- 12న హనుమాన్ పెద్ద జయంతి వేడుక
- రెండు లక్షల మంది వస్తారని అంచనా, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు
కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు వచ్చాయి. వీటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కొండగట్టు, భద్రాచలం ఈవోలు అంజనారెడ్డి, దామోదర్ ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు.
అగ్నిమధనంతో మొదలైన పూజలు
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆలయంలోని ఉత్సవమూర్తులను యాగశాలకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయంలో అగ్ని మదనం కార్యక్రమం చేపట్టిన అనంతరం రుత్విక్ వరణము, దేవతాహ్వానం, స్థాపితా దేవారాధన కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం స్వామివారికి విష్ణు సహస్ర నామపారాయణం, స్థాపితా దేవారాధన, హోమం, సుందరకాండ పారాయణం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, బలిహరణం, మహా నివేదన, మంత్రపుష్పం కార్యక్రమాలు చేపట్టిన అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఉత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు
కొండగట్టులో మూడు రోజుల పాటు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనావేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు.
గుట్టపైన తాగునీటితో పాటు ఇతర అవసరాలకు 25 లక్షల లీటర్ల నీటిని సిద్ధంగా ఉంచినట్లు ఆఫీసర్లు తెలిపారు. అంబులెన్స్ సౌకర్యాన్ని, మెడికల్ టీమ్లను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1,100 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. బొజ్జ పోతన పార్కింగ్ స్థలం నుంచి గుట్టపైకి ఉచిత బస్ను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు పంపిణీ చేసేందుకు ఐదు లక్షల లడ్డూలను సిద్ధంగా ఉంచామని చెప్పారు.
