టమాటా @200..సర్కార్​ సైలెంట్​

టమాటా @200..సర్కార్​ సైలెంట్​
  • సబ్సిడీపై అమ్ముతున్న పక్క రాష్ట్రాలు
  • ఏపీలో రూ. 50.. తమిళనాడులో రూ. 60 
  • మన రాష్ట్రంలో మాత్రం ఎలాంటి చర్యల్లేవ్ 
  • ధరలపై రివ్యూ చేయని సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: టమాటా కిలో రూ.200కు చేరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కూరగాయల రేట్లు అమాంతం పెరిగినప్పటికీ, ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో టమాటా సహా పచ్చి మిర్చి, ఇతర కూరగాయల ధరలు భారీగా పెరగ్గా.. సీఎం కేసీఆర్ కనీసం రివ్యూ కూడా నిర్వహించలేదు. జనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలే సబ్సిడీపై టమాటాలు విక్రయిస్తుండగా, మన సర్కార్ మాత్రం అలాంటి చర్యలేమీ చేపట్టడం లేదు. ఇప్పటికే ఏపీ సర్కార్ కిలో టమాటా రూ.50కే అమ్ముతున్నది. మూడు నాలుగు రోజులుగా రైతు బజార్లలో వాటిని విక్రయిస్తున్నది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా టమాటాలు తెప్పిస్తున్నది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కిలో రూ.60కే టమాటాలు విక్రయించాలని నిర్ణయించింది. ధరల పెరుగుదలపై సివిల్​సప్లయీస్​ అధికారులతో రివ్యూ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్.. ప్రజలకు అందుబాటులో ఉండేలా రేషన్​షాపుల్లో టమాటాలు అమ్మాలని ఆదేశించారు.  మంగళవారం నుంచి కిలో రూ.60కే టమాటాలను రేషన్ షాపుల్లో విక్రయించనున్నారు. 

సీరియస్ గా తీసుకోని సర్కార్.. 

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ధరల నియంత్రణకు చర్యలు తీసుకోగా, మన ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా ఉంది. ధరల పెరుగుదలపై జనం గగ్గోలు పెడుతున్నా, దీన్ని సీఎం కేసీఆర్ సీరియస్​గా తీసుకోలేదు. అగ్రికల్చర్, హార్టికల్చర్ శాఖలు, మార్కెటింగ్, సివిల్ ​సప్లయీస్​ డిపార్ట్​మెంట్లు ​కూరగాయలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు. రైతు బజార్లలో రూ.100కే టమాటాలు అమ్ముతున్నట్టుగా చెప్పడం తప్ప.. ఓపెన్​ మార్కెట్లో ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఊర్లల్లో కూరగాయలు అమ్మేటోళ్లు కూడా కనిపిస్తలేరు. దీంతో సామాన్యులు కూరల కోసం తిప్పలు పడాల్సి వస్తున్నది. 

గతంలో సబ్సిడీపై ఉల్లిగడ్డలు.. 

గతంలో వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరతతో ఉల్లి ధరలు చాలాసార్లు రూ.100, రూ.150 దాటాయి. ఆయా సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై ఉల్లిగడ్డలను రైతు బజార్లు, ఇతర కౌంటర్ల ద్వారా విక్రయించాయి. తెలంగాణలోనూ 2019లో కేసీఆర్ ​ప్రభుత్వం రైతు బజార్లలో రూ.40కే ఉల్లిగడ్డలు అమ్మింది. కానీ ఇప్పుడు టమాటాల ధర సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగినా, సబ్సిడీపై అమ్మే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉల్లిగడ్డల తర్వాత కొన్ని సందర్భాల్లో ఆలుగడ్డలకు కూడా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేశారు. ఆయా సందర్భాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆలుగడ్డలు విక్రయించాయి. 

ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల్లా టమాటాలకు కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు తక్కువే. ఎందుకంటే కోల్డ్​స్టోరేజీల్లో ఉంచినా వారానికి మించి టమాటాలు నిల్వ ఉండవు.  తెలంగాణలో రెండు వారాలుగా టమాటా ధరలు రూ.100కు పైగానే ఉన్నాయి. నిత్యం ప్రజల అవస్థలను ఇంటెలిజెన్స్​వర్గాలు రిపోర్టు చేస్తూనే ఉన్నాయి. మీడియాతో పాటు సోషల్​మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ తెలిసినా ప్రభుత్వం కొంతమేరకైనా ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టలేదు. దీంతో సర్కార్ తీరుపై జనం మండిపడుతున్నారు.