మూడు జిల్లాలను ముంచుతున్న కాళేశ్వరం బ్యాక్​వాటర్​..రీ డిజైనింగ్​ లోపాలే కారణం..

మూడు జిల్లాలను ముంచుతున్న కాళేశ్వరం బ్యాక్​వాటర్​..రీ డిజైనింగ్​ లోపాలే కారణం..

ప్రపంచంలోనే అత్యద్భుత కట్టడం అంటూ రాష్ర్ట ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొత్తగా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు రాకపోగా, దాని బ్యాక్ వాటర్​వల్ల నాలుగేండ్లుగా ఊహించని స్థాయిలో ఆస్తి, పంట నష్టం జరుగుతున్నది. రీ డిజైనింగ్​లోపాల కారణంగా గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారీ ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో సుమారు 45 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. మంచిర్యాల, చెన్నూర్, మంథని పట్టణాలతో పాటు దాదాపు 50 గ్రామాలు జలదిగ్బంధం అవుతున్నాయి. 20 వేల మందికిపైగా ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడుతున్నారు. వరదలు తగ్గే వరకు రిలీఫ్​ క్యాంపుల్లో, బంధువుల ఇండ్లల్లో, లాడ్జీల్లో పిల్లాపాపలతో తలదాచుకుంటున్న దయనీయ పరిస్థితి. దాదాపు10 వేల ఇండ్లు నీటమునుగుతుండగా, ఒక్కో ఇంట్లో కనీసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలకు పైగా నష్టం జరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో 20 వేల ఎకరాల్లో, పెద్దపల్లి జిల్లాలో 20 వేల ఎకరాల్లో, జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో 5 నుంచి 8వేల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు ఎకరానికి రూ.20 వేల నుంచి నుంచి రూ.30 వేలు నష్టపోతున్నారు. ఒకసారి దెబ్బతిన్న పంటలను చెడగొట్టి మళ్లీ వేసుకుంటే మళ్లీ వరదలు వచ్చి ముంచుతున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేస్తున్నది. రైతులు ఏర్పాటు చేసుకున్న బోర్లు, పైపులైన్లు సైతం కొట్టుకుపోతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనికరించడం లేదు. అధికారులు ఏటా పంటనష్టంపై సర్వే చేసి గవర్నమెంట్​కు రిపోర్టు ఇవ్వడం, దాన్ని పాలకులు బుట్టదాఖలు చేయడం రివాజుగా మారింది. చెన్నూర్​నియోజకవర్గం కోటపల్లి మండలం పుల్లగామలో మూడేండ్ల కింద ఓ కౌలురైతు అప్పులపాలై నష్టపరిహారం అందక మనోధైర్యం కోల్పోయి, పత్తికి కొట్టే మందు తాగి చనిపోయిండు. రెండేండ్ల కింద చెన్నూర్​పట్టణానికి చెందిన మరో యువ రైతు స్థానిక పెద్ద చెరువులో దూకి ప్రాణం తీసుకున్నాడు. బ్యాక్​వాటర్ వల్ల తమ పొలాలు మునిగిపోవడంతో దిక్కుతోచని రైతుల్లో కొందరు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. వ్యవసాయం తప్ప మరో పని తెలియకపోవడంతో వివిధ మండలాల్లో కౌలుకు భూములు తీసుకొని సాగుచేసుకుంటున్నారు. ఇంకొందరు కూలీలుగా మారి దుర్భరంగా కాలం గడుపుతున్నరు. ఈ కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోతలేదు. కిందటి అసెంబ్లీ సమావేశాల్లో ముంపు రైతులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్​ ఆ విషయమే మరిచిపోయారు.

ముంపు భూములను సర్కారే తీసుకోవాలి.. 

గడిచిన మూడేండ్లుగా 48 వేల ఎకరాల్లో ఏటా రెండు పంటల చొప్పున ఆరు పంటలు వేసిన రైతులకు ఒక్క గింజ కూడా చేతికి రాలేదు. ప్రతీ పంటా నీటి పాలైంది. కాళేశ్వరం ప్రారంభించాక 2020లో పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కాన్సాయిపేట, ఆరెంద, మల్లారం గ్రామాల్లోని రైతులకు మాత్రమే 1200 ఎకరాలకు, ఎకరానికి రూ.19 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది. ఆ తర్వాత నష్ట తీవ్రత 40 వేల ఎకరాలు దాటిపోవడంతో పరిహారం సంగతిని పక్కనపెట్టేసింది. గడిచిన నాలుగేండ్లుగా ఈ మూడు జిల్లాల్లోని రైతులు ఆరు పంటలు కోల్పోయినా ఇప్పటివరకు పైసా పరిహారం ఇవ్వలేదు. అటు అధికారులు సైతం ఆ భూముల్లో పంట వేయవద్దని, క్రాప్ హాలీడే కింద సర్కారే నష్టపరిహారం ఇస్తుందని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు నీట మునిగిన పంటలకు గానీ, క్రాప్ హాలీడే కింద బీళ్లు పెట్టిన భూములకు గానీ సర్కారు కాంపెన్సేషన్ ఇవ్వనేలేదు. ప్రాజెక్టు నిర్మించక ముందు లక్షలు పెట్టి రైతులు బోర్లు వేసుకోగా, వరద తాకిడికి ఆ బోర్లు, పైపు లైన్లు  కూడా మునిగిపోయి ఒక్కో రైతుకు రూ.2 లక్షలకు పైగా నష్టం జరిగింది.  ముంపు బాధిత రైతుల తరఫున బీజేపీ ఆధ్వర్యంలో నాలుగేండ్లుగా పోరాడుతున్నాం. ఇప్పటికే చెన్నూర్​లో ధర్నా, కోటపల్లి మండలం అన్నారం నుంచి మంచిర్యాల కలెక్టరేట్​వరకు పాదయాత్ర, హైదరాబాద్​ఇందిరాపార్క్​ వద్ద మహాధర్నా లాంటి పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటి వరకు నష్టపోయిన ఆరు పంటలకు ఎకరానికి రూ.50 వేల పరిహారంతో పాటు ముంపు భూములను ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ తరఫున డిమాండ్​ చేస్తున్నాం. లేదంటే మరోసారి రైతుల పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని రాష్ట్ర సర్కారును హెచ్చరిస్తున్నాం. 

