నవంబర్ 10లోగా రైతులతో అగ్రిమెంట్ చేసుకోవాలి

నవంబర్ 10లోగా రైతులతో అగ్రిమెంట్  చేసుకోవాలి
  • రూ.-261 కోట్ల బకాయిలు త్వరగా చెల్లించాలి
  • సీడ్​ కంపెనీలకు జోగులాంబ కలెక్టర్  సంతోష్​ ఆదేశం

గద్వాల, వెలుగు: సీడ్  విత్తన పత్తి సాగు చేసే రైతులతో నవంబర్ 10లోగా సీడ్​ కంపెనీలు అగ్రిమెంట్  పూర్తి చేసుకోవాలని, చెల్లింపు విషయంలో కంపెనీలు సహకరించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని జోగులాంబ గద్వాల కలెక్టర్  సంతోష్  హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో కంపెనీలు, సీడ్  ఆర్గనైజర్లతో మీటింగ్  నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో 46 వేల ఎకరాలలో 36,430 మంది రైతులు సీడ్  పత్తిని సాగు చేశారని చెప్పారు. 

వారికి రూ.261 కోట్లు బకాయి ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా చెల్లించాలని సూచించారు. ఇప్పటి వరకు అగ్రిమెంట్  చేసుకోని కంపెనీలు వచ్చే నెల10లోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో కొంత కాలంగా అగ్రిమెంట్లు, చెల్లింపుల విషయంలో సమస్యలు రావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. చెల్లింపుల విషయంలో కంపెనీలు సహకరించకుంటే లైసెన్స్  రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని హెచ్చరించారు. ఇన్​చార్జి డీఏవో జగ్గు నాయక్, ఏడీఏ సంగీతలక్ష్మి పాల్గొన్నారు.