కరోనా వైరస్ పై  అధికారులకు కిమ్ వార్నింగ్

కరోనా వైరస్ పై  అధికారులకు కిమ్ వార్నింగ్

చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ కరోనా (కోవిడ్-19). వైరస్ దేశంలోకి వ్యాప్తి చెందకుండా ఆయా దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టాయి. అనుమానితులకు ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఉత్తర కొరియా మాత్రం..కరోనా వైరస్ అనేది తమ దేశంలోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు… వైరస్ సోకిన వారిని దేశంలోకి అనుమతించడం లేదు. దీనికి సంబంధించి ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ కఠిన చర్యలు చేపట్టారు.

కరోనా వైరస్ ఉత్తర కొరియా దేశంలోకి రాలేదన్న దేశ అధ్యక్షుడు కిమ్.. దేశంలోకి వైరస్ వ్యాపిస్తే, వైద్య ఆరోగ్య అధికారులు కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు. అది మరణ దండన కూడా కావచ్చని స్పష్టం చేశారు. సరిహద్దులు దాటి ఈగను కూడా దేశంలోకి రానివ్వవద్దని… అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తర కొరియా బోర్డర్స్ అన్నీ మూసి వేయాలని, కరోనా ప్రభావం తగ్గేంత వరకూ దేశంలోని పౌరులెవరూ విదేశాలకు వెళ్లరాదని, విదేశాల్లోని వారెవరికీ దేశంలోకి అనుమతించరాదని తేల్చి చెప్పారు. ఇతర దేశాల్లో ఉన్న ఉత్తర కొరియన్లను కూడా దేశంలోకి అడుగు పెట్టనివ్వరాదని ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ రైళ్లను, విమానాలను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఉత్తర కొరియాకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు నిలిచిపోయాయి.