ఏపీ నంబర్  వాహనాలతోనే అపోహలు.. ఏపీ మక్కలు కొనలేదని కలెక్టర్ వివరణ.. వెలుగు దినపత్రిక కథనానికి స్పందన..

ఏపీ నంబర్  వాహనాలతోనే అపోహలు.. ఏపీ మక్కలు కొనలేదని కలెక్టర్ వివరణ.. వెలుగు దినపత్రిక కథనానికి స్పందన..

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఏపీ మక్కజొన్న అమ్ముతున్నారనే వార్తపై కలెక్టర్  దివాకర స్పందించారు. వేంసూరు మండలంలో కొనుగోలు చేస్తున్న మక్కజొన్న పూర్తిగా స్థానిక రైతులదేనని స్పష్టం చేశారు. శనివారం వెలుగు దినపత్రికలో ‘ఖమ్మం మార్కెట్‌కు ఏపీ నుంచి మక్కలు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి వివరణ ఇచ్చారు. 

కొనుగోలు కేంద్రాల్లో ఏవోలు, ఏఈఓలు, జీపీవోలు రైతుల వివరాలను ధృవీకరించిన తరువాతే కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు. ఓపీఎంఎస్  పోర్టల్‌లో నమోదైన రైతుల మక్కలకు మాత్రమే ట్రక్  షీట్లు జారీ చేసి గోదామ్​లకు తరలిస్తున్నామని చెప్పారు. 

ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామానికి చెందిన  కొప్పర్తి జగదీశ్వర్ రెడ్డి 400 క్వింటాళ్ల మక్కలను ఎర్రుపాలెం ఏఎంసీ గోదామ్​కు తరలించేందుకు ఏపీకి చెందిన ట్రాక్టర్లను వినియోగించినట్లు విచారణలో తేలిందన్నారు. వాహనాలపై ఏపీ రిజిస్ట్రేషన్  నంబర్లు ఉండడంతో పక్క రాష్ట్రం నుంచి మక్కలు తీసుకొస్తున్నారనే అపోహలు ఏర్పడ్డాయని తెలిపారు. హమాలీల కొరత కారణంగా కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతోందన్నారు.