నా భర్త కిడ్నీలు ఖరాబైనయ్​మూడు లక్షలిచ్చి కాపాడండి

నా భర్త కిడ్నీలు ఖరాబైనయ్​మూడు లక్షలిచ్చి కాపాడండి
  • కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన భార్య 
  •     బీడీలు చేస్తూ ట్రీట్​మెంట్​చేయిస్తున్న లావణ్య 
  •     చికిత్సకు డబ్బుల్లేక దాతల కోసం ఎదురుచూపులు

మల్లాపూర్, వెలుగు: కిడ్నీలు ఖరాబై నాలుగేండ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భర్తను బతికించాలంటూ అతడి భార్య వేడుకుంటోంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన సామల్ల తిరుపతి మెట్ పల్లిలోని ఓ ప్రైవేటు స్కూల్ లో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతడి భార్య లావణ్య బీడీ కార్మికురాలు. ఇద్దరూ కష్టపడితే గాని ఇల్లు గడవదు. నాలుగేండ్ల కింద తిరుపతి తీవ్ర అనారోగ్యానికి గురికాగా హాస్పిటల్​లో చూపించారు.

అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు తిరుపతి కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. దీంతో అప్పటి నుంచి డయాలసిస్​పైనే ఆధారపడి బతుకుతున్నాడు. దీంతో లావణ్య బీడీలు చేస్తూ భర్త ట్రీట్​మెంట్​తో పాటు మందులు ఇతర ఖర్చులు వెల్లదీస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించగా హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి కిడ్నీ మారిస్తే తప్పా తిరుపతి బతకడం కష్టమని చెప్పారు.

తన భర్త కోసం లావణ్య కిడ్నీని ఇవ్వడానికి సిద్ధపడినా మార్పిడి చేయడానికి అవసరమయ్యే రూ.మూడు లక్షల లేక తండ్లాడుతోంది. నెలంతా బీడీలు చేస్తే వస్తున్న రూ.2, 3 వేలు చికిత్సకే ఖర్చవుతోంది. చేతిలో చిల్లి గవ్వ లేని ప్రస్తుత పరిస్థితుల్లో రూ.3 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేదని బాధపడుతోంది.  ఎవరైనా మనసున్న మారాజులు ఆసరాగా నిలిస్తే తన భర్తను బతికించు కుంటానని వేడుకుంటోంది. సాయం చేయాలనుకునేవారు ఫోన్ పే / గూగుల్ పే 8309424664 కు పంపాలని విన్నవించుకుంటోంది.