ఉద్యోగ నియామకాలు..వేగంగా చేపట్టాలి

ఉద్యోగ నియామకాలు..వేగంగా చేపట్టాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వ నూతన మంత్రివర్గం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడింది. ముఖ్యమంత్రి, మంత్రులు  వారికి కేటాయించిన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖలలో జరుగుతున్న పనులు, అభివృద్ధిపై సమీక్షించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై డిసెంబర్ 20న రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. 

రూ.6.72 లక్షలకు కోట్లకు పైగా గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో అప్పులు చేసినట్టు, వడ్డీల కింద సంవత్సరానికి రూ.67 వేల కోట్లు  చెల్లించాల్సి ఉందని వివరించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు, నియామకాలపై కూడా శ్వేతపత్రం పెడితే బాగుండేదని రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోరుకుంటున్నారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వం అనుసరించిన  నియంతృత్వ విధానాలు, ప్రజాసంఘాల ఉద్యమాలపై ఉక్కుపాదం,  గతంలో ఇచ్చిన హామీలు అమలుపరచకుండా  ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయకుండా కొనసాగిన నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత వ్యతిరేకత కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు  ఎన్నో ఆశలు పెట్టుకొని వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్న వేళ నూతన ప్రభుత్వం ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. 

రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయాలంటే పటిష్టమైన యంత్రాంగం అవసరం. సమర్థులైన  సిబ్బంది ఉన్నప్పుడే  ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. డైరెక్టు రిక్రూట్మెంట్​తో యంగ్ ఆఫీసర్లు, నిజాయతీపరులైన సిబ్బంది వస్తే వారంతా రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు పక్కాగా అమలవుతాయి.   

2.5 లక్షల పోస్టులు భర్తీ చేయాలె

గత 9 ఏండ్లలో దాదాపు 60 వేల మందికి పైగా రిటైరు అయ్యారు. దాదాపుగా 4 వేల మంది ఉద్యోగుల సర్వీసును  పొడిగించారు. రిటైర్ అయిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగాల కోసం వేల సంఖ్యలో నిరుద్యోగ యువత ఎదురుచూస్తుంటే వారిని విస్మరించటం విచారకరం. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడిన సమయానికే 1.07 లక్షలు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. దీనికి అదనంగా ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. అంతకు ముందు నుంచి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయక పోగా,   రిటైర్ అవుతున్న వారి స్థానంలోనూ రిక్రూట్మెంట్స్ చేయలేదు. 

58 సంవత్సరాలు నిండిన వారి సర్వీసును 61సంవత్సరాల రిటైర్మెంట్​కు పెంచి కొనసాగించింది. కొత్త ఉద్యోగాలు నియామకాలు జరగపోవటంతో ప్రభుత్వ ఆఫీసులో ఖాళీల సంఖ్య పెరిగి ప్రజల పనులు జరగటం లేదు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతున్నది. పాత పది జిల్లాలను పరిపాలన సౌలభ్యం పేరుతో 33 జిల్లాలుగా విభజించారు. దీంతో 23 కొత్త జిల్లాలలో వేల సంఖ్యలో ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.2018 ఎన్నికల ముందు గత ప్రభుత్వం ఖాళీల భర్తీని త్వరగా చేపడతామని హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలిసింది.

2021 లో రాష్ట్రంలో 80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని త్వరలో భర్తీ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చారు. కానీ ఇవేవీ పూర్తి చేయకపోగా టీఎస్పీఎస్సీ ద్వారా ప్రకటించిన గ్రూప్​ -1, 2, 3, 4​ పరీక్షలను నిర్వహించటంలో వైఫల్యం చెందింది గత ప్రభుత్వం. పేపర్​ లీకులు, పరీక్షల వాయిదాలతో అపవాదు పాలైంది.

పారదర్శకంగా కానిస్టేబుల్ నియామకాలు 

పోలీస్​శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  సివిల్, ఏఆర్ తదితర విభాగాల్లో  మొత్తం 16,604 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో, పరీక్షలు నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకుండా న్యాయపరమైన అంశాల్ని పూర్తి చేసి కానిస్టేబుల్ నియామకం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, వివిధ కమిషనరేట్లలో కలిపి రాష్ట్రంలో మొత్తం మూడు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటాయని అంచనా. ఈ పోస్టులను భర్తీ చేసి, ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయడాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం కీలక బాధ్యతగా  స్వీకరించాలి.

నిరుద్యోగుల ఎదురుచూపు

అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం  నియామకాల ప్రక్రియను టిఎస్​పీఎస్సీ ద్వారా చేపడతామని పారదర్శకంగా ఉండేవిధంగా అధికారులను ఆదేశించారు. దీంతో నిరుద్యోగులు ఖాళీల భర్తీకి తీసుకుంటున్న చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా డీఎస్సీ ని ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లో భర్తీ చేస్తాం అని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నది. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి అడిగి తెలుసుకున్నారు. దీంతో నిరుద్యోగ యువతలో ఉద్యోగ సాధనపై ఆసక్తి పెరిగింది. 

పదోన్నతులతో మరిన్ని ఖాళీలు

రాష్ట్రంలో 9,370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ గతంలోనే గుర్తించింది. వాటిలో 5,029 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను గత ప్రభుత్వమే మంజూరు చేసింది. దీంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సంఖ్య 6,612 కు చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను మరో 5 వేలకు  పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్​ నర్సుల నియామకం 

వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల నియామకం కోసం రాష్ట్ర మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్  5,204 పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన చేసింది. సుమారు 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి రాత పరీక్షలు కూడా నిర్వహించారు. ఫలితాలను వెల్లడించి నియామకాలు వెంటనే చేపట్టాల్సి ఉంది.  కొత్త  ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 1,800 మంది నర్సింగ్ పోస్టుల భర్తీ చేయుటకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష చేసి గ్రీన్​సిగ్నల్ ఇచ్చారు.

- ఉజ్జిని రత్నాకర్ రావు,సీపీఐ సీనియర్​నాయకుడు