సొంత లీడర్లపై కేసీఆర్ నిఘా..ఎవరితో టచ్‌లో ఉన్నారని​ ఆరా

సొంత లీడర్లపై కేసీఆర్ నిఘా..ఎవరితో టచ్‌లో ఉన్నారని​ ఆరా
  • ‘సిట్టింగ్‌‌లకే టికెట్లు’ అన్న తర్వాత 200 మంది లీడర్ల కదలికలపై పెరిగిన ఫోకస్‌‌
  • నేతల సన్నిహితులు, ముఖ్య అనుచరుల మూవ్‌‌మెంట్స్‌‌పైనా కన్ను
  • రంగంలోకి ఇంటెలిజెన్స్‌‌తో పాటు వివిధ ఏజెన్సీలు
  • ఎప్పటికప్పుడు ప్రగతిభవన్​కు చేరుతున్న సమాచారం!

 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో ఉండేదెవరు.. పార్టీని వీడి వెళ్లేదెవరు.. అనేదానిపై గులాబీ బాస్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెంచారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల కదలికలపై నిఘా పెట్టారు. ఎవరు ఎవరితో టచ్‌‌‌‌లో ఉన్నారు.. ఎక్కడ ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం పక్కాగా సేకరిస్తున్నారు. సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్‌‌‌‌ ఇస్తామని ఇటీవల  పార్టీ జాయింట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో కేసీఆర్​ ప్రకటించిన తర్వాత టీఆర్​ఎస్​ లీడర్లపై ఫోకస్‌‌‌‌ ఇంకింత పెరిగింది. లీడర్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ముఖ్య అనుచరులతో పాటు వ్యక్తిగత సిబ్బందిపైనా హైకమాండ్​ నిఘా పెట్టింది. వాళ్ల ఫోన్‌‌‌‌ కాల్స్‌‌‌‌పైనా ఆరా తీస్తున్నది. ఇందుకు స్టేట్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌తో పాటు పలు ఏజెన్సీలను రంగంలోకి దింపింది.దాదాపు 200 మంది లీడర్ల ప్రతి మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌పై ఎప్పటికప్పుడు ప్రగతి భవన్‌‌‌‌కు సమాచారం అందుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌‌‌‌గా కేసీఆర్‌‌‌‌ ఎత్తుగడలు వేస్తున్నారు. బలమైన లీడర్లు టీఆర్ఎస్‌‌‌‌ను వీడి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మునుగోడు రిపోర్టుల ఆధారంగా..!

మునుగోడు ఉప ఎన్నికలో పనిచేసిన ఇన్‌‌‌‌చార్జీలకు గ్రౌండ్‌‌‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీపై, ప్రభుత్వంపై ఎంత స్థాయిలో వ్యతిరేకత ఉన్నదో తేటతెల్లమైంది. ఒక్క ఎంపీటీసీ పరిధిలో పార్టీకి మెజార్టీ తీసుకురావడానికి తాము ఎంత కష్టపడ్డామో సదరు ఇన్‌‌‌‌చార్జులు తమను కలిసిన సన్నిహితులకు చెప్పుకొని వాపోతున్నారు. ప్రచారం, పోల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం పార్టీ ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఖర్చు చేస్తేగాని కొందరు ఇన్​చార్జులు ఐదు, పది ఓట్ల లీడ్‌‌‌‌ తేలేకపోయారు. కొందరు కోట్లు కుమ్మరించినా.. బీజేపీ అభ్యర్థికన్నా తమ ఏరియాలో తక్కువ ఓట్లు తీసుకురాగలిగారు. పార్టీ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జ్​గా ఉన్న గట్టుప్పల్‌‌‌‌లో ఎంతో శ్రమిస్తేగాని 48 ఓట్ల లీడ్‌‌‌‌ తెచ్చుకోగలిగారు. పోలింగ్‌‌‌‌ టైంలో భారీగా ముట్టజెప్తే తప్ప ప్రజలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేయలేదంటే వచ్చే ఎన్నికల్లో తమ పని అయిపోయినట్టేనని కొందరు ఇన్​చార్జులు తమకు సన్నిహితంగా ఉండేవాళ్ల దగ్గర వాపోయారు. ఇలాంటి అభిప్రాయాలు ఎంతమంది లీడర్లు వ్యక్తం చేశారు.. వాళ్ల మూడ్‌‌‌‌ ఎలా ఉంది.. అనే దానిపై కేసీఆర్​ పలు నివేదికలు అందాయి. దీంతో ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులపై నిఘా పెంచినట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

టికెట్​ హామీ ఇచ్చి చేర్చుకొని.. ఇప్పుడు..?!

