
- డంప్ యార్డ్ హఠావో.. కరీంనగర్ బచావో పేరిట ఉద్యమం
- కాలనీలను కమ్ముకుంటున్న పొగతో జనం ఉక్కిరిబిక్కిరి
- మానేరులో కలుస్తున్న వ్యర్థాలు
- మూడేండ్లుగా నిలిచిపోయిన బయోమైనింగ్
- డంప్ యార్డ్ తొలగింపుపై నెరవేరని కేంద్ర మంత్రి హామీ
- మానేరు పక్క నుంచి తొలగించాలని ఆందోళన
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మానేరు ఒడ్డున ఉన్న డంప్ యార్డ్ రావణకాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. ఎండాకాలం వచ్చిందంటే ఈ మంటలు మరింత ఎక్కువై సిటీ సగం మేర దట్టమైన పొగ వ్యాపిస్తోంది. దీంతో కరీంనగర్ కమాన్ ఏరియా వరకు ఉన్న వివిధ కాలనీవాసులు పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు వానాకాలంలో డంప్‌యార్డ్ వ్యర్థాలతో పాటు, దాని మీదుగా వచ్చిన మురుగు నీరంతా మానేరులో కలుస్తుండడంతో నీరు కలుషితం అవుతోంది. దీంతో ‘డంప్ యార్డ్ హఠావో.. కరీంనగర్ బచావో’ అంటూ పట్టణ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. శ్రీవర సిద్ధి వినాయక సొసైటీ ఆధ్వర్యంలో మొదలైన ఈ ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. డంప్ యార్డ్‌ను తరలించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సైతం ముట్టడించారు.
పొగతో ఉక్కిరిబిక్కిరి
డంప్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగతో కరీంనగర్ సిటీ జనం ఊపిరాడక అవస్థలు పడుతున్నారు. నెల రోజులుగా నిత్యం పొగ కమ్మేస్తుండడంతో పట్టణంలోని అలకాపురి, ఆటోనగర్, వరసిద్ధి వినాయక కాలనీ, కోతిరాంపూర్, లక్ష్మీ నగర్, పోచమ్మవాడ, లక్ష్మీ నగర్, గణేశ్ నగర్, రామచంద్రపురం కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, బొమ్మకల్, అలుగునూరు ఏరియాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరిఖని బైపాస్, హైదరాబాద్ రోడ్డులో దట్టమైన పొగ కమ్ముకోవడంతో రాత్రి టైంలో వాహనదారులకు రోడ్డు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
మరో వైపు డంప్ యార్డ్ నుంచి వచ్చే వ్యర్థాలు మానేరు నదిలో కలుస్తుండడంతో నీళ్లు కలుషితం అవుతున్నాయి. పట్టణంలో వెలువడే చెత్తతో పాటు చికెన్ సెంటర్లు, హోటళ్లు, ప్రైవేట్ హాస్పిటల్స్, మెకానిక్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి వెలువడే వ్యర్థాలన్నింటినీ మానేరు తీరంలోనే పడేస్తున్నారు. దీంతో వర్షాలు పడినప్పుడు ఆ చెత్త మొత్తం మానేరులో కలుస్తోంది.
యార్డ్‌ను తరలించాలని ఎన్‌జీటీ ఆదేశం
కరీంనగర్‌లో డంప్ యార్డ్ నిర్వహణపై ఫిర్యాదులు అందడంతో యార్డ్‌ను అక్కడి నుంచి తరలించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలోనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రక్రియ మొదలుకాలేదు. గతంలో ఎన్‌డబ్ల్యూఎంపీ స్టేషన్ అధ్యయనం ప్రకారం.. కరీంనగర్ నుంచి సోమన్‌పల్లి మధ్య మానేరు నదీ జలాల్లో 100 మిల్లీ లీటర్లకు 920 ఎంపీఎన్ కోలిఫాం ఉన్నట్లు వెల్లడైంది.
నిలిచిన బయోమైనింగ్
ఈ డంప్ యార్డ్‌లో పేరుకుపోయిన సుమారు 2 లక్షల టన్నుల చెత్తను తగ్గించడంతో పాటు ఆ స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకునేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా 2022 జూన్‌లో బయోమైనింగ్‌ను ప్రారంభించారు. ఇందుకోసం రూ.16 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్‌ను సైతం కేటాయించారు. టెండర్ దక్కించుకున్న చెన్నైకి చెందిన ఏజెన్సీ ఏడాదిలోనే చెత్తను పూర్తిగా ప్రాసెస్ చేసి ఖాళీ స్థలాన్ని అప్పగించాల్సి ఉండగా.. మూడేళ్లయినా పనులు పూర్తి కాలేదు. ఇటీవల మంటలు అంటుకొని బయోమైనింగ్ యంత్రాలు కొంత మేర దెబ్బతిన్నాయి. సిటీ నుంచి డంప్ యార్డ్‌లోకి చెత్త తరలింపు ఆగినప్పటికీ.. ఉన్న చెత్తను పూర్తిగా తొలగించడం సవాల్‌గా మారింది.
నెరవేరని కేంద్ర మంత్రి హామీ
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కరీంనగర్‌లో చేపట్టిన పనులతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీలో నిరంతర తాగునీటి సరఫరాను ప్రారంభించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జనవరి 24న పట్టణంలో పర్యటించారు. ఈ టైంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి డంప్‌యార్డ్‌ను సైతం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో కరీంనగర్ ప్రజలను ఏండ్ల తరబడి వేధిస్తున్న డంప్ యార్డ్ సమస్యను కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని, అందుకయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని ఖట్టర్ ప్రకటించారు. కానీ నాలుగు నెలలైనా హామీ నెరవేరలేదు... అడుగు ముందుకు పడలేదు.
డంప్ యార్డు తరలించాలని సీపీఐ ధర్నా
కరీంనగర్ టౌన్, వెలుగు : డంప్ యార్డ్‌ను మరో చోటుకి తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డంప్ యార్డ్ నుంచి వెలువడే పొగ కారణంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆఫీసర్లు స్పందించి డంప్ యార్డ్‌ను తరలించాలని లేకపోతే ప్రజాప్రతినిధుల ఇండ్ల ఎదుట చెత్త వేసి, ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి సురేందర్‌రెడ్డి, నాయకులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ కె. మణికంఠరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కిన్నెర మల్లమ్మ, బావండ్లపెళ్లి యుగంధర్, నగర కార్యవర్గ సభ్యులు సాంబరాజు, కూన రవి, రమేశ్ పాల్గొన్నారు.