కాళేశ్వరం పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​ రెడీ!

కాళేశ్వరం పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​ రెడీ!
  • కాగ్ డ్రాఫ్ట్​ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ నివేదిక, సీడబ్ల్యూసీ లేఖల ఆధారంగా తయారీ
  • మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు, పంపుహౌస్​ల మునక
  • కరెంట్​బిల్లుల భారం సహా పలు కీలకాంశాల విశ్లేషణ
  • ప్రాణహిత-చేవెళ్ల ప్రయోజనాలను వివరించే చాన్స్
  • 29న మేడిగడ్డ వద్ద ప్రజెంటేషన్​ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇవ్వనున్న పవర్​పాయింట్​ప్రజెంటేషన్(పీపీటీ) ​దాదాపుగా రెడీ అయ్యింది. ఇరిగేషన్​శాఖలో పని చేసిన రిటైర్డ్​చీఫ్​ఇంజినీర్​ఆధ్వర్యంలో దీన్ని తయారు చేస్తున్నారు. పలువురు ఇరిగేషన్ ఎక్స్​పర్ట్​లు పీపీటీ రూపొందించడంలో తోడ్పాటు అందిస్తున్నారు. ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి ఈ పీపీటీకి ఓకే చెప్పిన తర్వాత ఫైనల్​ప్రజెంటేషన్​సిద్ధం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఫైనల్​పీపీటీ రెడీ అయ్యే అవకాశముందని తెలుస్తున్నది. ఈ నెల 29న మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఈ ప్రజెంటేషన్​ఇవ్వనున్నారు. ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబుతో పాటు ఆ రోజు అందుబాటులో ఉండే ఇతర మంత్రులు కూడా ఇందులో పాల్గొననున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్​ను మంత్రులు, ఇంజనీర్లు పరిశీలిస్తారు. అక్కడ ఎల్​అండ్​టీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మట్టికట్టను పరిశీలించి, బ్యారేజీ పునరుద్ధరణకు చేపట్టబోయే చర్యలపై సమీక్షిస్తారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్​ప్రాజెక్టులపై మంత్రి రివ్యూ చేస్తారు. ఆ తర్వాత టైమ్ ఉంటే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేలా మంత్రుల టూర్ షెడ్యూల్​రూపొందిస్తున్నారు.

ప్రాణహిత–చేవెళ్ల లిఫ్ట్​స్కీంను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్​చేయడం, ఈ క్రమంలో రాష్ట్ర ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​తో సీడబ్ల్యూసీ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, కేంద్రం నుంచి చేసిన సూచనలతో పీపీటీని ప్రారంభించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్​అండ్​ఆడిటర్​జనరల్​(కాగ్) 300 పేజీలతో కూడిన డ్రాఫ్ట్​రిపోర్టు ఇచ్చింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో తేడాలు, బ్యారేజీలు, పంపుహౌస్​ల డిజైన్లలో లోపాలు, ప్రాజెక్టు భూ సేకరణ, ఆర్​అండ్​ఆర్​ప్యాకేజీల్లో ఒక్కోచోట ఒక్కోలా వ్యవహరించడం, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి దారితీసిన పరిస్థితులు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, కన్నెపల్లి, అన్నారం పంపుహౌస్​లు మునగడానికి కారణాలు, దీంతో వాటిల్లిన నష్టం సహా ఇతర అన్ని వివరాలు పీపీటీలో ఉండనున్నట్టు తెలిసింది. నేషనల్​డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మేడిగడ్డ బ్యారేజీపై ఇచ్చిన రెండు రిపోర్టులు, అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడటంపై ఇచ్చిన రిపోర్టులోని ముఖ్య అంశాలను కూడా పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి ఎత్తిపోసిన నీళ్లు, ఎగువ నుంచి వరద రావడంతో ఆ నీటిని కిందికి వదిలేయడం వల్ల పడిన కరెంట్​బిల్లుల భారం, మొత్తం నీటిని ఎత్తిపోసినందుకు అయిన కరెంట్​ చార్జీలు, ఆ నీటితో కొత్తగా 
ఎంత ఆయకట్టును స్టెబిలైజ్​ చేశారు అనే వివరాలన్నీ పొందుపరుస్తున్నారు.

‘తుమ్మిడిహెట్టి’పై వివరించే చాన్స్

తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలిస్తే ప్రజలకు ఎంతమేరకు ఉపయోగం, రీ డిజైనింగ్​తర్వాత కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్​ల నిర్మాణంతో అదనంగా ప్రజలపై పడిన భారం వాటితో అదనంగా చేకూరే ప్రయోజనం ఏమైనా ఉందా అనే వివరాలను ప్రజంటేషన్​లో పెడుతున్నారు. ప్రాణహిత – చేవెళ్ల రీ డిజైన్​తర్వాత చేవెళ్ల ప్రాంతాన్ని కాళేశ్వరం నుంచి డిలీట్​చేసి పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చడం, ఆ పనులు చేపట్టకపోవడంతో గతంలో చేసిన పనులు ఎంతమేరకు వృథా అయ్యాయనే వివరాలను చేర్చుస్తున్నారు. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్​ప్రాంతాలకు ఎక్కడి నుంచి నీళ్లు ఇవ్వాలి.. ఒకవేళ కృష్ణాలో సరిపడా నీళ్లు లేకుంటే కాళేశ్వరం నుంచి తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏమిటో కూడా వివరించే ఆస్కారమున్నట్టు తెలిసింది. రూ.37 వేల కోట్లతో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో 2014 జూన్​2వ తేదీ నాటికే సుమారు రూ.8 వేల కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్​చేసిన తర్వాత ఖర్చు చేసిన మొత్తంలో ఎంత మేరకు ఉపయోగపడింది.. ఎన్ని పనులు ఉపయోగించుకున్నారు.. ఎన్ని వృథా అయ్యాయి.. వాటిని ఇప్పుడు ఏ రకంగానైనా ఉపయోగించుకునే అవకాశముందా అనే వివరాలను పీపీటీలో చేర్చుతున్నట్టు తెలుస్తోంది.