‘కార్తికేయ 2’ ట్రైలర్ వచ్చేసింది

‘కార్తికేయ 2’ ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ‘5 సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం..పరిష్కారం లిఖితం...’ అనే డైలాగ్‌తో అద్భుతమైన విజువల్స్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్‌ను మాస్ మహారాజా రవితేజ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ‘ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చూస్తుంటే మరో టాప్ క్లాస్ మూవీ రాబోతున్నట్లుగా అనిపిస్తుంది. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని రవితేజ ట్వీట్‌లో తెలిపారు. 

ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. మూవీలో నిఖిల్ కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. చందు మొండేటి ద‌ర్శక‌త్వంలో వస్తున్న ఈ చిత్రం ‘కార్తికేయ’ మూవీ సీక్వెల్‌గా రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 13న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.