అక్రమాలకు అడ్డాగా కేయూ.. వరుసగా వెలుగులోకి వస్తున్న వివాదాలు

అక్రమాలకు అడ్డాగా కేయూ.. వరుసగా వెలుగులోకి వస్తున్న  వివాదాలు
  • ప్రొఫెసర్ల ప్రమోషన్లలో రూల్స్​ బ్రేక్​
  • కొన్ని  నెలల క్రితం పీహెచ్​డీ సీట్లు విక్రయం
  • న్యాక్​ పనుల బిల్లుల్లోనూ కమీషన్ల కోసం కక్కుర్తి
  • తాజాగా ఏసీబీ ట్రాప్​తో వర్సిటీలో కలవరం

హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో ఉస్మానియా వర్సిటీ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ఠ మసక బారుతోంది. వర్సిటీ అధికారులు తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. తాజాగా జరిగిన ఏసీబీ ట్రాప్​ లో ఓ అసిస్టెంట్​ రిజిస్ట్రార్​ లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోవడం కలవరానికి గురిచేస్తోంది. అలాగే కేయూ వీసీ నియామకంపై మొదటి నుంచీ వివాదం నడుస్తోంది. ప్రొఫెసర్ల ప్రమోషన్లు, పీహెచ్​డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు, బిల్లుల చెల్లింపుల్లో కమీషన్లు ఇలా ఒక్కో దాంట్లో  అక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తుండడంతో వర్సిటీ పరువు దిగజారుతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన కేయూని కొంతమంది అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని విద్యార్థులు, మేధావులు మండిపడుతున్నారు. వర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

వీసీ నియామకంపై వివాదం

కేయూ వీసీగా తాటికొండ రమేశ్​ 2021 మే నెలలో నియమితులమయ్యారు. అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయనకు ప్రొఫెసర్​గా పదేండ్ల అనుభవం లేకున్నా వీసీ పదవి అప్పగించడం వివాదానికి దారి తీసింది. అక్రమ పద్ధతిలో ఆయనను వీసీగా నియమించారని కొందరు కోర్టుకు వెళ్లారు. అలాగే హైకోర్టుతో పాటు లోకాయుక్తలోనూ ఆయనపై కేసులు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే రమేశ్​తో పాటు రిజిస్ట్రార్​ శ్రీనివాస్​రావు రూల్స్​కు విరుద్ధంగా సీనియర్​  ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. సీనియర్​ ప్రొఫెసర్​ ప్రమోషన్​ కోసం అప్లై చేసుకోవాల్సిందిగా రెండేండ్ల కిందట జులై, ఆగస్టు, నవంబర్​ నెలల్లో  రిజిస్ట్రార్​ వేర్వేరుగా సర్క్యులర్లు ఇచ్చారు. దీంతో ప్రమోషన్​ కోసం వీసీ, రిజిస్ట్రార్​ ఇద్దరూ అప్లై చేసుకున్నారు. వాస్తవానికి ప్రమోషన్​ కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే నోటిఫికేషన్​ ఇచ్చినప్పటి నుంచి ఆ ప్రక్రియ ముగిసే వరకు వీసీ, రిజిస్ట్రార్​ పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉంది. కానీ, వారే పదవుల్లో ఉండి, వారి అప్లికేషన్లను వారే స్క్రుటినీ చేసుకోవడం గమనార్హం. 2022 డిసెంబర్​ 30న వీసీ రిటైర్  అవ్వాల్సి ఉండగా.. అందుకు ఒక్కరోజు ముందుగా సీనియర్​ ప్రొఫెసర్​గా ప్రమోషన్​ తీసుకున్నారు. అదే సమయంలో అకుట్​ అధ్యక్షుడు ప్రొఫెసర్​ తౌటం శ్రీనివాస్, జనరల్  సెక్రటరీ డాక్టర్​  మామిడాల ఇస్తారి ప్రమోషన్లను వ్యక్తిగత కక్షలతో నిలిపేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అకుట్​ జనరల్​ సెక్రటరీ ఇస్తారి.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈనెల 10 లోగా కౌంటర్  దాఖలు చేయాలని వీసీ, రిజిస్ట్రార్​ను హైకోర్టు ఆదేశించింది.

