నిర్వహణకు నిధుల్లేవ్.. పర్యవేక్షణకు దిక్కులేదు!

నిర్వహణకు నిధుల్లేవ్.. పర్యవేక్షణకు దిక్కులేదు!
  •     కబ్జాలపాలవుతున్న చెరువులు
  •     మైనర్ ​ఇరిగేషన్​ శాఖ విలీనంతో మరిన్ని ఇబ్బందులు 
  •     ఒక్కో ఈఈ కింద రెండు, మూడు జిల్లాలు! 
  •     పట్టించుకోకపోవడంతో ఆక్రమిస్తున్న కబ్జాదారులు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : నిర్వహణకు నిధుల్లేక..పర్యవేక్షించే ఆఫీసర్లు లేక రాష్ట్రవ్యాప్తంగా వేల చెరువులు కబ్జాల పాలవుతున్నాయి. చెరువులతో పాటు కుంటలు, నాలాలను ఆక్రమించుకుని ప్లాట్లు చేసి రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. ఏ జిల్లాలో చూసినా ఈ కబ్జాల పర్వమే కనిపిస్తోంది. నీటి పారుదల శాఖ (ఇరిగేషన్‌)‌ రీ ఆర్గనైజేషన్‌‌ పేరుతో కేసీఆర్‌‌ సర్కారు చేసిన పనే దీనికి కారణంగా కనిపిస్తున్నది. మేజర్‌‌, మైనర్‌‌ ఇరిగేషన్‌‌ శాఖలను ఏకం చేసిన బీఆర్​ఎస్​ సర్కారు సిబ్బందిని నియమించకపోవడం, నిర్వహణకు ఫండ్స్​ ఇవ్వకపోవడం, ఆఫీసర్లు లేకపోవడంతో చెరువులకు చెర తప్పడం లేదు. ఇదివరకు మున్సిపాలిటీలు, పట్టణాల్లోనే చెరువులను మాయం చేసేవారు.  ఇప్పుడు మండల కేంద్రాలు, గ్రామాల్లో కూడా కబ్జాలు చేస్తున్నారు. 

ఇరిగేషన్ శాఖ రీ ఆర్గనైజేషన్​ పేరుతో..

రాష్ట్రవ్యాప్తంగా చెరువుల గురించి సమాచారం సేకరించేందుకు మైనర్‌‌ ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ 2014లో సర్వే చేయగా 46,531 చెరువులున్నట్లు తేలింది. 2018 వరకు మిషన్‌‌ కాకతీయ పథకం పేరుతో రూ.20 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసి 40 వేల చెరువులను ఆధునీకరించినట్లుగా కేసీఆర్‌‌ సర్కారు అప్పట్లో గొప్పలు చెప్పుకుంది. 2021 జనవరి నెలలో ఇరిగేషన్‌‌ శాఖ రీ ఆర్గనైజేషన్‌‌కు కూడా శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కోటి 11 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ప్రక్రియ పేరుతో మేజర్‌‌, మైనర్‌‌ ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్లను ఒక్కటి చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఈఎన్‌‌సీ, 16 చీఫ్‌‌ ఇంజినీరింగ్‌‌ ఆఫీసులను ఏర్పాటు చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌‌ కుమార్‌‌ జీవో నెంబర్‌‌ 334 రిలీజ్ ​చేశారు. ఇది వరకు వేర్వేరుగా ఉన్న ఎస్సారెస్పీ, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, తుపాకులగూడెం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులతో పాటు మధ్య, చిన్న తరహా శాఖల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు, ఆఫీసర్లందరిని ఒకే గొడుగు కిందికి  తీసుకువచ్చారు. పాత ఆఫీసులన్నీ రద్దు చేయడమే కాకుండా కొత్త ఆఫీసులు ఎక్కడ ఏర్పాటు చేయాలో సూచిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో అప్పటివరకు వేర్వేరు శాఖల్లో పనిచేసిన ఇంజినీర్లు అంతా ఒకే శాఖ పరిధిలోకి వచ్చారు.  

చెరువులు కబ్జాలపాలు

ఇరిగేషన్‌‌ రీ ఆర్గనైజేషన్‌‌ వల్ల గతంలో మైనర్‌‌ ఇరిగేషన్‌‌లో పనిచేసిన ఇంజినీర్లంతా తమకు నచ్చిన పోస్టుల్లో చేరిపోయారు. అప్పటి అధికార పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల పైరవీలతో పైసలు బాగా వచ్చే పోస్టులను దక్కించుకున్నారు. దీంతో గ్రామాల్లో చెరువుల ఆలనా, పాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. కొన్ని జిల్లాల్లో అయితే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక ఇరిగేషన్‌‌ ఏఈ పని చేస్తున్నారు. మేజర్‌‌ ప్రాజెక్టులున్న మండలాల్లో పనిచేసే ఇంజినీర్లపై పని ఒత్తిడి పెరిగింది. దీంతో వాళ్లు గ్రామాల వైపు రావడం మానేశారు. ఇదే అదనుగా భావించిన బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు చెరువులను కబ్జా చేయడం మొదలుపెట్టారు. వరంగల్‌‌ పట్టణంలో అయితే ఓ ఎమ్మెల్యేనే చెరువును ఆక్రమించుకుని దర్జాగా బిల్డింగులు కూడా కట్టుకున్నాడు.  

