పరిగిలో కర్నాటక రైతుల ర్యాలీ

పరిగిలో కర్నాటక రైతుల ర్యాలీ
  • పరిగిలో కర్నాటక రైతుల ర్యాలీ
  • కాంగ్రెస్‌‌‌‌కు ఓటు వేయొద్దని విజ్ఞప్తి
  • అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

పరిగి/నారాయణపేట, వెలుగు: వికారాబాద్‌‌‌‌ జిల్లా పరిగి మండల కేంద్రంలో శనివారం కర్నాటక రైతులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలని పరిగి అమరవీరుల చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు రైతులు ర్యాలీ నిర్వహించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పరిగిలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని రైతులు తెలిపారు. అయితే, పరిగి బస్టాండ్ వద్ద వీరిని స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ర్యాలీకి భద్రత కల్పించారు. 

ర్యాలీకి ఎలా అనుమతిస్తారంటూ పోలీసులను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మొత్తం 21 మంది రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. కర్నాటకలోని మెతుకు మండలం కొట్రికా గ్రామానికి చెందిన 9 మంది రైతులు, సేడం తాలూకా మధున మండలానికి చెందిన రామకృష్ణ, కురువ సాయప్ప, కస్తరపల్లి వెంకట్, నాగరాజు ర్యాలీలో పాల్గొన్నారు. అయితే, ర్యాలీ జరుగుతుండగా స్థానిక కాంగ్రెస్‌‌‌‌ నాయకులకు, కర్నాటక రైతుల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో కర్నాటక రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 అయితే, 5 మంది రైతులు పరిగి నుంచి కర్నాటకకు వెళ్లే దారి తెలియక అక్కడే ఉండిపోయారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు వారితో మాట్లాడగా, అసలు విషయం తెలిసింది. తాము కూలీలమని, రూ.300 ఇస్తే ఇక్కడికి వచ్చామని చెప్పారు. కాగా, కర్నాటక రైతుల ర్యాలీలో ఉద్రిక్తత పరిస్థితులపై ఎన్నికల అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు, నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలో కూడా కర్నాటక రైతులు కాంగ్రెస్‌‌‌‌కు ఓటు వేయొద్దంటూ ప్రచారం నిర్వహించారు. 

కర్నాటకలోని సండ్రుక, క్యాసారం గ్రామాలకు చెందిన రైతులు ప్రచారం నిర్వహిస్తుండగా, స్థానిక కాంగ్రెస్‌‌‌‌ నాయకులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని నచ్చజెప్పారు. అనుమతి లేకుండా కర్నాటక రైతులు తమ గ్రామంలో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ప్రచారానికి ఎవరు పిలిపించారని వారిని అడగ్గా.. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి పేరును కర్నాటక రైతులు చెప్పడంతో కాంగ్రెస్‌‌‌‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.