బిల్లుల చెల్లింపుల్లో  అక్రమాలు

కేయూకు న్యాక్​ ఏ గ్రేడ్​ కోసం రూ.10 కోట్లతో వివిధ పనులు చేపట్టగా.. వాటిలో రూ.8 కోట్లు కే హబ్​కు కేటాయించినట్లు తెలిసింది. మిగతా ఫండ్స్​తో రోడ్లు, వర్సిటీ బిల్డింగులు, హాస్టళ్లను​ రిపేర్​ చేయించాల్సి ఉండగా.. వాటిని ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్  ఇచ్చి చేయించారు. ఈ పనులకు సంబంధించిన బిల్లుల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్డింగ్ డివిజన్​లో తయారైన  బిల్లులు పాస్  కావడానికి వర్సిటీ ఆడిట్  ఆఫీసులో అప్రూవ్​ కావాల్సి ఉంటుంది. ఏసీబీకి చిక్కిన కిష్టయ్యనే అక్కడ ఏఆర్ గా ఉండడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా కేయూ హాస్టల్  ఆఫీసులో రూ.50 లక్షల వరకు లావాదేవీలు జరుగుతాయని తెలిసింది. ఇందులో పాలు, బియ్యం, ఉప్పులు, పప్పులు, ఇతర కిరాణ సామాన్లు, చికెన్, గుడ్లు​ ఇలా ఒక్కోటి సరఫరా చేసే వారి నుంచి కనీసం 5 శాతం కమీషన్​ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీకి చిక్కిన కిష్టయ్య వ్యవహారం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక ఆర్ట్స్​ కాలేజీలో విద్యార్థుల ట్యూషన్  ఫీజుల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణం జరగగా.. ఏఆర్  కిష్టయ్య, ప్రిన్సిపల్  అయిలయ్యపై ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. ఆ విచారణ కమిటీ ఉండగానే ఏఆర్  కిష్టయ్యను క్యాంపస్ కు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.

భూకబ్జాదారుల్లోనూ అధికారులే

కాకతీయ వర్సిటీ భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయి. ఆ భూములను అన్యాక్రాంతం చేసిన వారిలో కొంతమంది వర్సిటీ అధికారులే ఉండడం గమనార్హం. ముఖ్యంగా సర్వే నంబర్  229లోని  కేయూ భూమిలోనే  అసిస్టెంట్​ రిజిస్ట్రార్​ ఇల్లు కట్టుకున్నా ఉన్నతాధికారులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ల్యాండ్  కమిటీ రిపోర్టు​ఊసు కూడా ఎత్తడం లేదు. దీంతో గతంలో వీసీ రమేశ్ తో పాటు అసిస్టెంట్​ రిజిస్ట్రార్​ పెండ్లి అశోక్​ బాబు తీరుపైనా అకుట్​ సంఘం నేతలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గతంలో ఫేక్​  సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడగా.. విచారణకు పోలీసులకు సహకరించక ఆ విషయాన్ని మరుగున పడేశారనే ఆరోపణలు ఉన్నాయి.

సీఎం విచారణ జరపాలని డిమాండ్

పీహెచ్​డీ సీట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టగా.. 2023 సెప్టెంబర్​ 13న ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డి టీపీసీసీ చీఫ్​ హోదాలో కేయూకు వచ్చి స్టూడెంట్లను పరామర్శించారు. అప్పుడు వీసీ, రిజిస్ట్రార్  తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన, బీఆర్ఎస్ కు బంట్రోతుగా ఉన్న వ్యక్తిని కాకతీయ యూనివర్సిటీకి వీసీగా నియమించారు. విద్యార్థులను టాస్క్ ఫోర్స్  ఆఫీసుల్లో పెట్టించి కాళ్లు, చేతులు విరగ్గొట్టించిన వీసీని తక్షణమే బర్తరఫ్  చేయాలి. ఆయనపై క్రిమినల్  కేసులు పెట్టాలి. వీసీ, రిజిస్ట్రార్ల అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి అరెస్టు చేయాలి. అసిస్టెంట్  రిజిస్ట్రార్  ఒకరు కేయూ భూమిలోనే ఇల్లు కట్టుకున్నా అడిగే నాథుడు లేకుండా పోయిండు” అంటూ రేవంత్  అప్పుడు ధ్వజమెత్తారు. తరువాత రేవంత్  సీఎం కావడంతో ఆయన ఇచ్చిన హామీ మేరకు కేయూలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు ​ తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్​ చేస్తున్నారు.

పీహెచ్​డీ సీట్ల గోల్​మాల్​

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్​డీ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలతో దాదాపు నెలన్నర పాటు క్యాంపస్​ అట్టుడికింది. 2022లో 212 పీహెచ్​డీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేయగా.. రూల్స్​ బ్రేక్​ చేసి పార్ట్​ టైం లెక్చరర్లకు సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సీట్లు రాక అన్యాయానికి గురైన కొందరు 2023 సెప్టెంబర్​ 5న ప్రిన్సిపల్​ ఆఫీస్​ ఎదుట  నిరసనకు దిగారు. తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అక్కడున్న ఫర్నిచర్​ను ధ్వంసం చేయడంతో 10 మంది అభ్యర్థులపై కేసులు పెట్టి ఇద్దరిని జైలుకు పంపించారు. దీంతో విద్యార్థులంతా కలిసి ఉద్యమానికి దిగగా.. నెలన్నరపాటు కేయూ అట్టుడికింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి యాక్షన్​ తీసుకుంటామని అప్పుడు మంత్రి కేటీఆర్, తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్  హామీ ఇచ్చారు.​ తరువాత ప్రభుత్వం మారిపోయింది. విచారణ కూడా ముందుకు సాగలేదు. దీంతో పాటు కేయూ పరిధిలోని ఫార్మసీ కాలేజీలకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఫామ్ డీ కోర్సులు నిర్వహించే కాలేజీలకు అనుబంధ హాస్పిటల్స్​ ఉండాలని రూల్స్ ఉన్నాయి. అలాంటి ఆసుపత్రులు ఏమీ లేకున్నా తరగతులు నిర్వహించేందుకు పర్మిషన్​ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి.