నేను విచారణకు రాను..నువ్వే దిగిపో : కేసీఆర్

నేను విచారణకు రాను..నువ్వే దిగిపో : కేసీఆర్
  • పవర్ కమిషన్ చైర్మన్‌ జస్టిస్​ నర్సింహారెడ్డిపై కేసీఆర్ ఎదురు దాడి
  • విచారణ చేసే నైతికత మీకు లేదు..పరిధి దాటి వ్యవహరిస్తున్నరు
  • భద్రాద్రి థర్మల్ స్టేషన్​ సబ్ క్రిటికల్ ప్లాంటే.. తప్పేంది?
  • చత్తీస్​గఢ్​ నుంచి యూనిట్​ కరెంట్​రూ.3.90కే కొన్నం.. అది కాస్ట్లీనా?
  • యాదాద్రి ప్లాంట్​కు 2015లో భూమి పూజ చేశాం..
  • కానీ కరోనా వల్ల లేటైంది.. దానికే మీరు టైమ్​కు పూర్తి కాలేదన్నట్లు మాట్లాడుతున్నరు
  • గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మీ తీరు ఉంది.. మీ ఎంక్వైరీ చట్ట విరుద్ధం.. స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన విద్యుత్​ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్​ నర్సింహారెడ్డి జ్యుడీషియల్​ కమిషన్​పై మాజీ సీఎం, బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ ఎదురు దాడికి దిగారు. వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్​ చైర్మన్​ ఆదేశిస్తే.. విచారణకు తాను రానని, మీరే కమిషన్​ చైర్మన్​ పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయన శనివారం 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తాను కరెంటు కొనుడు తప్పు కాదని, దానిపై ఎంక్వైరీ చేయడమే తప్పు అన్నట్లుగా అందులో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలేవీ జరగలేదని.. ఈ అంశంపై ఎంక్వైరీలు చేయించడం చట్ట విరుద్ధమని కేసీఆర్​ పేర్కొన్నారు. 

ఎంక్వైరీ పూర్తవకముందే, తప్పు జరిగినట్టుగా ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి మాట్లాడుతున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరై, తన వాదన వినిపించినా ప్రయోజనం ఉండదని తెలిపారు. ఎంక్వైరీ చేసే నైతికతను జస్టిస్ నర్సింహారెడ్డి కోల్పోయారని కేసీఆర్​ దుయ్యబట్టారు. 

అసాధారణ నిర్ణయాలు తీసుకున్నం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 5 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, నాటి అసాధారణ పరిస్థితుల్లో తమ ప్రభుత్వం అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్​ తన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. చట్ట పరిధిలోనే అన్ని వ్యవహారాలు చేసి, సక్సెస్ అయ్యామన్నారు. నాటి తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపన్ని, ఎంక్వైరీ కమిషన్ వేశారని ఆయన ఆరోపించారు. ‘‘ఎంక్వైరీ కమిషన్ వేయడం చట్ట విరుద్ధమని చెప్పాల్సిన వ్యక్తే, ఎంక్వైరీ కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించడం బాధాకరం” అని పేర్కొన్నారు. 

‘‘ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్​ కొనుగోళ్లలో, రాష్ట్రంలో కొత్త పవర్​ప్లాంట్లను నెలకొల్పడంలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటించాం. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్ఈఆర్సీ)  తీర్పులకు లోబడే అన్ని చర్యలూ తీసుకున్నాం. వీటిపై అభ్యంతరాలు ఉంటే ఇఆర్​సీలు నిర్వహించే పబ్లిక్ హియరింగుల్లో  తెలియజేయవచ్చు. అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఈఆర్​సీ తీర్పు ఇస్తే, ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఆప్టెల్)కు అప్పీల్​ చేసుకోవచ్చు. చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న  రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్​సీకి తన అభ్యంతరాలు తెలియజేశారు. ఆ అభ్యంతరాలను పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే, తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్​సీ ఆమోదముద్ర వేసింది. 

అప్పటికీ రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉండి ఉంటే, ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌‌కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే అవకాశం ఉంది. కానీ, ఆయన అప్పీలుకు వెళ్లలేదు” అని కేసీఆర్​ తన లేఖలో తెలిపారు. ‘‘ఇప్పుడు రేవంత్​రెడ్డి సీఎం అయ్యాక గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న, ఎంక్వయిరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని మర్చిపోయి ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషనర్‌‌‌‌కు మిమ్మల్ని(జస్టిస్​ నర్సింహారెడ్డిని) చైర్మన్‌‌గా నియమించారు. 

హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు, న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్​సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే.. పరిగణనలోకి తీసుకోకుండానే జూన్ 11 నాడు విలేకరుల సమావేశం పెట్టి, పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ, నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నా” అంటూ జస్టిస్​ నర్సింహారెడ్డికి లేఖలో కేసీఆర్​ పేర్కొన్నారు. 

అందుకే బీహెచ్​ఈఎల్​కు అప్పగించినం

రెండేండ్లలో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాతపూర్వకంగా ఒప్పుకున్నందునే బీహెచ్‌‌ఈఎల్‌‌కు భద్రాద్రి థర్మల్ పవర్‌‌‌‌ ప్లాంట్ పనులను అప్పగించామని కేసీఆర్ తెలిపారు. ‘‘బీహెచ్‌‌ఈఎల్‌‌కు ఉన్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా, తెలంగాణలో కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి దాన్ని సంప్రదించడం జరిగింది. ‘మా వద్ద సబ్ క్రిటికల్ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి సిద్ధంగా ఉంది. మీకు అత్యవసరం ఉంది కనుక దాంతో రెండేండ్లలోనే మీకు మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్​ ప్లాంటు నిర్మించి ఇవ్వగలం. కొత్తగూడెంలో ప్రతిపాదించిన 800 మెగావాట్ల ఏడో దశను మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంటును నాలుగేండ్లలో ఇవ్వగలం’ అని జవాబిచ్చారు. 

దీంతో అప్పుడు తెలంగాణలో ఉన్న తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, సత్వరమే కరెంటును అందుబాటులోకి తెచ్చుకోవడం కోసం మణుగూరులో సబ్​ క్రిటికల్ పద్ధతిలో థర్మల్ ప్లాంటు నిర్మాణానికి నాడు మా ప్రభుత్వం ఓకే చేసింది.  అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కరెంట్​ విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది” అని చెప్పారు. 2014 నాటికి సబ్ క్రిటికల్ పై ఎలాంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదని తెలిపారు. ‘‘ 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళిక కూడా, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని పేర్కొంది. 

అయితే, మీరు జూన్​11న నిర్వహించిన విలేకరుల సమావేశంలోఈవిషయాలను పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్​పై విపరీత వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన నాటికి మన రాష్ట్రంతో పాటు యావత్తు దేశవిద్యుత్తు రంగమే 90 శాతం సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ల విద్యుత్తు ఉత్పత్తిపైనే ఆధారపడి ఉందన్న సంగతిని మీరు పూర్తిగా విస్మరించారు. ఒకవైపు దేశంలో 90 శాతం సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్​క్రిటికల్​ ప్లాంట్ పెట్టినట్టు, చేయరాని తప్పు ఏదో చేసినట్టు మీరు మాట్లాడిన తీరు  మీ దురుద్దేశాన్ని బయటపెట్టింది. 

2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని  మీరు విస్మరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవసరమైన అన్ని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు, ఆమోదాలు పొందిన తర్వాతే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పనులు ప్రారంభించి, విజయవంతంగా పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేసిన సంగతిని మీరు విస్మరించడమే కాకుండా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పుచేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారు. అందువల్ల మీరు ఈ అంశాన్ని విచారించే విచారణార్హతను కోల్పోయారు. కాబట్టి మీరు మీ బాధ్యతలనుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని జస్టిస్​ నర్సింహారెడ్డికి కేసీఆర్​ లేఖ రాశారు. 

ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమేంది?

‘‘రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్​ను ఏర్పాటు చేసింది. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి, అన్ని రంగాలకూ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చింది. దీన్ని తక్కువచేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడమే అత్యంత దురదృష్టకరం అనుకుంటే.. కమిషన్ చైర్మన్​గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది” అని జస్టిస్​ నర్సింహారెడ్డిపై కేసీఆర్​ మండిపడ్డారు. 

‘‘నిజానికి మీ(జస్టిస్​ నర్సింహారెడ్డి) పిలుపు మేరకు, లోక్​సభ ఎన్నికల తర్వాత.. 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వయిరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు విలేఖరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, పదేండ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయదలిచి ఇచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది” అని వ్యాఖ్యానించారు. ‘‘ఎంక్వయిరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే  మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. 

ఇప్పటికే  తప్పు జరిగిపోయినట్టు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టంచేస్తున్నాయి. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను” అని జస్టిస్​నర్సింహారెడ్డికి కేసీఆర్ లేఖ రాశారు. 

