కరుణ చూపి.. క్రమబద్ధీకరించండి

కరుణ చూపి.. క్రమబద్ధీకరించండి

ఉ న్నత చదువులు చదివి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనుకున్నారు. పల్లె ప్రజలకు సేవలు అందించడంతో పాటు పల్లె ప్రగతికి పాటుపడాలనే ఆశయంతో గ్రామ కార్యదర్శి పదవిలో చేరారు. కానీ ఒక పక్క పని భారం పెరగడం మరోపక్క క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కరుణ చూపకపోవడంతో ఉద్యోగ భద్రత లేక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ తో కొలువులోకి తీసుకున్న ప్రభుత్వం నాలుగేండ్లు గడుస్తున్నా రెగ్యులరైజ్ చేయడం లేదు. రాష్ట్రంలో 9,355 మంది గ్రామ కార్యదర్శులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

ఉద్యోగ భద్రత లేక..

నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు తర్వాత అనేక గ్రామపంచాయతీల్లో గ్రామ కార్యదర్శుల కొరత ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2018 ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడింది. మూడేండ్ల ప్రొబిషనరీ పీరియడ్,15 వేల గౌరవ వేతనం, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- 2018 ఆధారంగా పనితీరు అంచనా వేయడం వంటి షరతులతో ఈ నియమకాలు చేపట్టింది. 2018 అక్టోబర్ 10న పరీక్ష జరిపి ఎంపికైన వారిని 11 ఏప్రిల్​2019 నుంచి గ్రామ కార్యదర్శులుగా నియమించింది. 2022 ఏప్రిల్ 12 నాటికి మూడేండ్ల ప్రొఫెషనరీ పూర్తయిన కార్యదర్శుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం చొరవ చూపలేదు. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్​మెంట్ యాక్ట్​కు విరుద్ధంగా ఉత్తర్వు నెంబర్ 26 ద్వారా ప్రొబేషనరీ పీరియడ్​ను మరో ఏడాది పెంచింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన దాని ప్రకారం మూడేండ్ల తర్వాత గ్రేడ్- 4 ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం మాటిచ్చినా, ఉద్యోగ భద్రత మాత్రం కల్పించడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్12తో గ్రామ కార్యదర్శుల పదవీకాలం నాలుగేళ్లు పూర్తి అయింది. జీవో నెంబర్ 26 రద్దు చేసి గ్రామ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడం, సెర్ప్, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో గ్రామ కార్యదర్శులు కూడా  ప్రభుత్వ నిర్ణయం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

కార్యదర్శి కొలువు కష్టాలకు నెలవు..

కష్టపడి చదువుల్లో రాణించి నేరుగా కొలువులు కొట్టినా, ఉద్యోగ బాధ్యతల్లో ఒత్తిడి పెరగడంతో గ్రామ కార్యదర్శులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో రికార్డులు బడ్జెట్ నిర్వహణ, జనన మరణ పత్రాల జారీ, ఆస్తి పన్ను వసూలు, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, స్వచ్ఛ భారత్ మిషన్, హరితహారం, ఆస్తుల ఆన్​లైన్ ప్రక్రియ తదితర 50 రకాల విధులు నిర్వహిస్తున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలపాటు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీటికి తోడు వీరి హయంలోనే డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న అవార్డుల్లో మెజార్టీ అవార్డులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీలనే వరిస్తున్నాయి. 

ఆ విజయం వెనుక పంచాయతీ కార్యదర్శుల కృషి దాగి ఉన్నది. రాష్ట్రంలో నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో గ్రామ కార్యదర్శులు కీలక పాత్ర పోషించారు. ఇంత చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్యదర్శుల క్రమబద్ధీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.  స్థానిక రాజకీయాల్లో నోటీసులు వేధింపులు భరించలేక ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 1500 మంది ఉద్యోగాలు వదిలేశారు. గుండెపోటు ఇతర ఆనారోగ్య సమస్యలతో 40 మంది వరకు గ్రామ కార్యదర్శులు మృతి చెందారు. గత పీఆర్సీలో భాగంగా 30 శాతం జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తమపై కరుణ చూపించి రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు. హక్కుగా సమ్మె చేయడం లేదని, రెగ్యులరైజ్​ చేయాలని అభ్యర్థించడం కోసం సమ్మె చేస్తున్నామని వారు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా, సర్కారు చలించడం లేదు. పైగా వెంటనే ఉద్యోగాల్లో చేరాలని, లేదంటో ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేయడం బాధాకరం.

- అంకం నరేష్, కో కన్వీనర్,  యూఎఫ్​ఆర్టీఐ