప్రజల ఆకలిని తీర్చడానికి తన శరీరం నుండి పండ్లు, పువ్వులు, కూరగాయలు ..  మూలికలను తీసుకువచ్చి.. భక్తులకు పంచిందని పండితులు చెబుతున్నారు. 

శాకంభరి దేవికి అంకితం చేయబడిన కొన్ని ముఖ్యమైన ఆలయాలు కర్ణాటక,మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ మరియు రాజస్థాన్ లో ఉన్నాయి,  కర్ణాటకలో ఆమెను బనశంకరి దేవి అని పిలుస్తారు. శాకంబరీ దేవి కథ దేవీ మహాత్యంలో ప్రస్తావించారు. శాకంబరీ దేవికి అంకితం చేయబడిన ఆలయాలలో ఆ రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.

6. థాయ్​ పూసం (జనవరి 25... కొన్ని ప్రాంతాల్లో 26న)

థాయ్ పూసం ...... హిందూ దేవుడు మురుగన్, శివుడు .... పార్వతి అమ్మవారికి సంబంధించిన  పండుగ.   మురుగన్‌ను కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ, షడనన, స్కంద .. గుహ అని కూడా పిలుస్తారు. తారకాసురుని రాక్షస సైన్యాన్ని ఓడించడానికి  ... వారి దుష్టకార్యాలను ఎదుర్కోవడానికి ఆ రోజున పార్వతీ దేవి మురుగన్‌కు ఈటెను సమర్పించిందని పురాణాలు చెబుతున్నాయి. అంటే థాయ్ పూసం అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి సంబంధించిన వేడుక.  ఈ పండుగను  ప్రధానంగా భారతదేశంలో   తమిళనాడు, కేరళ, కర్నాటక , ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా , మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక సహా  ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో  హిందీ,  తమిళం  మాట్లాడే వారు  జరుపుకుంటారు.