ఏపీకి 5.5 టీఎంసీలు..తెలంగాణకు 8.5 టీఎంసీలు

ఏపీకి 5.5 టీఎంసీలు..తెలంగాణకు 8.5 టీఎంసీలు
  • నాగార్జునసాగర్ నుంచి తాగునీటికి కేటాయింపులు  
  • కేఆర్ఎంబీ మీటింగ్​లో నిర్ణయం 
  • మినిమం​ డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే
  • శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేందుకు నో
  • మేలో మరోసారి సమావేశం? 

హైదరాబాద్, వెలుగు: ఎండాకాలం నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, ఏపీకి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ) నీటి కేటాయింపులు చేసింది. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించింది. మినిమమ్​డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే చెప్పింది. శుక్రవారం హైదరాబాద్​లోని జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ మీటింగ్​జరిగింది. ఇందులో బోర్డు మెంబర్​ సెక్రటరీ రాయ్ పురే, తెలంగాణ ఈఎన్సీ అనిల్​కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో కేవలం తాగునీటి అవసరాలపైనే చర్చించినట్టు అధికారులు తెలిపారు. సాగునీటికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. 25 టీఎంసీల చొప్పున నీటికి ఇండెంట్​ పెట్టినా, ప్రాజెక్టుల్లో వాడుకోవడానికి అందుబాటులో ఉన్న జలాల ఆధారంగానే కేటాయింపులు చేసినట్టు చెప్పారు. కాగా, మేలో మరోసారి త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. 

శ్రీశైలం నుంచి నో.. 

రెండు రాష్ట్రాలకు కామన్​ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్​లో వాటర్ ఇప్పటికే డెడ్ స్టోరేజీ లెవెల్​కు చేరుకున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం 809.40 అడుగుల దగ్గర 33.957 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దీంతో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే అవకాశం లేదని త్రిసభ్య కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. నాగార్జున సాగర్​లో 509.90 అడుగుల దగ్గర 131.499 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్​లో మినిమమ్​డ్రా లెవెల్ 505 అడుగుల నుంచి కూడా నీళ్లను తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సాగర్​ నుంచి 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు వాడుకునేందుకు అందుబాటులో ఉన్నట్టు బోర్డు స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ మినిమమ్​ డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా 500 అడుగుల నుంచి కూడా నీటిని తీసుకునేందుకు సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది. 

మనం పంప్ చేసుకోవాల్సిందే.. 

ప్రాజెక్టులకు ఎండాకాలమైనా పవర్ ​జనరేషన్ ద్వారా పైనుంచి నీళ్లు వచ్చేవని, కానీ ఇప్పుడు ఆ ఇన్​ఫ్లోస్ కూడా లేవని మీటింగ్​లో కేఆర్ఎంబీ తెలిపింది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. ప్రస్తుతం సాగర్​లో 14 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పిన కేఆర్ఎంబీ.. అందులో నుంచే తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5. 5 టీఎంసీలు కేటాయించినట్టు తెలిసింది. కాగా, ఏపీకి రైట్ ​కెనాల్​ ద్వారా నీటిని విడుదల చేసుకునేందుకు అవకాశం ఉంది. అక్కడ వివిధ ట్యాంకుల్లో స్టోర్ ​చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. మన రాష్ట్రానికి మాత్రం స్టోరేజీ ట్యాంకులు లేవని, పంప్ ​చేసుకోవాల్సిందేనని ఈఎన్సీ అనిల్​ కుమార్​ తెలిపారు. అవసరాన్ని బట్టి మేలో మరోసారి సమావేశాన్ని నిర్వహించి, అప్పటి అవసరాలకు అనుగుణంగా నీటి కేటాయింపులపై చర్చిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాలు నీటిని వాడుకుంటే నీరు మరింత కిందకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో మోటార్లతో నీటిని పంప్​ చేసుకుని తరలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలో మంచి నీటి కొరత ఎక్కువగా ఉందని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. మేలో జరిగే సమావేశంలో పులిచింతల నుంచి నీళ్లు తీసుకునే అంశంపై చర్చిస్తామన్నారు. గత ఒప్పందాల ప్రకారం ఏపీకి 2.5 టీఎంసీల జలాలు రావాల్సి ఉందని, వాటికి అదనంగా 3 టీఎంసీలను ఇచ్చారని తెలిపారు.

జనాభా ఆధారంగా కేటాయింపులు..  

కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న జనాభా, హైదరాబాద్​ సిటీ జనాభా, నీటి అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు ఎక్కువ కేటాయింపులు చేశారు. తెలంగాణ ఇప్పటికే ఎక్కువ నీటిని వాడుకుందని సమావేశంలో ఏపీ వాదించగా, దానికి తెలంగాణ కూడా గట్టిగానే బదులిచ్చినట్టు తెలిసింది. గత రెండు వాటర్ ఇయర్​లలో మిగిలిన నీటిని క్యారీ ఫార్వర్డ్​ చేసేందుకు పట్టుబట్టినట్టు సమాచారం. గత రెండు వాటర్ ​ఇయర్​లలో వాడుకోని నీళ్లు 27 టీఎంసీలు ఉన్నాయని, అందులో నుంచి 12 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయించాలని గత నెలలోనే కేఆర్ఎంబీకి ఇరిగేషన్​సెక్రటరీ రాహుల్​ బొజ్జా లేఖ రాశారు. తాజాగా జరిగిన మీటింగ్​లోనూ ఆ విషయాన్ని ఈఎన్సీ అనిల్​కుమార్​ ప్రస్తావించారు. ప్రస్తుతం హైదరాబాద్​ సహా చుట్టుపక్కల ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు అత్యవసరంగా నీళ్లివ్వాలని, అవి పోను మిగతా నీటిని అవసరానికి తగ్గట్టు రిలీజ్​చేయాలని ఆయన కోరినట్టు తెలిసింది. మరోవైపు 25 టీఎంసీలు విడతల వారీగా విడుదల చేయాలని ఏపీ పట్టుబట్టినట్టు సమాచారం.