ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తాం

ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తాం

గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పిల్లలకు ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.  అధికారంలోకి  వచ్చాక కొత్త పాఠశాలలను తెరిచి, ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలోని మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.  తాము  ఎవరినీ బలవంతం చేయమని,  తల్లిదండ్రులకు డబ్బు ఉంటే, వారు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపవచ్చునని అన్నారు.  డబ్బు లేని వారి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తామని టౌన్ హాల్ లో జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ చెప్పారు.  

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలపై క్రమం తప్పకుండా ఆడిటింగ్ జరిగేలా చూస్తామని తెలిపారు. అలాగే  కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ గతంలో గుజరాత్  పర్యటనల సందర్భంగా విద్యుత్, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలు, గిరిజనులకు సంబంధించి అనేక ముందస్తు ఎన్నికల హామీలను ప్రకటించారు. కాగా ఈ ఏడాది చివర్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.