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌‌‌, బీజేపీకి చెందిన పలువురు నాయకులను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లోకి తీసుకువచ్చారు. వారిలో కొందరికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌‌‌‌పై ముందే హామీ ఇచ్చారు. ఇప్పుడు సిట్టింగ్‌‌‌‌లకే టికెట్లు ఇస్తే తమ పరిస్థితి ఏమిటా అని ఆ నాయకులు ఆందోళనలో ఉన్నారు. 12 మంది కాంగ్రెస్‌‌‌‌, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎల్పీలో విలీనం అయ్యారు. ఆయా స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో కొందరు ఇప్పటికే పార్టీని వీడి బీజేపీ, కాంగ్రెస్​లో చేరారు. మరికొందరు మాత్రం తమకు చాన్స్​ రాకపోతుందా అని టీఆర్​ఎస్​లో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్‌‌‌‌ తాజా ప్రకటన ‘సిట్టింగ్​లకే టికెట్​’తో వాళ్లంతా డైలమాలో పడ్డారు. వారిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కావడంతో వాళ్లు పార్టీని వీడితే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు నష్టం కలుగుతుందనే అంచనాలో కేసీఆర్‌‌‌‌ ఉన్నారు. నియోజకవర్గాల వారీగా పీకేతో పాటు పలు సర్వే ఏజెన్సీలను రంగంలోకి దించి వచ్చే ఎన్నికల్లో ఎవరిని పోటీకి దించితే ఓట్లు పడ్తాయనే సమాచారం సేకరిస్తున్నారు. ప్రజల మద్దతున్న లీడర్లు బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌లో చేరితే తమ హ్యాట్రిక్‌‌‌‌ విజయం ఆశ నెరవేరదనే అంచనాతో కేసీఆర్‌‌‌‌ ఎత్తులు వేస్తున్నారు. ఇంటెలిజెన్స్‌‌‌‌ సహా ప లు ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. లీడర్ల  ఫోన్‌‌‌‌  కాల్‌‌‌‌ సంభాషణలను సదరు ఏజెన్సీలు గుర్తించి గులాబీ బాస్‌‌‌‌ కు చేరవేస్తున్నారని ప్రచారంలో ఉంది.

ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు

ఇటీవల పార్టీ జాయింట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో కేసీఆర్‌‌‌‌ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్​ ఇచ్చారు. ఎవరు ఎవరితో టచ్‌‌‌‌లో ఉన్నారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసని, పార్టీలోకి రావాలని ఎవరైనా అడిగితే తనకు చెప్పాలని ఆదేశించారు. కేసీఆర్​ వార్నింగ్‌‌‌‌ తర్వాత కూడా కొందరు లీడర్లు ఆయన దారిలోకి రాలేదు. తాము రాజకీయంగా సజీవంగా ఉండాలంటే ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక కావాలని, లేదంటే ఇతర లీడర్లు తమను ఓవర్‌‌‌‌ టేక్‌‌‌‌ చేసి ముందుకు వస్తారనే హైరానా వారిలో ఉంది. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో చేరితే రాజకీయంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు మంత్రులు కూడా ఇదే తరహాలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటం, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు సహా పలు హామీలను నెరవేర్చకపోవడంతో కేసీఆర్‌‌‌‌ సర్కారుపై ప్రజల్లో క్రమేణా వ్యతిరేకత పెరుగుతున్నది.  వచ్చే ఎన్నికల నాటికి ఇది ఇంకా పెరిగే ప్రమాదముందని ఎమ్మెల్యేలు, లీడర్లు అంచనాకు వచ్చారు. ఇతర పార్టీల్లో తమకు సన్నిహితంగా ఉండే నాయకులతో మాట్లాడుకొని అక్కడ ఖర్చిఫ్​ వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.