కాళేశ్వరమే అప్పుల్లో టాప్ ..రూ.96,064 కోట్లు తీసుకున్న రాష్ట్ర సర్కార్

కాళేశ్వరమే అప్పుల్లో టాప్ ..రూ.96,064 కోట్లు తీసుకున్న రాష్ట్ర సర్కార్
  • మిషన్ భగీరథకు రూ.32,775 కోట్లు, ‘డబుల్’ ఇండ్లకు రూ.12 వేల కోట్లు
  • టీఎస్‌‌ఎస్పీడీసీఎల్ కింద మరో రూ.12,600 కోట్లు
  • రూ.2.12 లక్షల కోట్లకు చేరిన ‘బడ్జెట్‌‌లో చూపని’ అప్పులు
  • లెక్కలో చూపించేవి, గ్యారంటీ కింద తీసుకున్నవి కలిపితే 
  • రూ.5.69 లక్షల కోట్లు.. రాష్ట్ర జీఎస్‌‌డీపీలో 40 శాతం పైనే

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర సర్కారు బడ్జెట్‌‌లో చూపెట్టకుండా చేసిన అప్పుల్లో కాళేశ్వరమే టాప్‌‌లో ఉన్నది. ఒకటీ రెండు కాదు ఏకంగా రూ.96,064 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అప్పు చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేసి.. గ్యారంటీ కింద తీసుకున్న ఈ అప్పును బడ్జెట్‌‌లో చూపెట్టకుండా మతలబు చేసింది. ఇలా రాష్ట్ర సర్కార్ ఎక్స్​ట్రా బడ్జెటరీ అప్పులు (బడ్జెట్‌‌లో చూపనివి) రూ.2 లక్షల కోట్లు దాటాయి. ఇందుకోసం కొన్ని బ్యాంకులకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది. దేవాదుల, సీతారామ, కంతాలపల్లి, పాలమూరు రంగారెడ్డి వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు అప్పులు చేసింది. 
మిషన్ భగీరథ, హౌసింగ్, రోడ్డు డెవలప్​మెంట్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్టీసీ, టీఎస్​ఐఐసీ, జీహెచ్ఎంసీ, హాకా, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్​మెంట్, మార్క్​ఫెడ్, షీప్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ల ద్వారా ఇష్టారీతిన ఎనిమిదేండ్లుగా అప్పులు చేసుకుంటూ వస్తున్నది. వీటిని బడ్జెట్‌లో చూపెట్టని ప్రభుత్వం.. ఈ అప్పులకు కడుతున్న కిస్తీలు, వడ్డీలు మాత్రం బడ్జెట్‌ నుంచే చెల్లిస్తున్నది.

ప్రాజెక్టులు పూర్తి చేయలే..

కాళేశ్వరం కోసం మాత్రమే కాకుండా.. మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కూడా రాష్ట్ర సర్కారు గ్యారంటీ అప్పులు చేసింది. సీతారామ, దేవాదుల, కంతాలపల్లి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌‌ఐడీసీఎల్) కింద బడ్జెట్‌లో చూపించకుండా రూ.19,643 కోట్లు తీసుకున్నది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద కూడా అప్పులు చేసింది. కాళేశ్వరాన్ని మాత్రం ప్రారంభించి హడావుడి చేసింది. కానీ ఆ ప్రాజెక్టు కింద సాగవుతున్న పంటలంటూ ఏవీ లేవు. రూ.వేల కోట్లు నీళ్ల పాలేనా అనే విమర్శలు ఉన్నాయి. 

అప్పుల కార్పొరేషన్లు

అప్పులు తీసుకునేందుకే కొన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. భద్రాద్రి, యదాద్రి పవర్​ప్లాంట్ల కోసం జెన్ కో కార్పొరేషన్ రూ.30 వేల కోట్ల అప్పు తీసుకుంది. మిషన్ భగీరథ కోసం తీసుకున్న అప్పు రూ.32,775 కోట్లు. మిషన్ కాకతీయ అమలు కోసం కూడా అప్పులు చేశారు. ఇరిగేషన్ ఇన్​ఫ్రా కు ప్రభుత్వ గ్యారంటీతో రూ.3వేల కోట్లు తీసుకున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం కోసం తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద రూ.12వేల కోట్లు అప్పు చేసింది. ‘డబుల్’ ఇండ్ల కోసం ఖర్చు చేసిన మొత్తంలో అప్పుల వాటా నే ఎక్కువగా ఉన్నది. ఇండ్లు మాత్రం పూర్తి కాలేదు. 

