గురుకులాలకు ఆఫీసర్ల మార్కులు

 గురుకులాలకు ఆఫీసర్ల మార్కులు
  • ఆహార నాణ్యత పెంచేందుకు ఖమ్మం కలెక్టర్ ప్లాన్ 
  • ప్రతీ వారం ఆకస్మిక తనిఖీలకు స్పెషల్ ఆఫీసర్లు
  • అక్కడి పరిస్థితులు, పరిశుభ్రత, వసతులకు మార్కులు
  • ప్రతీ సోమవారం గురుకులాలపై సమీక్షకు నిర్ణయం

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలోని గురుకులాల్లో ఆహార నాణ్యతతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. ఇతర జిల్లాల్లో ఫుడ్ పాయిజన్​ ఘటనలతో పాటు స్టూడెంట్స్ ఆత్మహత్యల నేపథ్యంలో ఆఫీసర్లు అలర్ట్​ అయ్యారు. ఇప్పటి వరకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించడంతో పాటు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకులాల్లో ఆహార నాణ్యతతో పాటు అక్కడి వసతులను, సౌకర్యాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి నిర్ణయించారు. 

రోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆకస్మిక తనిఖీ చేసేలా టీమ్​ లను ఏర్పాటు చేస్తున్నారు. కనీసం నాలుగు గురుకులాలకు ఒకరి​ చొప్పున ప్రత్యేక అధికారులను నియమించారు. వారు ఎప్పటికప్పుడు గురుకులాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడి పరిస్థితులను మార్కులను వేయాలని, ప్రతీ సోమవారం గ్రీవెన్స్​ ముగిసిన తర్వాత గురుకులాలకు వచ్చిన మార్కులపై సమీక్షించి పరిస్థితులు మరింత మెరుగయ్యేలా చూడాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అదనంగా సొంతంగా కలెక్టర్​ అనుదీప్​ తీసుకుంటున్న ఈ చర్యలపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మార్కులు వేసిది ఇలా.. 

ఖమ్మం జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 122 రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో సుమారు 13,876 మంది విద్యార్థులు ఉచిత విద్యతో పాటు వసతి పొందుతున్నారు. ఇందులో బీసీ, గిరిజన, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వారికి మరింత మెరుగైన ఆహారంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను 40 శాతం పెంచగా, కాస్మెటిక్ చార్జీలను 200 శాతం పెంచింది. 

ఆయా హాస్టళ్లలో రోజూ రెండు టిఫిన్లు, సన్న బియ్యంతో వండిన అన్నంతో కలిపి ఏడు రకాల పదార్థాలు, గుడ్డు, నెలకు ఆరుసార్లు మాంసాహారంతో విద్యార్థులకు సంపూర్ణ భోజనం అందించేలా ప్రభుత్వం మెనూ అమలు చేస్తోంది. సంక్షేమ హాస్టళ్లలో భోజనం, వసతి పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా కలెక్టర్​ కేటాయించారు. 

ఈ ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని సంక్షేమ హాస్టళ్లలో వారానికి ఒకసారి ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. గురుకుల ప్రాంగణంలో పారిశుధ్య చర్యలు, పిల్లలకు వండుతున్న ఆహార పదార్థాలు, కూరగాయల నాణ్యత, తాగునీటి సరఫరా, కిచెన్ రూమ్ లో పరిశుభ్రత, మెనూ ఎలా పాటిస్తున్నారన్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.

 ఒక ప్రొఫార్మాలో ప్రతి పారామీటర్ కు పది మార్కుల చొప్పున ఇవ్వనున్నారు. స్కూల్ కమిటీలు ఏర్పాటు చేసినందుకు, వాటి నిర్వహణ ఉంటే కొన్ని మార్కులు, హైజీన్ మెయిన్​ టెయిన్​ చేస్తే 10 మార్కులు, స్కూల్ నీట్ గా ఉంటే పది మార్కులు, టాయిలెట్స్​ నీట్ గా ఉంటే 10 మార్కులు.. ఇలా 100 మార్కులతో గూగుల్ వర్క్​ షీట్ ను ప్రిపేర్​ చేస్తారు.

 జిల్లాలో బెస్ట్ స్కూల్ ఏంటి, మార్కులు తక్కువ వచ్చిన వరస్ట్ స్కూల్ ఏంటి అనేది ప్రజావాణిలో అందరికీ అందజేయాలని కలెక్టర్ అనుదీప్​ నిర్ణయించారు.ఈ ప్రత్యేక అధికారుల తనిఖీల సమయంలోనే భోజనం నాణ్యత, మెరుగైన సదుపాయాల కల్పనకు చేపట్టాల్సిన చర్యలు, సమస్యలపై నివేదిక సమర్పిస్తారు. ఈ రిపోర్టుల ద్వారా ఆయా స్కూళ్లలో మరింత మెరుగైన భోజనం, ఇతర వసతులు అందించేందుకు చర్యలు తీసుకుంటారు. 

క్వాలిటీ ఫుడ్​ అందిస్తాం..

ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో చదివే పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. బయటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోకి అనుమతించడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూ ప్రకారం శుచికరమైన, రుచికరమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆహార నాణ్యతతో పాటు వసతులను మరింత మెరుగు పరిచేందుకు ప్లాన్​ చేస్తున్నాం. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజనింగ్ లాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - అనుదీప్​ దురిశెట్టి,  ఖమ్మం కలెక్టర్​