వలస కార్మికులకు ఓటున్నా, లేనట్టేనా ?

వలస కార్మికులకు ఓటున్నా, లేనట్టేనా ?

రాజ్యాంగంలో అందరికీ ఓటు వేసే హక్కు ఉంది. అయితే పశ్చిమ ఒడిశా నుంచి రాష్ట్రంలోని వేరే ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన కార్మికులకు మాత్రం ఈ హక్కును లేకుండా చేస్తున్నారు ఇటుక బట్టీల యజమానులు. పోలింగ్ రోజు సొంతూరు వెళ్లి ఓటేద్దామని కార్మికులు ఉత్సాహపడుతున్నా పర్మిషన్ ఇవ్వడం లేదు ఇటుక బట్టీల ఓనర్లు. అదేమంటే బట్టీల్లో పని ఎక్కువగా ఉంది..ఈ టైం లో ఊరికి వెళ్లడానికి అనుమతి ఇవ్వడం కుదరదంటున్నారు. దీంతో ఓటర్ల జాబితాలో పేరున్నా, ఓటేసే ఉత్సాహమున్నా ఒడిశా వలస కార్మికులు తమ హక్కును ఉపయోగించుకోలేకపోతున్నారు.

పశ్చిమ ఒడిశా నుంచి వలస వచ్చిన కార్మికులకున్న ఓటు వేసే హక్కును కాలరాస్తున్నారు ఇటుక బట్టీల యజమానులు. బాలానగర్ జిల్లా నుంచి వందల సంఖ్యలో కార్మికులు కొంతకాలం కిందట పొట్ట చేత పట్టుకుని రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాలకు వలస వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది రాజధాని నగరమైన భువనేశ్వర్ చుట్టుపక్కల సెటిలయ్యారు. ఒడిశాలో ప్రస్తుతం లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలిం గ్ జరుగుతోంది. అయితే ఓటేయడానికి సొంతూరుకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం ఇటుక బట్టీల యజమానులు వాళ్ల దగ్గర పని చేస్తున్న వలస కార్మికులకు సొంతూళ్లకు వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం. రెండో కారణం రానుపోను చార్జీలకు కార్మికుల దగ్గర సరిపడ సొమ్ముల్లేకపోవడం.

“ ఈసారి పుట్టి పెరిగిన ఊళ్లకు వెళ్లి ఓటేస్తామని మేమెంతో ఆశపడ్డాం . అయితే కుటుంబం మొత్తం వెళితే తక్కువలో తక్కువ నాలుగు వేల వరకు ఖర్చవుతుం ది. ఇంత డబ్బులు చార్జీలకు పెట్టుకోలేక ఊళ్లకు వెళ్లే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాం ” అన్నాడు బాలానగర్ జిల్లా కు చెందిన అగస్టీ బాగ్ అనే వలస కార్మికుడు. ఒడిశాలోని కరువు ప్రాంతమైన బరాగఢ్జిల్లాకు చెందిన హరిపాల్ కుటుంబానిది డిఫరెంట్ స్టోరీ . ఇల్లు కట్టుకోవడానికి చేసిన అప్పు తీర్చడానికి బలియంటా ప్రాంతానికి హరిపాల్ ఫ్యామిలీ వలసవచ్చిం ది. ఇద్దరు పిల్లలతో సొంతూరుకు వెళ్లి రావడానికి కనీసం వెయ్యి రూపాయల ఖర్చవుతుం ది. టికెట్లఖర్చు కిం ద ఇంత సొమ్మును హరిపాల్ ఫ్యామిలీ ముందుగానే దాచుకుంది. అయినా, ఓటు పేరుతో సొంతూరుకు వెళ్లడానికి సెలవిచ్చేది లేదంటున్నాడు హరిపాల్ కుటుంబం పనిచేసే ఇటుక బట్టీ ఓనర్.“మా డబ్బుల్తో మేం వెళతాం . మీకేంటి ఇబ్బంది ”అని నిలదీసి అడిగినా “ సెలవల్లేవు ” అంటూ మొండిగా జవాబిస్తున్నా డు.

