- ఖాదర్ గూడెం, శంషాబాద్, గొల్లపల్లి, కొత్తగట్టు, శాంతి నగర్, కోతులనడుమ, సూరారం, బావుపేటలో ఎఫ్ఓబీల నిర్మాణం
- అండర్‌పాస్‌లు లేనిచోట స్థానికులకు తప్పనున్న తిప్పలు
- ‘వీ6 వెలుగు’ వరుస కథనాలకు ఎన్‌హెచ్ ఆఫీసర్ల స్పందన
కరీంనగర్, వెలుగు: కరీంనగర్– హన్మకొండ నేషనల్ హైవే(563)లో అండర్ పాస్‌లు లేని చోట రోడ్డు దాటేందుకు స్థానికులు పడుతున్న కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అధికారులు ఈ హైవేపై 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేశారు. హైవే పై వాహనాల రాకపోకలకు సంబంధించి ఈ నెల 5న ట్రయల్ రన్ స్టార్ట్ అయ్యాక రోడ్డుకిరువైపులా గ్రామాలు ఉన్న ప్రజలు రోడ్డు దాటేందుకు పడుతున్న కష్టాలపై 'ఊళ్లను తెంపిన హైవే', 'రోడ్డు దాటుడు ఎట్లా ?' అనే హెడ్‌లైన్స్‌తో ‘వీ6 వెలుగు’లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీంతోపాటు స్థానికులు ఆందోళనలు చేయడంతో స్పందించిన నేషనల్ హైవే అధికారులు ఈ హైవేపై కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం ఖాదర్ గూడెం, శంషాబాద్, శంకరపట్నం మండలం గొల్లపల్లి, కొత్తగట్టుతోపాటు హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతి నగర్, కోతులనడుమ, సూరారం, బావుపేట గ్రామాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మించాలని నిర్ణయించారు.
మెట్లతోపాటు లిఫ్టు సౌకర్యంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి..
నేషనల్ హైవేపై ట్రయల్ రన్ స్టార్ట్ అయ్యాక వాహనాలు గంటలకు 70 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నాయి. ఈ క్రమంలో అండర్‌పాస్‌లు లేని చోట్ల వివిధ పనుల కోసం రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన స్థానికులు కొందరు మృత్యవాతపడడంతోపాటు గాయాలపాలయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో స్థానికులు తరచూ ఆందోళనలు చేస్తున్నారు.
స్పందించిన అధికారులు రోడ్డు దాటేందుకు 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరు చేశారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను మెట్లతోపాటు వృద్ధులు, గర్భిణులు, పేషెంట్లు, దివ్యాంగులు సైతం దాటేలా అత్యాధునిక లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ లిఫ్టుల్లో ఒకేసారి 16 మంది ఎక్కేలా డిజైన్ చేశారు.
ప్రమాదాలను నివారించేందుకే..
రూ.1641 కోట్ల అంచనాతో నిర్మించిన కరీంనగర్-హన్మకొండ నేషనల్ హైవేలో ఇప్పటికే ట్రయల్ రన్ స్టార్ట్ అయింది. ట్రయల్ రన్‌లో వాహనదారులు, స్థానిక ప్రజలు, మీడియా నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటికే 25 అండర్ పాస్‌లు నిర్మించాం. మరో 8 చోట్ల అండర్ పాస్‌లకు డిమాండ్ రావడంతో ఆయా గ్రామాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోతున్నాం. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం.
- కీర్తి భరద్వాజ్, ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్ హెచ్ఏఐ
