వాహనాలకు BH రిజిస్ట్రేషన్ చేయం : కేంద్రానికి కేరళ అల్టిమేటం

వాహనాలకు BH రిజిస్ట్రేషన్ చేయం : కేంద్రానికి కేరళ అల్టిమేటం

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రైవేట్ వాహనాలకు BH సిరీస్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది కేరళ రాష్ట్రం. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయల నష్టం వస్తుందని.. దీన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నిస్తుంది కేరళ. కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానాన్ని అమలు చేయటం సాధ్యం కాదని.. రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే BH సిరీస్ నెంబర్ కేటాయించేది లేదని వెల్లడించింది. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాహనదారులు BH సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ స్కీం అమల్లో ఉంది. వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ వాహనాలకు ఈ సిరీస్ తీసుకొచ్చింది. దీని వల్ల ఉద్యోగ, వ్యాపార, ఇతర అవసరాల కోసం ఆయా వాహనదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు వాహనాల నెంబర్ మార్చుకోకుండా.. ఇబ్బందులు లేకుండా ఈ స్కీం అమలు చేస్తుంది. 

ఇలా BH రిజిస్ట్రేషన్ వల్ల వాహనాల కొనుగోలు సమయంలో కేరళ రాష్ట్రం 28 శాతం జీఎస్టీ విధిస్తుంది.. BH సిరీస్ రిజిస్ట్రేషన్ కు 21 శాతం మాత్రమే జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల కేరళ రాష్ట్రం ఏడాదికి 300 కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీంతో BH రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది కేరళ రాష్ట్రం.

BH రిజిస్ట్రేషన్ అంటే ఏంటీ :

BH- సిరీస్ రిజిస్ట్రేషన్ మొదట రిజిస్ట్రేషన్ సంవత్సరంతో ప్రారంభమవుతుంది. అప్పుడు BH అనే పదం చివర ఆల్ఫాన్యూమరిక్ అంకెలతో కనిపిస్తుంది. మీరు 2024లో వాహనం కొనుగోలు చేసినట్లయితే.. 24 BH తో ప్రారంభం అయ్యి.. ఆ తర్వాత నెంబర్ కేటాయిస్తారు.

ఎవరికి ప్రయోజనం :

BH- సిరీస్ రక్షణ సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పని చేసే వారు.. రెండు, మూడు, రాష్ట్రాలకు బదిలీ అయ్యే ఉద్యోగులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపారాల కోసం వెళ్లి అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 

ప్రస్తుతం అయితే ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనం.. మరో రాష్ట్రంలో తిరుగుతున్నట్లయితే.. దానికి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యిందో అక్కడికే వెళ్లి తెచ్చుకోవాలి. దాన్ని మళ్లీ ఆయా వాహనదారులు కొత్త రాష్ట్రంలో కొత్త పన్ను చెల్లించాలి. పాత రాష్ట్రంలో పన్ను వాపస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రాసెస్.. వాహనదారుల ఇబ్బందులను గుర్తించి.. BH సిరీస్ తో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. అయితే దీన్ని అమలు చేయటం లేదని కేరళ రాష్ట్రం ప్రకటించింది.