కామారెడ్డి జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న కరెంట్

కామారెడ్డి జిల్లాలో కన్నీళ్లు పెట్టిస్తున్న కరెంట్
  • రిపేర్లకు వేలల్లో ఖర్చవుతోందని రైతుల ఆవేదన  
  • యాసంగి పంటలు కాపాడుకునేందుకు అగచాట్లు

కామారెడ్డి, వెలుగు: కరెంట్ కష్టాలు కామారెడ్డి జిల్లాలోని రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. లో ఓల్టేజీ, ఓవర్​లోడ్ వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి. రిపేర్ల కోసం రైతులు వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓవైపు యాసంగిలో సాగు చేస్తున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతుంటే.. తరచూ కాలిపోతున్న మోటార్లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. జిల్లాలో పెద్దగా ప్రాజెక్టులు లేకపోవడంతో వ్యవసాయం పూర్తిగా బోర్ల కిందే సాగుతోంది. యాసంగి సీజన్​లో జిల్లా వ్యాప్తంగా రైతులు 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. 2.60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇందులో లక్షా95వేల ఎకరాల వరి పంట బోర్ల కిందే సాగవుతోంది. మరో లక్ష ఎకరాల్లో మక్క, ఇతర పంటలు వేశారు. జిల్లాలో అధికారికంగా లక్షా5వేల అగ్రికల్చర్ కరెంట్​కనెక్షన్లు ఉండగా.. మరో 20 వేల వరకు అనధికారిక కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తరచూ తడులు పెట్టాల్సి వస్తోంది. విద్యుత్​వినియోగం పెరుగుతోంది. జిల్లాలో రోజుకు 7.7 మిలియన్ యూనిట్ల కరెంట్​వినియోగిస్తున్నారు. అయితే గత 3 రోజులుగా మామూలు రోజుల్లో కంటే15 శాతం వాడకం పెరిగింది. దీంతో సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఓవర్​లోడు, లోవోల్టేజీ సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రిపేర్​కు రూ.8 వేలు ఖర్చు

ఒకసారి వ్యవసాయ మోటార్​ కాలిపోతే రిపేర్​కోసం రూ.8వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. బోరు లోపలి నుంచి మోటారును పైకి తీయడానికి, రిపేరైన తర్వాత మళ్లీ దింపేందుకు రూ.2,500 నుంచి రూ.3వేలు, మోటార్​వైరింగ్​కు రూ.5వేలు ఖర్చు అవుతున్నాయని చెబుతున్నారు. ఈ సీజన్​లో ఇప్పటికే కొందరు రైతుల మోటార్లు రెండు సార్లు కాలిపోయాయని, రిపేర్ల భారం పెరిగిపోతోందని వాపోతున్నారు. కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ మండలాల్లో ఎక్కువగా   మోటార్లు కాలిపోతున్నాయి. 
ఈ మండలాల్లోని రిపేరింగ్​షాపులకు డైలీ పదుల సంఖ్యలో మోటార్లు రిపేర్ల కోసం వస్తున్నాయి.

10 రోజులుగా లో ఓల్టేజీ సమస్య

2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి పంట వేసిన. వారం, 10 రోజులుగా లోవోల్టేజీ కరెంట్ సమస్య ఉంది. సరఫరాలో హెచ్చు తగ్గులు ఉంటున్నయ్. ఒకసారి మోటార్ కాలిపోయింది. రిపేరుకు రూ.6 వేలకు పైగా ఖర్చయింది. 

- ఈశ్వర్, రైతు, రాజంపేట

ఎక్కడా లో ఓల్టేజీ సమస్య లేదు

జిల్లాలో 3 రోజులుగా కరెంట్​వినియోగం పెరిగింది. ప్రస్తుతం ఎక్కడా కూడా లో ఓల్టేజీ సమస్య లేదు. డిమాండుకు తగ్గట్టుగా సప్లయ్ చేస్తున్నాం.  

- రమేశ్​బాబు, 
ఎన్పీడీసీఎల్ కామారెడ్డి ఎస్ఈ

రిపేరింగ్​ ఖర్చులు పెరిగినయ్​

మూడెకరాల్లో వరిపంట వేసిన. కరెంట్ పోతూ.. వస్తుండడంతో పొలంలో ని మోటార్​ కాలిపోయిం ది. రిపేర్ కోసం తీసుకొ చ్చా. మోటార్​తీసి.. మళ్లీ దింపటానికి 3 వేలు, రిపేరుకు4 వేల పైనే ఖర్చవుతోంది. రిపేర్​ ఖర్చులు భారమవుతున్నయ్.

- మహ్మద్ జానీ, రైతు, శాబ్ధిపూర్​