రీ డిజైనింగ్​ లోపాలే కారణం..

దాదాపు లక్ష కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ప్రభుత్వం.. వరద ముంపును పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ఫుల్​ రిజర్వాయర్​ లెవల్(ఎఫ్ఆర్ఎల్) వరకు మాత్రమే భూములు సేకరించి వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే మ్యాగ్జిమమ్​ రిజర్వాయర్​ లెవల్​ (ఎంఆర్ఎల్)ను ఇంజినీర్లు విస్మరించారు. ముంపు ప్రాంతాల్లో కరకట్టలు కూడా నిర్మించకపోవంతో నష్ట తీవ్రత పెరుగుతోంది. ఎవరు ఔనన్నా కాదన్నా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​వాటర్​ మూలంగానే పట్టణాలు, గ్రామాలతో పాటు పంట చేలు మునుగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు కేవలం వంద కిలోమీటర్ల పరిధిలో నాలుగు బ్యారేజీలు కట్టడం వల్ల గోదావరి సహజ ప్రవాహానికి బ్రేకులు పడుతున్నాయి. బ్యారేజీల గేట్లన్నీ ఎత్తినా ప్రవాహ వేగం తగ్గడంతో ఎక్కడికక్కడ వరద ఎగతంతున్నది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్​ఆఫీసర్లు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ఈ విపత్తుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు 8 లక్షల క్యూసెక్కుల వరదనే ప్రామాణికంగా తీసుకొని బ్యారేజీలను, పంపుహౌస్​లను నిర్మించారు. నిరుడు 20 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అన్ని గేట్లు ఓపెన్​ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్వతి బ్యారేజీ వద్ద నిర్మించిన సరస్వతి పంపుహౌస్​ రివర్​ నీటిమట్టానికి129 మీటర్ల ఎత్తులో కట్టారు.  కానీ 15 లక్షల నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద రావడం వల్ల పంపహౌస్​లు మునిగాయి. 8 లక్షల క్యూసెక్కుల వరద అంచనాతోనే రైతుల దగ్గర భూములను సేకరించారు. దీంతో అంచనాలను మించి పట్టణాలు, గ్రామాలు, పంటలు మునుగుతున్నాయి. 

లక్ష కోట్లు గోదారిపాలు.. 

రాష్ర్ట ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వివిధ కార్పొరేషన్ల దగ్గర రూ.97,449 కోట్లు అప్పు తీసుకున్నది. ఇప్పటివరకు రూ.86,064 కోట్లు ఖర్చుపెట్టింది. గతేడాది నుంచి అప్పు చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు రూ.545 కోట్ల అసలు మాత్రమే చెల్లించింది. అప్పు తీర్చడానికి 2035 ఆగస్టు 30 వరకు గడువు ఉండగా, ఏటా రూ.13 వేల కోట్లు కట్టాలి. ఇలా ప్రజల నెత్తిన లక్ష కోట్ల భారం మోపిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఉద్ధరించిందేమీ లేకపోవడం బాధాకరం. మేడిగడ్డ దగ్గరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా100 రోజుల పాటు 200 టీఎంసీల నీటిని లిఫ్ట్​ చేయాలి. ఈ లెక్కన ఐదేండ్లలో 1000 టీఎంసీల నీళ్లను లిఫ్ట్​ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు168 టీఎంసీలను మాత్రమే ఎత్తిపోశారు. ఇందులో 118 టీఎంసీలను తిరిగి గోదావరిలోకి వదిలేశారు.  మిగిలిన 50 టీఎంసీలను మెదక్​ జిల్లాలోని రంగనాయక్​ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్​ రిజర్వాయర్లలో నిల్వ చేశారు. కొత్తగా ఉమ్మడి మెదక్​ జిల్లాలో కేవలం 75 వేల నుంచి 80 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే కాళేశ్వరం నీళ్లందించారంటే ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగమో ప్రభుత్వమే చెప్పాలి. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పు ఎప్పుడో ముట్టిపోయిందని సీఎం కేసీఆర్​ చెప్పడం సిగ్గుచేటు. ఈ ఏడాది శ్రీరాంసాగర్​ పునరుజ్జీవ పథకంలో భాగంగా 2.5 టీఎంసీలను కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్​చేశారు. ఎస్సారెస్పీకి వరద రావడంతో వాటిని సైతం గోదావరిలోకి విడిచిపెట్టారు.

- గడ్డం వివేక్ వెంకటస్వామి, 
మాజీ ఎంపీ, బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీ మెంబర్​