
హైదరాబాద్, వెలుగు: సీవరేజ్పైపులైన్లు జామ్ అయినప్పుడు క్లీన్ చేసేందుకు ఉపయోగించే ఎయిర్ టెక్ మెషీన్లు ఏమాత్రం సరిపోవడం లేదు. మెషీన్ల సంఖ్య పెంచకపోవడంతో కాలనీల్లో మురుగు సమస్య తీరడం లేదు. వర్షాకాలంలో సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం సిటీలో కోటిన్నరకుపైగా జనాభా ఉండగా, వాటర్ బోర్డు వద్ద కేవలం 188 ఎయిర్ టెక్ మెషీన్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో 6 వేల లీటర్ల కెపాసిటీవి 50, 4 వేలవి 66, 2వేల కెపాసిటీవి 72 ఉన్నాయి. ఇవి సరిపోక మురుగు ఓవర్ ఫ్లో అయిన వెంటనే క్లీన్ చేసే పరిస్థితులు లేవు. కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ వర్కర్లు మ్యాన్ హోల్స్‌లోకి దిగి చేతులతో క్లీన్ చేస్తున్నారు.
కోట్లు ఖర్చు చేస్తున్నా తీరని సమస్య
ఎప్పుడో వేసిన పైపులైన్లు కావడంతో సిటీలో తరచూ సీవరేజ్సమస్య ఏర్పడుతోంది. నిత్యం మురుగు రోడ్డుపై పారుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల మెయిన్ రోడ్లపైనా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ మూతలు డ్యామేజ్ అయి ప్రమాదకరంగా ఉంటున్నా వాటిని ఏర్పాటు చేయడంలేదు. డ్రైనేజీ పైపులైన్ల మరమ్మతులు, మెయింటెనెన్స్ కోసం వాటర్‌బోర్డు ప్రతినెలా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ సమస్య మాత్రం తీరడంలేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీలో డ్రైనేజీ సిస్టం లేదని నిపుణులు అంటున్నారు. సిటీలో అవసరమైన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వెంటనే పనులు పూర్తి చేయాలని పేర్కొంటున్నారు.
కాంట్రాక్టర్ల నుంచి వ్యతిరేకత
కాలనీలు, బస్తీల్లో సీవరేజ్ లైన్లు జామ్ అయితే వెంటనే వెళ్లి క్లీన్ చేసేందుకు 1,500 లీటర్ల కెపాసిటీతో 65 ఎయిర్ టెక్ మెషీన్ల కోసం 25 రోజుల క్రితం వాటర్‌బోర్డు టెండర్లు వేసినప్పటికీ ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ టెండర్లలో పాల్గొనే వారికి కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలని షరతులు పెట్టడంతో కాంట్రాక్టర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. మిగతా వాటి కోసం ఇలాంటి రూల్స్పెట్టని వాటర్‌బోర్డు వీటికే ఎందుకు పెడుతోందని వారు పేర్కొంటున్నారు. మొదట్లో వేసిన టెండర్లను కొందరు రద్దు చేసుకున్నారు. తిరిగి ఈ నెల 25న టెండర్లు వేయగా దాంట్లోనూ అవే షరతులు ఉండటంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మెషీన్లు చిన్నవే అయినప్పటికీ, వీటికి పెద్ద వెహికల్స్‌తో సమానంగా బిల్లులు చెల్లిస్తుండటంతోనే ఎక్కవ పోటీ ఉంది.
వాటర్ బోర్డు ఫెయిల్
సీవరేజ్ మెయింటెనెన్స్‌లో వాటర్ బోర్డు ఫెయిలయ్యింది. ఎల్బీనగర్ లోని మూడు సెక్షన్లలో నిర్వహణను గాలికొదిలేశారు. ఎయిర్ టెక్ మెషీన్లు పాతవి కావడంతో పనులు జరగడంలేదు. ఫిర్యాదు చేసిన ఐదారు రోజుల వరకు సమస్యను పరిష్కరించడం లేదు. మ్యాన్ హోల్స్పొంగుడు సాధారణమైంది. కాలనీల్లో దుర్వాసన భరించలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. - కొప్పుల నర్సింహారెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్
మళ్లీ టెండర్లు పిలవాలె
ఎయిర్ టెక్ మెషీన్ల టెండర్లను ఎప్పటిలాగే వేయాలి. ఐదేళ్ల అనుభవం కావాలని షరతులు పెట్టడమేంటి? ఇలాగైతే చాలా మంది కాంట్రాక్టర్లు నష్టపోతారు. అధికారులు మళ్లీ ఆలోచించి టెండర్లు పిలవాలి. కొత్త వారికి అవకాశం ఇస్తే మరికొందరికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుంది. - చింతల రాజలింగం, సీవరేజ్ ఎయిర్ టెక్ మెషీన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అడ్వైజర్