ఏదీ వదల్లేదు

అప్పుల కోసం రాష్ట్ర సర్కార్ ఆర్టీసీని కూడా వదల్లేదు. టీఎస్ఆర్టీసీ పేరు మీద రూ.1,450 కోట్ల అప్పు తీసుకుంది. అయినా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) నుంచి కూడా గ్యారంటీ అప్పు కింద రూ.5,164 కోట్లు తీసుకుంది. మార్క్​ఫెడ్ తీసుకున్న అప్పు రూ.3 వేల కోట్లు. టీఎస్ఎస్పీడీసీఎల్ ద్వారా రూ.12,600 కోట్లు తీసుకున్నారు. చివరకు గొర్రెల పంపిణీ, ఫిషరీస్, పాడి పశువుల పంపిణీ స్కీమ్స్ అంటూ అమలు చేసిన వాటికీ అప్పులే దిక్కు అయ్యాయి. 

బడ్జెట్‌లో చూపించదు

రాష్ట్ర సర్కార్ గ్యారంటీల పేరుతో తెచ్చే అప్పులను లెక్కలో చూపట్లేదు. ఎఫ్ఆర్‌‌బీఎం పరిధిలోకి రా కుండా తీసుకుంటున్నది. 2024 మార్చి నాటికి అప్పుల మొత్తం రూ.3.57 లక్షల కోట్లకు చేరుతుం దని ఫిబ్రవరిలో పెట్టిన బడ్జెట్​లోనే ప్రభుత్వం వెల్లడించింది. కానీ బడ్జెట్​తో సంబంధం లేకుండా ఇరి గేషన్ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే తెచ్చిన రుణాలు రూ.2 లక్షల కోట్లు దాటాయి. వీటిని ప్రభుత్వం ష్యూరిటీపై తెచ్చింది. ఈ లెక్కలు ఎక్కడా కనిపించకుండా జా గ్రత్త పడింది. ఇప్పుడు రెండింటిని కలిపితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల మొత్తం రూ.5.69 లక్షల కోట్లు దాటుతోంది. ఈ మొత్తాన్ని 2022–23 రాష్ట్ర జీఎస్‌డీపీ 12.37 లక్షల కోట్లతో చూస్తే 40% దాటుతున్నది. ఇది చాలా డేంజరేస్ అని ఫైనాన్స్ ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. 

కేంద్రం, ఆర్‌‌బీఐ హెచ్చరించకుంటే.. 

నిరుడు రాష్ట్రాల ఇష్టారీతి అప్పులపై కేంద్రం, ఆర్‌‌బీఐ పరిమితులు విధించాయి. కీలక హెచ్చరికలు కూడా జారీ చేశాయి. కొన్నాళ్లపాటు అప్పులు ఇవ్వకుండా ఆర్​బీఐ ఆపింది. దీనిపై రాష్ట్ర సర్కార్ రాద్ధాంతం చేసింది. దీంతో గ్యారంటీ అప్పులు తీసుకుంటే.. వాటిని ఎలా తీరుస్తారో స్పష్టం చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. నిర్దిష్టంగా ఎలా అప్పులు, వడ్డీలు కడుతారో చెబితేనే ఇస్తామని పేర్కొంది. ఫలితంగా తెలంగాణ సర్కార్ గ్యారంటీ అప్పులు చేయకుండా ఆగింది. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్ నుంచి కట్టేది ఉంటే.. ఆ అప్పులను గ్యారంటీలో కాకుండా.. ఎఫ్ఆర్​బీఎం పరిధిలో లెక్కగడుతామని చెప్పడంతో అప్పులు కాస్త ఆగినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు.