Telangana Tour : కొండాపూర్ మ్యూజియం చూసొద్దామా..

Telangana Tour : కొండాపూర్ మ్యూజియం చూసొద్దామా..

ఆదిమ మానవులు ఉపయోగించిన వస్తువులు, రాజుల కాలం నాటి నాణాలు, అలనాటి నాగరికతకి సంబంధించిన ఆనవాళ్లని చూసినప్పుడు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ఉన్న ఆరియలాజికల్ మ్యూజియంలో చారిత్రక ఆనవాళ్లు చాలానే ఉన్నాయి. వందల ఏండ్ల చరిత్రని కళ్లకు కడుతున్న ఈ మ్యూజియం చూడాల్సిన ప్లేస్.  

డాపూర్ మ్యూజియం చిన్న కొంకాండ మీద ఉంటుంది. ఈ మ్యూజియాన్ని పంతొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ హెన్రీ కౌసెన్స్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఈ మ్యూజియం నిజాం రాజుల చేతుల్లోకి వెళ్లింది. ఇందులో ఎగ్జిబిషన్ కు పెట్టిన వస్తువుల్లో చాలావరకు పక్కనే ఉన్న 'కోటగడ్డ' ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడినవే. 

టెర్రకోట (ఎర్రమట్టి)తో చేసిన పాత్రలు, కుండలు, జంతువుల్ని వేటాడటానికి వాడిన ఆయుధాలు ఒకప్పటి జీవన విధానాన్ని చెప్పకనే చెప్తాయి. ఈ మ్యూజియంలో సెంట్రల్ హాల్, రెండు గ్యాలరీలు ఉన్నాయి. వీటిల్లో శాతవాహనుల కాలం నాటి పనిముట్లు, వస్తువులే ఎక్కువ. లోహంతో చేసిన పరికరాలు, నెక్లెస్లు, పూసలు, బొమ్మలు చెక్కిన కుండలు, నాణాల్ని చూడొచ్చు. బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. నిల్చొని ఉన్న విష్ణువు, బుద్ధుడి పాదం, ఆహారధాన్యాలు నిల్వ చేయడానికి ఉపయోగించే పెద్ద కుండ ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్. 

ఈ మ్యూజియంలో రాజుల కాలానికి చెందిన నాణాల్ని చూడొచ్చు. వీటిల్లో రోమన్ రాజు అగస్టస్ పేరుతో ఉన్న బంగారు నాణెం, డజన్ కు పైగా వెండినాణాలు, 50 ఇతర నాణాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇళ్లు కట్టేందుకు వాడిన ఇటుకలు, రాళ్లు కనిపిస్తాయి. ఈజిప్ట్ మమ్మీని కూడా చూడొచ్చు ఇక్కడ. ఆర్కియాల జిస్టులు, హిస్టోరియన్స్తో పాటు హిస్టరీ చదివే స్టూడెంట్స్ ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటారు.

 ఇలా వెళ్లాలి 

సంగారెడ్డి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కొండాపూర్ మ్యూజియం. మెదక్ నుంచి అయితే 68 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి 63 కిలోమీటర్ల దూరం.
టైమింగ్స్: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ప్రతి శుక్రవారం సెలవు.