రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్ ముస్లింలను మోసం చేశారు

రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్ ముస్లింలను మోసం చేశారు
  • రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి దారుణం
  • వారిని ఓట్ బ్యాంక్​లా వాడుకుంటున్న ప్రభుత్వం
  • ముస్లిం ఫ్యాన్స్ తో వైఎస్ షర్మిల మీటింగ్


ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ సర్కారు మోసం చేసిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ముస్లింలను రాష్ట్ర ప్రభుత్వం ఓట్ బ్యాంక్ గా వాడుకుంటుంటే, కేంద్రం హేట్ బ్యాంక్ గా వాడుకుంటోందని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో ముస్లిం ఫ్యాన్స్ తో షర్మిల భేటీ అయ్యారు. కొద్ది సేపు ఉర్దూలో మాట్లాడారు. ముస్లింలు లేని తెలంగాణను ఊహించలేమని.. కానీ రాష్ట్రంలో వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా వాళ్ల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల వక్ఫ్ భూములు కబ్జా అయ్యాయని ఆరోపించారు. ముస్లింలకు వైఎస్ఆర్ 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, దీంతో వారు గ్రూప్స్, పోలీసు ఉద్యోగాలు సాధించారన్నారు. ఇతర కులాలతో సమానంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు, కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లు ఇచ్చారని తెలిపారు. ఈ ఏడేళ్లలో ఓల్డ్ సిటీలో డెవలప్ మెంట్ ఏం జరగలేదన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌‌కు మద్దతు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని షర్మిల అనుచరుడు, గాయకుడు ఏపూరి సోమన్న తెలిపారు. స్వేరో సంస్థతో పేద పిల్లలకు ఉన్నత చదువులు అందిస్తున్నారని, ఆయన మీద దాడులు చేస్తే సహించేది లేదని సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రవీణ్ కుమార్ చేసే జ్ఞాన యుద్ధానికి తాము ముందుంటామన్నారు. వచ్చే నెల 9న పార్టీ ప్రకటన సభకు కళాకారులంతా ఏకమవుతున్నామన్నారు.