నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కైనయ్‌‌‌‌: బండి సంజయ్

నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కైనయ్‌‌‌‌: బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: తనను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కుమ్మక్కయ్యాయని, ఇందులో భాగంగానే ఇప్పటివరకు కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ను ప్రకటించలేదని కరీంనగర్‌‌‌‌ ఎంపీ బండి సంజయ్‌‌‌‌ విమర్శించారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణమన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి, వీర్నపల్లి మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. తర్వాత సిరిసిల్లలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. తాను ప్రతిపాదించిన కంపెనీల వద్దే యారన్‌‌‌‌ కొనాలని గతంలో కేటీఆర్‌‌‌‌ షరతు పెట్టడంతో నేతన్నలు నష్టపోయారన్నారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌కు చిత్తశుద్ధి ఉంటే యారన్‌‌‌‌ కొనుగోలులో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కాంగ్రెస్‌‌‌‌ చెప్పిన మహాలక్ష్మీ స్కీమ్‌‌‌‌, రూ.4 వేల పెన్షన్, రైతు భరోసా, పేదలకు ఇండ్ల హామీలు ఎటు పోయాయని ప్రశ్నించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతో జరిగాయే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. నేతన్నకు మద్దతుగా తాము దీక్షకు సిద్ధమైతేనే ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. రూ.270 కోట్ల బకాయిలు ఉంటే రూ.50 కోట్లే రిలీజ్‌‌‌‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఎలక్షన్‌‌‌‌ కోడ్‌‌‌‌ పేరుతో నిధుల విడుదలను ఆపేందుకు కుట్ర చేస్తున్నారని, అదే జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. 

నేతన్నల విద్యుత్‌‌‌‌ బకాయిలను మాఫీ చేయాలని, ఏడాది పొడవునా ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అంతకుముందు పలువురు లీడర్లు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వీర్నపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. ఆయన వెంట రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఉన్నారు.