బొందలగడ్డలవుతున్న చెరువులు

రాష్ట్ర వ్యాప్తంగా చాలా చెరువులు బొందలు గడ్డలుగా మారుతున్నాయి. రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు, బిల్డింగులు కట్టే వారి కోసం, ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మొరాన్ని చెరువుల నుంచే తవ్వుకెళ్తున్నారు. క్రమపద్ధతిలో కాకుండా ఇష్టమున్నట్టు తవ్వుతుండడంతో చెరువులు అస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. తూముకు నీళ్లందక, తక్కువ టైంలో భూమిలోకి నీరింకి ఎండిపోతున్నాయి. దీంతో పొలాలకు నీరందక రైతన్నలు నష్టపోతున్నారు. 

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 5 నుంచి 10, మేజర్‌‌ గ్రామ పంచాయతీల్లో 3 నుంచి 5, మండల కేంద్రాలు, చిన్న గ్రామాల్లో 1 నుంచి 3 వరకు ఎక్స్​కవేటర్లు ఉన్నాయి. ఇండ్ల కోసం, షాపింగ్‌‌ కాంప్లెక్స్​ల కోసం మొరం అవసరం పడడంతో ఈ  తతతఓనర్లనే ఆశ్రయిస్తున్నారు.  వీరు నేరుగా చెరువులపై పడుతున్నారు. బీటీ రోడ్లు వేసే కాంట్రాక్టర్లు, రాష్ట్ర, జాతీయ రహదారులు నిర్మించే బడా కంపెనీల యజమానులు సైతం ఇదే పని చేస్తున్నారు.   

కాపాడేవారేరి

గ్రామాల్లో చెరువులను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ, ఇరిగేషన్‌‌ శాఖ ఇంజినీర్లపై ఉంటుంది.  ఇంతకుముందు ప్రతి మండలంలో ఐబీ ఏఈలుండేవారు. వీరికి అసిస్టెంట్లుగా వర్క్‌‌ ఇన్​స్పెక్టర్లు పని చేసేవారు. ఇరిగేషన్‌‌ రీ ఆర్గనైజేషన్‌‌ తర్వాత మండలానికో ఇరిగేషన్‌‌ ఏఈ లేకుండాపోయారు. దీంతో చెరువుల రక్షణ రెవెన్యూ శాఖపై పడింది. గ్రామాల్లో పనిచేసే వీఆర్వోలు, వీఆర్‌‌ఏలను ఇతర శాఖల్లోకి మార్చడంతో తహసీల్దార్‌‌ ఆఫీసులో రెవెన్యూ ఇన్‌‌స్పెక్టర్లు, సీనియర్‌‌, జూనియర్‌‌ అసిస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీళ్లు పని ఒత్తిడితో ఫీల్డ్‌‌కు వెళ్లట్లేదు. దీంతో కబ్జారాయుళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఊళ్లను కాపాడిన చెరువులను కనిపించకుండా చేస్తున్నారు.

చెరువుల పర్యవేక్షణ ఎలా సాధ్యం? 

భూపాలపల్లి జిల్లాలోని అన్నారం ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్‌‌ (ఈఈ) పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలున్నాయి. గోదావరి, మానేరు నదులతో పాటు 400కు పైగా చెరువుల పర్యవేక్షణ బాధ్యత ఈఈపైనే ఉంటుంది. ఈఈ దగ్గర 22 ఏఈ పోస్టులుండగా కేవలం 9 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇందులో అన్నారం బ్యారేజీ పర్యవేక్షణ కోసం 8 మంది ఏఈలు పని చేయాలి. కానీ నలుగురే ఉన్నారు. దీంతో చెరువుల పర్యవేక్షణ కష్టతరంగా మారింది. కాటారం, మహదేవ్‌‌పూర్‌‌ మండలంలో పలు చెరువులు కబ్జాకు గురవుతున్నా ఆఫీసర్లు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

చెరువుల్లో మొరం తవ్వనీయొద్దు..!

రైతులు పంట పండించుకోవడానికి చెరువులను తవ్వించారు. కొందరు తమ స్వలాభం కోసం చెరువుల్లో ఇష్టారీతిగా మొరం తవ్వకాలు జరపడం వల్ల రైతులకే నష్టం జరుగుతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో మట్టి తవ్వకాలను నిలిపివేయాలి. 
- సాదు రమేశ్‌‌, శాయంపేట రైతు, హనుమకొండ జిల్లా

ఇంజినీర్లకు ఇబ్బందిగా మారింది!

భూపాలపల్లి జిల్లాలోని అన్నారం డివిజన్‌‌లో మేజర్‌‌, మైనర్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌లు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 22 ఏఈ పోస్టులకు కేవలం 9 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీనివల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఖాళీలన్నీ భర్తీ చేయాలని చాలా సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. చెరువుల పర్యవేక్షణ చేయడం ఏఈలకు ఇబ్బందిగా మారింది.
- రాంచందర్‌‌, ఇంజినీర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు, భూపాలపల్లి

ఈ చెరువు పేరు శెట్టి కుంట. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​మండలం సర్వే నెంబర్ 947లో 17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.  ఇందులో 13.700 ఎకరాలు కబ్జాకు గురైంది. చెరువు పక్కనే ప్లాట్లు చేసి ఇండ్లు కట్టారు. చెరువు నాలాలను డైవర్ట్ చేసి నిర్మాణాలు చేపట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. అయినా, గత బీఆర్ఎస్​ సర్కారు పట్టించుకోలేదు. తాజాగా గ్రీవెన్స్ సెల్​లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతికి ఫిర్యాదు రావడంతో ఈ ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇరిగేషన్ ​అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది.