
హైదరాబాద్, వెలుగు: కృష్ణపట్నం పోర్టు కొనుగోలు పూర్తయ్యిందని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీసెజ్) సోమవారం ప్రకటించింది. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ(కేపీసీఎల్) ఎంటర్‌ప్రైజ్ వాల్యూ రూ. 12,000 కోట్ల వద్ద ఈ డీల్ పూర్తయ్యిందని తెలిపింది. ఈ డీల్ పూర్తవ్వడంతో కేపీసీఎల్‌లో75 శాతం వాటా ఏపీసెజ్ చేతికి వచ్చింది. సీవీఆర్ గ్రూప్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలును పూర్తి చేశామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అదానీ పోర్ట్స్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేపీసీఎల్ రూ. 1,200 కోట్ల ఇబిటాను జనరేట్ చేస్తుందని అంచనాలున్నాయి. ‘దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ అయిన కేపీసీఎల్ ప్రస్తుతం ఏపీసెజ్ చేతికి వచ్చింది. కస్టమర్ సర్వీస్‌ను మరింతగా పెంచేందుకు కృష్ణపట్నం పోర్టు ఉపయోగపడుతుంది’ అని ఏపీ సెజ్ సీఈఓ కరన్ అదానీ అన్నారు.