
- ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగావకాశాలు
- 2026 మార్చి నుంచి ప్రారంభం కానున్న రైల్వే కోచ్‍ల తయారీ
- స్థానికులకు 80 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్
వరంగల్/ కాజీపేట, వెలుగు: ఓరుగల్లు కాజీపేటలో దాదాపు 40 ఏండ్లుగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉద్యమం నడువగా, గతేడాది కేంద్ర ప్రభుత్వం రైల్వే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంజూరు చేసింది. త్వరలోనే ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభం కానుండడంతో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన స్థానికులకు 60 నుంచి 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదే అంశంపై ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, యూనియన్ లీడర్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, రైల్వే ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు కూడా అందజేశారు. దీంతో లోకల్స్కి జాబ్స్ఇస్తారా లేదా అనే టెన్షన్ మొదలయ్యింది.
ఫ్యాక్టరీ కోసం 162 ఎకరాల భూములిచ్చారు..
కేంద్ర ప్రభుత్వం కాజీపేట కేంద్రంగా అయోధ్యపురంలో ఏర్పాటు చేస్తున్న రైల్వే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం రైతులు, స్థానికులు దాదాపు 162 ఎకరాల భూములిచ్చారు. కేంద్రం 2010లో పిరియాడికల్ ఓవర్హాలింగ్ వర్క్ షాప్ (పీవోహెచ్) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఆపై 2016లో పీవోహెచ్‍ను వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‍డేట్ చేసింది. 2023 జులై 8న వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ రైల్వే పీవోహెచ్, వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దీనిపై విమర్శలు వచ్చినప్పటికీ తెలంగాణ సర్కారు రాష్ట్ర ఏర్పాటు సమయంలో విభజన చట్టం అమలు చేసే క్రమంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ మంజూరుపై ఒత్తిడి తీసుకువచ్చింది.
మొదట్లో పీవోహెచ్, వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ఏర్పాటు మాత్రమే ఉండడంతో రూ.383 కోట్లతో పనులను ప్రారంభించినా, ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా స్థాయి పెంచడంతో మొత్తం రూ.716 కోట్లు ఈ యూనిట్ నిర్మాణానికి కేంద్రం ఖర్చు చేస్తున్నట్లు సెంట్రల్ మినిస్టర్ కిషన్‍రెడ్డి వెల్లడించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి చేసి 2026 మార్చి నుంచి రైల్వే కోచ్‍ల తయారీ షురూ కానున్నది. ఈ ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా 5వేలు, పరోక్షంగా 5 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
80 శాతం ఉద్యోగాలు స్థానికులకియ్యాలే..
1985లో పంజాబ్ రాష్ట్రం కపుర్తాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. స్థానికులకే 90 శాతం ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్రత్యేక జీవో తీసుకువచ్చి స్థానికులకే జాబ్స్ కేటాయించినట్లు రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ యూనియన్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు కాజీపేటకు మంజూరు చేసిన కోచ్ ఫ్యాక్టరీ సైతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రత్యేక పరిస్థితుల్లో విభజన చట్టం ఆధారంగా ఇస్తున్న స్పెషల్ ప్రాజెక్ట్ కాబట్టి, రెగ్యులర్ రిక్రూట్‍మెంట్ కాకుండా పంజాబ్ తరహాలో స్థానికులకు 60 నుంచి 80 శాతం ఉద్యోగాలు కేటాయించాలని రాజకీయ పార్టీలు, రైల్వే యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు, రైల్వే ఉన్నాతాధికారులను కలిసి వినతిపత్రాలు అందిస్తున్నారు.
రాష్ట్ర సర్కారు రికమండ్ చేస్తే నిర్ణయం..
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో పంజాబ్ తరహాలో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రికమండ్ చేస్తే దీని ఆధారంగా ఆర్‍ఆర్ పాలసీ అమలుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.
కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి