రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో లఖీంపూర్ కేసు విచారణ

రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో లఖీంపూర్ కేసు విచారణ

న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీం కోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము అనుకున్న విధంగా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని సీజేఐ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం మండిపడింది. ఈ కేసులో వీడియో ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును ఇంకా తమకు సమర్పించలేదని, అలాగే నిందితుల మొబైల్ ఫోన్లను ఇంత వరకు సీజ్ చేయలేదని అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రాపై విచారణను పక్కదారి పట్టిస్తున్నారని కోర్టు మండిపడింది. 

మంత్రి కొడుకు కాన్వాయ్‌పై జరిగిన మూకదాడితో లింక్ చేయడం ద్వారా అన్నదాతల మీద కార్లు దూసుకెళ్లిన కేసు విచారణను పక్కదారి పట్టిస్తున్నారని అభిప్రాయ పడింది.  వీటిని వేర్వేరు కేసులుగా భావించి విచారణ జరపాలని యూపీ పోలీసులను కోర్టు ఆదేశించింది. సాక్షుల వాంగ్మూలాలను కూడా వేర్వేరుగా, స్వతంత్ర్యంగా రికార్డు చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, వారిపై ఏయే కేసులు నమోదు చేశారో చెప్పాలని యోగి ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. ఈ కేసుల విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు రిటైర్డ్ జడ్జి రాకేశ్ కుమార్‌ జైన్‌ లేదా పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు మాజీ జడ్జి రంజిత్ సింగ్‌ను అపాయింట్ చేయాలని సూచించింది. ఇప్పటి నుంచి ఈ కేసుల్లో రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో పోలీసుల విచారణ జరపాలని తెలిపింది. కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతుల మీదకు కారు దూసుకెళ్లిన ఘటన గురించి తెలిసిందే. గత నెలలో జరిగిన ఈ ఘటనలో నలుగురు రైతుల మృతి చెందారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. 

మరిన్ని వార్తల కోసం:

సోనుసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మా పార్టీ ఓ ఫ్యామిలీ చుట్టూ తిరగదు: మోడీ

నేను హిందువుని.. గుడికి వెళ్తే తప్పేంటి: కేజ్రీవాల్