ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం: జూపల్లి కృష్ణారావు

ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం: జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్/కోడేరు, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీటిని అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల రైతు వేదికలో ఆదివారం ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు.

పెద్ద కార్పాముల, చిన్న కొత్తపల్లి గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానన్నారు.  అనంతరం పెద్దకొత్తపల్లి నుంచి పెద్దకర్పాముల వరకు ఉన్న పలు కాలువల పూడికలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులతో చర్చించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని చెప్పారు.

పాఠశాలల అభివృద్ధికి కృషి

తన నియోజకవర్గ నిధుల నుంచి పేద విద్యార్థులు, పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జూపల్లి తెలిపారు. కొల్లాపూర్ మండలం సోమశిల స్కూల్​లో దివంగత అడిషనల్​ఎస్పీ ప్యారసాని మురళి స్మారకార్థం ఏర్పాటు చేసిన భోజనశాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సోమశిల పాఠశాలకు ఏసీడీఎఫ్ కింద​ రూ.5 లక్షలు కేటాయిస్తున్ననట్లు ప్రకటించారు.  మంత్రి వెంట ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,  మురళి కుటుంబ సభ్యులు, సన్నిహితులు జగదీశ్​, గ్రామ మాజీ సర్పంచ్  బింగి మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మను దర్శించుకున్న జూపల్లి 

నాగినేనిపల్లి మైసమ్మ తల్లిని ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మైసమ్మ దేవస్థాన చైర్మన్ బి. శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తగిలి కృష్ణయ్య పాల్గొన్నారు.