జిన్ పింగ్ ‘నియంత’

జిన్ పింగ్ ‘నియంత’
  • అమెరికా ప్రెసిడెంట్​ బైడెన్ కామెంట్.. మండిపడ్డ చైనా

బీజింగ్: అమెరికా, చైనా మధ్య మళ్లీ టెన్షన్ నెలకొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటించిన తెల్లారే రెండు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ ను ‘నియంత’ అంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కామెంట్ చేయడం తాజా వివాదానికి కారణమైంది. బైడెన్ కామెంట్లపై చైనా తీవ్రంగా మండిపడింది. అవి అసంబద్ధమైనవని, బాధ్యతారహితమైనవని ఫైర్ అయింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు.

‘‘అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయంగా కవ్వింపులకు దిగడమే. ఆయన డిప్లమాటిక్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించారు” అని ఫైర్ అయ్యారు. ‘‘అమెరికా పేల్చేసింది స్పై బెలూన్ కాదు. అది మేం వాతావరణ పరిశోధన కోసం తయారు చేసింది. అనుకోకుండా అమెరికా వైపు వెళ్లింది. ఈ ఘటనను అమెరికా తనకు అనుకూలంగా మార్చుకొని చెబుతోంది” అని మండిపడ్డారు.  

బైడెన్ ఏమన్నారంటే.. 

మంగళవారం కాలిఫోర్నియాలో ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిన్ పింగ్ ‘నియంత’ అంటూ ఆయన కామెంట్లు చేశారు. 
‘‘ఈ ఏడాది మొదట్లో మేం చైనా స్పై బెలూన్ ను పేల్చేశాం. దీంతో జిన్ పింగ్ ఇబ్బంది పడ్డారు. ఆ బెలూన్ వెళ్లాల్సిన చోటుకు వెళ్లలేదు. దారి తప్పింది. అసలేం జరుగుతున్నదో ఆయనకు తెలియలేదు. ఇలాంటి టైమ్ లో జిన్ పింగ్ లాంటి నియంతలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు” అని అన్నారు.