‘పుట్టుకతో ఎవరూ నేరస్తులు కాదు. పరిస్థితుల ప్రభావం, సామాజిక, ఆర్థిక, నిరక్షరాస్యత, తల్లితండ్రుల నిర్లక్ష్యంతో పాటు ఒక నేరానికి అనేక కారణాలు ఉంటాయి’ అని ‘జావిద్ గులాం నబీ షేక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర’ 2024 (3) ALT (Crl.) 15(SC) కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. నేరం రుజువు అయ్యేంతవరకు కేసు నమోదైన వ్యక్తి నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రమేనని, బెయిల్ సమయంలో కోర్టు లేదా ప్రాసిక్యూషన్.. ఆర్టికల్ 21 ప్రాముఖ్యతను పరిగణించాలని వివరిస్తూ నేరం తీవ్రమైనదని బెయిల్‌ను తిరస్కరించడానికి వీలు లేదని చెప్పింది. అయితే, కింది కోర్టులో బెయిల్ విషయంలో కాస్త జాప్యం జరుగుతుండడం వలన బెయిల్ నిరాకరణపై పై కోర్టులకు వెళ్లిన క్రమంలో సుప్రీంకోర్టు ‘బెయిల్ అనేది హక్కు అని, జైలు అనేది మినహాయింపు’ అని మరోసారి గుర్తు చేసింది.
క్రిమినల్ కేసుల్లో నేర విచారణ జాప్యం తగదని, సుప్రీంకోర్టు మరోసారి సత్వర విచారణ ఆర్టికల్ 21లో భాగమని నొక్కి చెప్పింది. నేరం ఆరోపించి విచారణ పేరుపై జైల్లో సంవత్సరాల తరబడి ఉంచడం రాజ్యాంగ హక్కును ఉల్లంఘించినట్లేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. హైకోర్టులతో పాటు దిగువ కోర్టులు కూడా బెయిల్ విషయంలో కొంత జాప్యం చూపిస్తున్నాయని, దిగువ కోర్టులు ట్రయల్ పూర్తి చేయడానికి సంవత్సరాలు తీసుకుంటున్నాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న జావేద్ గులాం నబీకి బెయిల్‌ను మంజూరు చేసింది.
విచారణ పేరిట ఎన్నో ఏండ్లుగా జైల్లోనే నిందితులు
‘గుడికంటి నర్సింహులు వర్సెస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్’ (1978) 1 SCC 240 కేసులో బెయిల్ ఇస్తే ట్రయల్ సమయంలో హాజరు అవుతాడా లేదా చూడాలి తప్ప అది వారి పాలిట శిక్షగా ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ‘గురుబక్ష్ సింగ్ సిబ్బ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్’ 1980 కేసులో కూడా మళ్ళీ అదే భావనను సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ‘హుస్సేన్ నరా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్’ 1980 కేసులో సత్వర లేదా వేగవంతమైన విచారణ ఆర్టికల్ 21లో భాగం, అలా జరగని క్రమంలో వారి హక్కును హరించినట్లేనని దేశ ఉన్నత న్యాయస్థానం చెప్పింది. నేషనల్ క్రైమ్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం వివిధ జైళ్లల్లో 4,25,069 మంది ఉండాల్సిన ఖైదీలు పరిధి దాటి 5,54,034 మంది అదనంగా ఉంటున్నారు. వీరిలో 1,22,852 మంది శిక్ష పడ్డ వాళ్ళని, మిగిలిన 4,27,165 మంది ఇంకా నేర విచారణలో భాగంగా ఉన్నారు.
కోర్టులను పెంచాలి
సకాలంలో సరైన తీర్పు రాకపోవడం వలన జైల్లో ఉంటున్న నిందితులు వారి గుర్తింపును కోల్పోతారు. సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా, స్వేచ్ఛ, గౌరవాన్ని కోల్పోతారు. దీంతో అనేక సమస్యలకు గురవుతారు. తద్వారా ఆ పరిణామం వారిలో సమూలమైన మార్పులకు దారితీస్తుందని ప్రిజనర్ వర్సెస్ స్టేట్ 1993లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొన్నది. ఈ దేశంలో జనాభా దామాషా కంటే కోర్టులు తక్కువగా ఉన్నాయి. తద్వారా జైల్లో ఖైదీలుగా ఎంతోమంది అమాయకులు వారి కుటుంబానికి, స్వేచ్ఛకు, దూరంగా బతకడం వలన వారికున్న రాజ్యాంగ హక్కులను కూడా కోల్పోతున్నారు. కాబట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అధికస్థాయిలో కోర్టులను పెంచుతూ జడ్జీలను రిక్రూట్ చేసుకోవడం ద్వారా సత్వర న్యాయాన్ని దేశ పౌరులకు అందించవచ్చు.
- రాచకొండ
ప్రవీణ్ కుమార్, న్యాయవాది