గ్రేటర్​లోని డిపార్ట్​మెంట్ల అధికారుల మధ్య సమన్వయ లోపం

గ్రేటర్​లోని డిపార్ట్​మెంట్ల అధికారుల మధ్య సమన్వయ లోపం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లోని వివిధ డిపార్ట్​మెంట్ల అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. సుమారు కొన్నేండ్లుగా సిటీ సమన్వయ కమిటీ సమావేశాలు సరిగా జరగడం లేదు. కమిటీ ఏర్పాటుతో పాటు సమావేశాలు నిర్వహించడంతో కీలకంగా వ్యవహరించాల్సిన జీహెచ్ఎంసీ పట్టించుకోవడంలేదు. బి.జనార్దన్​రెడ్డి  కమిషనర్ గా ఉన్న టైమ్ లో కన్వర్జెన్సీ పేరుతో సమావేశాలు నిర్వహించారు. కరోనాకు ముందు వరకు ఈ సమావేశాలు  జరిగినప్పటికీ ఆ తర్వాత నిర్వహించడంలేదు.  దీంతో డిపార్ట్​మెంట్ల మధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రోడ్లు, నాలాల నిర్మాణం, వాటర్ బోర్డు.. ఇలా ఏ పనులు చేయాలన్నా ఏదో ఓ సమస్య ఏర్పడుతుంది.  సిటీ అభివృద్ధికి ఎంతో కీలకమైన సమన్వయ సమావేశాలు నిర్వహించకపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయని కొందరు అధికారులు సైతం అంటున్నారు.   

పర్మిషన్ లేకుండా పనులు
అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వేరే పనుల కోసం రోడ్లను తవ్వి అలాగే వదిలి వెళ్తున్నారు. కొన్నిచోట్ల  అసలు పర్మిషన్ లేకుండానే పనులు చేసుకుంటున్నారు. అదే సమన్వయ సమావేశాలు నిర్వహిస్తే  అన్ని శాఖల అధికారులు ఉండటంతో అనుమతులు ఎవరిచ్చారో తెలుస్తుందని.. దీనివల్ల  పనులు పూర్తయ్యాక తిరిగి రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని బల్దియా అధికారులు చెప్తున్నారు. వైట్ టాపింగ్ రోడ్లు, ఎస్ఆర్డీపీ తదితర పనులు ప్రారంభించే ముందుగానే ఆయా మార్గాల సమాచారాన్ని ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు, పోలీసు తదితర శాఖలకు అందిస్తే  పైప్ లైన్లను మార్చడం, అండర్ డెస్క్ కేబుల్ వర్క్ ల పూర్తి,  సీసీ టీవీల ఏర్పాటు తదితర పనులను ముందే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అలా చేయకపోవడంతోనే రోడ్లు వేసిన కొద్దిరోజులకే ఏదో కారణంగా తవ్వేస్తున్నారు. దీనివల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు జనం ఇబ్బందులు పడుతున్నారు. 

జోనల్ స్థాయిలోనూ అంతే.. 
అన్ని శాఖల అధికారులతో ప్రతి బుధవారం జోనల్ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించాలని 2020 డిసెంబర్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. కానీ జోనల్ అధికారులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. వారానికోసారి కాకుండా కనీసం నెలకోసారైనా సమావేశాలు నిర్వహిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికేందుకు వీలుంటుందని కొందరు అధికారులు చెప్తున్నారు. 

నామ్ కే వాస్తేగా ఎన్​వోసీలు
ఎక్కడైనా పనులు చేయాలంటే సంబంధిత కాంట్రాక్టర్ అన్ని శాఖల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ వోసీ) తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని పనులకు సంబంధించి ఎన్​వోసీలు లేకున్నా పనులు జరుగుతున్నాయి. పనులు స్టార్ట్ చేసేముందు అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తయ్యాక కాంట్రాక్టర్లు అలాగే వదిలి వెళుతున్నారు. మళ్లీ ఆ పనులకు సంబంధించి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇవన్నీ పరిశీలించకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుండటంతో సమస్యలు అలాగే ఉంటున్నాయి. 