దామరచర్లలో అందుకే పెట్టినం

‘‘యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్​ను దామరచెర్లలోనే ఎందుకు పెట్టాల్సివచ్చింది అన్నది మీ విచారణాంశాల్లో ఉన్నది. ఒక విద్యుత్కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. తెలంగాణలోని భారీ విద్యుత్కేంద్రాలన్నీ గోదావరి తీరంలోనే ఉన్నందున.. దక్షిణ ప్రాంతానికి అనువుగా, యాదాద్రి ప్లాంటు నిర్మాణానికి దామరచర్లను ఎంపిక చేశాం. యాదాద్రి ప్లాంట్​కు భూమి పూజ చేసింది 8.-6.-2015వ తేదీ నాడు. అయితే, చాలాకాలం పాటు దీనికి పర్యావరణ అనుమతి లభించలేదు. ఆ తర్వాత కరోనా పెనుభూతం కమ్ముకున్నది. దీంతో ప్లాంటు నిర్మాణంలో పాల్గొనే కార్మికులు చెల్లాచెదురయ్యారు. 

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు ఆలస్యమైనట్టే ఇది కూడా ఆలస్యమైంది. అనంతరం దాదాపు 8 నెలల పాటు (30.-09.-2022 నుంచి 7-.5-.2023వరకు) ఎన్​జీటీ స్టేతో పనులు ఆగిపోయాయి. ఇవన్నీ ప్రభుత్వం, నిర్మాణ సంస్థ చేతిలో లేని పరిస్థితులు. అయినా ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి మేం చిత్తశుద్ధితో ప్రయత్నించాం. ఇందులో భాగంగానే కోల్ లింకేజీని సాధించాం. ప్లాంటును కూడా దాదాపుగా పూర్తి చేశాం” అని కేసీఆర్​ తెలిపారు. 2024 మే మొదటి వారంలో రెండు యూనిట్లకు బాయిలర్లను లైటింగ్ చేయడం కూడా జరిగిందని,  రైల్వే లైను లింకేజీ పనులు కూడా 70 శాతం పూర్తయ్యాయని అన్నారు. 

‘‘ఈ వాస్తవాలు వేటినీ గుర్తించకుండా, ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని మీరు చెప్పడం అసమంజసం. వాస్తవాలకు విరుద్ధంగా పనులు కానే కాలేదన్నట్టు దురుద్దేశం ఆపాదించే విధంగా మీరు మీ వ్యాఖ్యల్లో నిందలు వేశారు. జ్యుడీషియల్ కమిషన్  టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్​లో  దీని గురించి ప్రస్తావన లేనప్పటికీ, మీరు మాట్లాడడం మీ పరిధి దాటి వ్యవహరించడమే కాదు.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనం కూడా. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండడం ఎంతమాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని జస్టిస్​ నర్సింహారెడ్డిని కేసీఆర్​ దుయ్యబట్టారు. 

చత్తీస్​గఢ్​ కరెంట్​ఎట్ల కాస్ట్లీ అయితది

‘‘చత్తీస్‌‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు -2014  నవంబర్ ​3న ఎంవోయూ కుదుర్చుకోవడం జరిగింది.  అయితే, చత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ట్రాన్స్​మిషన్  లైన్లు లేవు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్​) మహారాష్ట్రలోని వార్దా నుంచి డిచ్​పల్లి వరకు లైన్ నిర్మాణం ప్రారంభించింది. దాని ద్వారా చత్తీస్​గఢ్​ కరెంట్ తెలంగాణకు తీసుకువచ్చే వీలుందని తెలుసుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు పీజీసీఐఎల్​తో సంప్రదింపులు జరిపారు. 

ఈ లైన్​లో దక్షిణాది రాష్ట్రాలు పోటా పోటీగా కారిడార్ బుక్​ చేయడం మొదలైంది. లైన్ నిర్మాణం పూర్తి కాకున్నా ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి కనుక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ కూడా కారిడార్ బుక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది” అని కేసీఆర్​ తెలిపారు. చత్తీస్​గఢ్​తో  తెలంగాణ పీపీఏ చేసుకున్న 2014 సంవత్సరంలోనే తమిళనాడు టెండర్ పద్ధతిలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నదని, దాని యూనిట్ రేటు రూ.4.94 అని.. అదే సంవత్సరం కర్నాటక కూడా టెండర్ పద్ధతిలో పీపీఏ చేసుకున్నదని, దాని యూనిట్ రేటు రూ.4.33 అని..  చత్తీస్​గఢ్​తో తాము  నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 3.90కే యూనిట్ కరెంటు కొంటే అది ఎక్కువ కాస్ట్ ఎట్లవుతుందని ఆయన అన్నారు. అలాంటప్పుడు తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారని జస్టిస్​ నర్సింహారెడ్డిని ప్రశ్నించారు.