
మొహాలీ: పంజాబ్‌లో అధికారంలోకి వస్తే 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 10 పాయింట్లతో కూడిన పంజాబ్ మోడల్‌ను బుధవారం మొహాలీలో ఆయన విడుదల చేశారు. వచ్చే ఐదేండ్లలో పంజాబ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ‘యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఉపాధి కోసం కెనడాకు వెళ్లినోళ్లను తిరిగి రప్పిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 16వేల మొహల్లా క్లినిక్‌లు పెట్టి, ప్రజలందరికీ ఫ్రీ ట్రీట్ మెంట్ అందిస్తాం. 300 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ ఇస్తాం. డ్రగ్ మాఫియాను అరికడ్తాం. దైవదూషణ, అవినీతి కేసుల్లో విచారణ జరిపించి దోషులను శిక్షిస్తాం. రైతుల సమస్యలను పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు. ప్రధానికి, ప్రజలకు సెక్యూరిటీ కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.