సిటిజన్ల కాల్స్ లిఫ్ట్ చేయని బల్దియా అధికారులు
సిటిజన్లకు జీహెచ్ఎంసీ అధికారులు రెస్పాండ్​కావడంలేదు. సిటీలో ఏదైనా సమస్య చెబుదామన్నా, సమాచారం తెలుసుకుందామన్నా..  అధికారులకు ఫోన్​చేస్తే లిఫ్ట్​చేయడంలేదు. దీంతో చిన్న సమస్య ఉన్నా బల్దియా ఆఫీసులకు జనం క్యూ కడుతున్నారు. సర్కిల్ స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలామంది అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడంలేదు. లిఫ్ట్ చేస్తున్న వారు కూడా సరైనా సమాచారం ఇవ్వడం లేదు. అఫీషియల్​నంబర్లకు చేసినా, ల్యాండ్​ఫోన్లకు చేసినా ఇదే పరిస్థితి. సిటీలో ముఖ్యమైన కొంతమంది అధికారుల ఫోన్ నంబర్లు ​సైతం వెబ్​సైట్​లో కనిపించకపోవడంపై సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ట్రాన్స్​ఫర్ అయిన కూడా వారి పేర్లు అలాగే కాంటాక్ట్ నంబర్లలో ఉంటుండగా, తమకు సంబంధించిన ఆఫీసర్ ఎవరో తెలుసుకోలేని పరిస్థితి నెలకొందని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

జనం సొమ్ముతో బిల్లులు...
బల్దియా కమిషనర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ఫోన్​బిల్లలు సంస్థనే చెల్లిస్తుంది.  జనం డబ్బు నుంచి బిల్లులు కడుతుండగా, ఏదైనా సమస్యపై అధికారికి కాల్​చేస్తే నంబర్లు కలవడంలేదు. గతంలో అధికారుల నంబర్లను​ ఎప్పటికప్పుడు వెబ్ సైట్​లో అప్​డేట్ ​చేసేవారు.  ప్రస్తుతం ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు ఎవరివి లేవు. కిందిస్థాయి సిబ్బంది నంబర్లు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ మెజారిటీ స్థాయి అధికారులు ఫోన్​ చేస్తే రెస్పాండ్ ​కావడం లేదు. 2014 నుంచి బదిలీ పై వెళ్లిన 30 మంది అధికారులు ఫోన్లు, ల్యాప్​ టాప్​ లను జీహెచ్ఎంసీకి తిరిగి ఇవ్వలేదు. ఈ జాబితాలో కమిషనర్ల నుంచి అడిషనల్​ కమిషనర్లు, జోనల్​ కమిషనర్లు, ఇతర అధికారులు ఉన్నారు.   ఇలా తిరిగి ఇవ్వకుండా తీసుకెళ్లిన ఫోన్ల ఖరీదు సుమారు రూ.1.75 కోట్లుగా ఉంది.  జీహెచ్ఎంసీలో  పనిచేస్తున్న ఆఫీసర్లకు బల్దియా ఖర్చుతో ఫోన్​, ల్యాప్​టాప్​ లను అందజేస్తుంది. ఇందుకోసం బల్దియా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. అధికారులు మాత్రం తమకు అవసరమున్న వారికి మాత్రమే రెస్పాండ్​అవుతున్నారు. ఫైనాన్స్​ అడిషనల్ కమిషనర్ అయితే  ఎవరి కాల్ లిఫ్ట్ చేయరని సిటీ వాసులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ లిఫ్ట్ చేసిన కూడా వెంటనే ఆ నంబర్లను బ్లాక్​లిస్ట్​లో పెడుతుండటంతో మరోసారి కాల్​చేస్తే ఫోన్ కలవడంలేదని చెబుతున్నారు. ఇక జోనల్ కమిషనర్లలో ఇద్దరు తప్ప మిగతా నలుగురు అసలు రెస్పాండ్ కావడంలేదు. డిప్యూటీ కమిషనర్లు కూడా 30 మంది ఉండగా, ఇందులో మెజారిటీ అధికారులు ఫోన్లకు స్పందించడంలేదు.  టెక్నాలజీని వాడకంలో బల్దియా ఎంతో ముందున్నదని, అడ్వాన్స్​డ్​గా ఉంటున్నామని అధికారులు చెబుతుండగా,  సంస్థ సొంత వెబ్ సైట్​నిర్వహణను పట్టించుకోవడంలేదు. వెబ్ సైట్​లో ఏ సమాచారం సక్రమంగా ఉండడంలేదు. అధికారుల  ఫోన్ నంబర్లను సైతం అందుబాటులో ఉంచలేకపోతున్నారు. జీహెచ్ఎంసీలో సపరేట్​గా ఐటీ వింగ్ ఉన్నప్పటికీ  నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది.