పాలమూరుకు సీఎం ఎందుకు రావట్లే ? : కల్వకుంట్ల కవిత

పాలమూరుకు సీఎం ఎందుకు రావట్లే ? : కల్వకుంట్ల కవిత
  •     తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : సీఎం రేవంత్‌‌రెడ్డి తన సొంత జిల్లా అయిన పాలమూరులో ఎందుకు పర్యటించడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పార్లమెంట్‌‌ ఎన్నికల సందర్భంగా పాలమూరులో జరిగిన ప్రచార సభకు హాజరైన ఆయన.. ఆ తర్వాత ఇప్పటివరకు ఎందుకు రాలేదన్నారు. బుదవారం మహబూబ్‌‌నగర్‌‌లో మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా పోరాటం చేస్తున్నామన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌‌రెడ్డి లేరని, ఆయనకు తెలంగాణ గురించి ఏమీ తెలియదన్నారు. గెజిట్‌‌ లేదన్న చిన్న కారణంతో తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి పని చేయాలని, అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకొని, ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌‌ చేశారు. పాలమూరు ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేస్తే కేసీఆర్‌‌కు పేరు వస్తుందనే ఆ ప్రాజెక్ట్‌‌ను చేపట్టడం లేదని విమర్శించారు. మహబూబ్‌‌నగర్‌‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌రెడ్డి కాంగ్రెస్‌‌లో ఉన్నారో ? బీజేపీలో ఉన్నారో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు.