రవిశాస్త్రి వర్సెస్ ద్రవిడ్‌: కపిల్ ఓటు ఎవరికి? 

రవిశాస్త్రి వర్సెస్ ద్రవిడ్‌: కపిల్ ఓటు ఎవరికి? 

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టును కోచ్‌గా ముందుండి నడిపించనున్నాడు వెటరన్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో లంక సిరీస్‌కు ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్.. రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌ అవుతాడా అనే దానిపై క్రికెటింగ్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంపై లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించాడు. కొత్త కోచ్‌గా ద్రవిడ్‌ను నియమిస్తే తప్పేంటని ప్రశ్నించాడు. 

‘కోచింగ్ అంశంపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ముందు లంక సిరీస్ పూర్తవ్వాలి. అప్పుడు మన టీమ్ ప్రదర్శన మీద ఓ అవగాహన వస్తుంది. ఆ తర్వాత దీని గురించి చర్చించొచ్చు. కొత్త కోచ్‌ను తయారు చేసుకోవడంలో తప్పేముంది. అదే సమయంలో రవిశాస్త్రి బాగా పని చేస్తున్నప్పుడు అతడి స్థానంలో ఇంకొకర్ని తీసుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే దీన్ని కాలమే నిర్ణయించాలి. ఇలాంటి చర్చలు, వార్తల వల్ల కోచ్‌‌లు, ప్లేయర్లపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది’ అని కపిల్ పేర్కొన్నారు.