సరైన విచారణ ప్రక్రియతోనే న్యాయం గెలుస్తుంది : బసవరాజు నరేందర్ రావు

సరైన విచారణ ప్రక్రియతోనే న్యాయం గెలుస్తుంది : బసవరాజు నరేందర్ రావు

ఇటీవల మన సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఒక సంచలనాత్మక తీర్పు న్యాయ కోవిదుల మస్తిష్కాల్లో వేలాది ప్రశ్నలను జనింపజేస్తున్నది. మన న్యాయస్థానాలు అనుసరిస్తున్న న్యాయవిచారణ ప్రక్రియలోని లోపాల్ని ఎత్తి చూపుతూ, వాటిని సవరించుకోవాల్సిన ఆవశ్యకతను చెప్పకనే చెబుతున్నది. అత్యంత దారుణమైన ‘మానభంగం -హత్య కేసు’ విచారణలో, ట్రయల్ కోర్ట్ తన విచక్షణాధికారాన్ని వినియోగించకుండా, అత్యంత అరుదైన నేరాల్లో మాత్రమే విధించాల్సిన ఉరిశిక్షని నిందితులకు విధించిందని, ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలు నమ్మదగినవిగా లేవని అభిప్రాయపడుతూ, ‘బెనిఫిట్ ఆఫ్​ డౌట్’​ సూత్రం అనుసరిస్తూ ట్రయల్ కోర్ట్ విధించిన ఉరి శిక్షను కొట్టివేస్తూ, నిందితులని విడుదల చేయాలని సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది. న్యాయ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మౌలిక న్యాయసూత్రాల ఆవశ్యకతని వివరిస్తూ, వాటిని అనుసరించనందునే ట్రయల్ కోర్ట్ తీర్పును  కొట్టివేశామని తెలిపింది. దాంతోపాటు ట్రయల్ కోర్టు తీర్పును ఆమోదించిన హైకోర్టు తీర్పును కూడా
సుప్రీంకోర్టు తప్పుబట్టింది. 

అసలు కేసు ఏమిటంటే..

ప్రాసిక్యూషన్ ప్రకారం 2012 ఫిబ్రవరి 9న రాత్రి 8 గంటల 45 నిమిషాలకు గురుగ్రాంలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి(19), తన స్నేహితురాళ్లు ఇద్దరితో ఇంటికి వెళ్తున్నది. న్యూఢిల్లీ చావ్లాలోని హనుమాన్ చౌక్ ప్రాంతంలో ఒక ఎర్ర రంగు గల కారు ఒక్కసారిగా వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ యువకుడు యువతి(19)ని కారులోకి బలవంతంగా ఎక్కించుకొని వేగంగా వెళ్లిపోయాడు. ఈ సమాచారం అందడంతో పోలీసులు కేసును కిడ్నాప్ నేరంగా భావించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేబట్టారు. నగరమంతటా వెతుకుతున్న సమయంలో ఫిబ్రవరి13న న్యూ ఢిల్లీ లోని సెక్టార్ 9 ద్వారకా ప్రాంతపు మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఒక ఎర్ర కారు కనిపించింది. ఆ కారును అదుపులోకి తీసుకొని అందులో ఉన్న రాహుల్ అనే వ్యక్తిని ప్రశ్నించడంతో పొలీసులకు కీలక విషయాలు తెలిశాయి. రాహుల్, అతని సోదరుడు రవి, మరొక వ్యక్తి వినోద్ అలియాస్ చోటుతో కలిసి ఫిబ్రవరి 9న రాత్రి ఒక యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక మానభంగం చేసి, చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ వివరాల ప్రకారం.. వెతకగా గాయాలతో ఉన్న ఒక యువతి మృత దేహం బయట పడింది. పోస్ట్ మార్టం రిపోర్టులో గాయాలకు కారణం కారు జాక్, పానా కావచ్చన్న అభిప్రాయాన్ని వైద్య నిపుణుడు వెలిబుచ్చాడు. లోతుగా దర్యాఫ్తు జరిపిన పొలీసులు దొరికిన ఆధారాలను ట్రయల్ కోర్టుకు అందజేశారు.

సామాన్యుడి ప్రశ్నలు

నేరం,-శిక్ష విషయంలో విచారణ కోర్టులకు కొన్ని మార్గదర్శకాలున్నాయి. విచారణ సందర్భాల్లో ఈ కోర్టులు తమ విచక్షణాధికారాన్ని వినియోగించకపోవడం వల్లనే   కింది కోర్టుల తీర్పులు మార్పులు చెందుతూ, కొన్ని సందర్భాల్లో కొట్టివేతకు గురవుతాయి. అయితే ఈ సందర్భంగా సామాన్యుడు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెపాల్సిన అవసరం మన న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. ఒకవేళ సరైన సమాధానం లభించనప్పుడు సామాన్యుడికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎలా కలుగుతుంది? సామాన్యుడు  సంధిస్తున్న ప్రశ్నలను పరిశీలిస్తే  మొదటి ప్రశ్న మన ట్రయల్ కోర్టులు వెలువరించే తీర్పులు న్యాయమైనవేనా ? ఒకవేళ అవి న్యాయమైన తీర్పులే అయితే ఉన్నత న్యాయ స్థానాల్లో ఎందుకు కొట్టివేతకు గురవుతున్నాయి? పై యువతి కేసులో నిందితులు నిజంగా నిర్దోషులై  ఉండి తమ అశక్తతవల్ల సుప్రీంను ఆశ్రయించక పోయి ఉంటే, వారికి ఉరిశిక్ష అమలు జరిగితే, వారికి, వారిపై ఆధారపడిన కుటుంబాలకు అన్యాయం జరిగేది కదా? తీవ్రమైన నేరాల విషయంలోనైనా నిజాన్ని రాబట్టేందుకు లై డిటెక్టర్ పరీక్ష చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక న్యాయమూర్తి విజ్ఞతకే కాకుండా న్యాయకోవిదులతో కూడిన ఒక జ్యూరి ఏర్పాటు అవసరం. న్యాయ విచారణ ప్రక్రియ లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మన న్యాయ వ్యవస్థ తప్పకుండా స్పందిస్తుందని ఆశిద్దాం.

విచారణలో విచక్షణ కీలకం

కేసువిచారించిన అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి నిందితులకు 2014 ఫిబ్రవరి 19న ఉరిశిక్ష విధించారు. తర్వాత హైకోర్టు కూడా2014 ఆగస్టు 26న ఉరిశిక్షను ధ్రువీకరించింది. ఆ తరువాత ముగ్గురు నిందితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణకు ముగ్గురు సభ్యులు గల ధర్మాసనం ఏర్పాటైంది. కేసును సునిశితంగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. న్యాయ విచారణ ప్రక్రియను పరిగణనలోకి తీసుకోకుండా విచక్షణను ఉపయోగించకుండా, అచేతనంగా ట్రయల్ కోర్ట్ న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం వల్లనే ఈ తీర్పును కొట్టివేయాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది. సాధారణ నేరాల విషయంలో అంతగా ఆసక్తి చూపని మన సమాజం, మహిళల మీద అమానుషాల విషయంలో ముఖ్యంగా  మానభంగం, హత్యల విషయాల్లో తీవ్రంగానే స్పందించి నిందితులకు  తీవ్రమైన శిక్షలను విధించాలని కోరుకుంటుంది. నేరస్థులకు అటువంటి శిక్షలు విధించని తీర్పుల్ని అన్యాయమమైన తీర్పులుగా భావిస్తుంది. పై కేసు విషయంలో సర్వోన్నత న్యాయ స్థానం నిందితుల ఉరి శిక్షను రద్దు చేయగానే సమాజం తీవ్రంగా స్పందించింది. అన్యాయమని ఘోషించింది. 

- బసవరాజు నరేందర్ రావు,
అడ్వకేట్, హైదరాబాద్