18న బొలంగీర్, కందమాల్ జిల్లాల్లో పోలింగ్

బొలంగీర్, కందమాల్ తో పాటు అనేక జిల్లాలనుంచి వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఈ జిల్లాల్లో రెం డో విడతలో భాగంగా ఈ నెల 18 న పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కు టైమ్ దగ్గరపడుతుండడంతో సొంతూరుకు వెళ్లి, ఓటేయాలని కార్మికులు ఉత్సాహపడుతున్నా రు. అయితే వీరి ఉత్సాహం మీద ఇటుకబట్టీల యజమానులు నీళ్లు చల్లుతున్నారు. సెలవులు లేవు….పొండి అంటున్నారు. దీంతో ఓటరు లిస్టులో  పేరున్నా ఓటేయలేకపోతున్నారు వలస కార్మికులు.

సర్కార్ చర్యలు తీసుకోవాలి

వలస కార్మికుల విషయంలో ఒడిశా ప్రభుత్వం స్పందిం చాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసేవారికి ఓటేసే హక్కును ఉపయోగించుకునేలా  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సర్కార్ చొరవ చూపి బట్టీల ఓనర్లతో మాట్లాడాలన్నారు. ఓటు వేయడానికి సొంతూరుకు పంపకపోవడాన్ని నేరంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే వారు పనిచేసే ప్రాంతాల నుంచి వారి వారి ఊళ్లకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.

ఇటుక బట్టీల్లో మూడు లక్షల మంది వలస కార్మికులు

కరువు ప్రాంతాలుగా పేరున్న వెస్ట్రన్ ఒడిశా నుంచి సౌత్ ఒడిశాకు ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్తుంటా రు. ఇలా బతకడానికి వచ్చిన వారు దక్షిణాది జిల్లాల్లో దాదాపు మూడు లక్షలమంది వరకు ఉంటారన్నది ఒక అంచనా. వీరిలో ఎక్కువ మంది ఇటుక బట్టీల్లో పనిచేస్తుంటారు. జూన్ వరకు బట్టీల్లో పని ఎక్కువగా ఉంటుం ది. దీంతో ఓటు హక్కు అని కార్మికులు చెప్పినా నో పర్మిష న్ అంటున్నారు బట్టీల ఓనర్లు. వలస కార్మికులను ఓటేయడానికి సొంతూళ్లకు పంపని దుర్మార్గం చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. కిందటిసారి లోక్ సభ ఎన్నికల్లో ఈ ఇష్యూ బాగా ఫోకస్ అయింది. దీనిపై ఒడిశా హై కోర్టు కూడా రియాక్ట్ అయిం ది. వలస కార్మికులు ఓటేయడానికి వీలైన పరిస్థితులను కల్పించాలని రాష్ట్రఎలక్షన్ కమిషన్ ను హై కోర్టు ఆదేశించిం ది.

ప్రతి ఓటుకు విలువ ఉంటుంది

వలస కార్మికులకు ఓటు వేసే వీలు కల్పిస్తే ఒడిశా రాజకీయాల్లో అనేక మార్పు లు వస్తాయని రాజకీయ పండితులు అంటున్నా రు. ఈ విషయంలో ఇటుక బట్టీల యజమానుల వైఖరి కరెక్ట్ కాదంటున్నారు. బట్టీల్లో  పని ఎక్కువగా ఉందన్న కారణం చూపి ఓటు వేసేందుకు వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం సమర్థనీయం కాదంటున్నారు. ఓటు వేసే హక్కు ను కాలరాయడం అంటే చిన్న విషయం కాదన్నారు. ఒకవేళ చార్జీలకు డబ్బుల్లేని పరిస్థితుల్లో కార్మికులు ఉంటే వారికి ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ అందించాల్సిన బాధ్యత ఒడిశా సర్కార్ పై ఉందన్నారు. ఈ ఇష్యూను గతంలో అనేక సంస్థలు లేవనెత్తాయి. అనేక వేదికల మీద వలస వచ్చిన వారి హక్కుల గురించి సామాజిక కార్యకర్తలు మాట్లాడారు. సర్కార్లో ఉన్న పెద్దవారు సహా అంతా విన్నారు. అంతే…అంతకు మించి జరిగింది ఏమీ లేదు. ఎన్నికల సీజన్ రాగానే కార్మికులను వారి సొంతూళ్లకు వెళ్లడానికి సదుపాయాలు కల్పించ డానికి సర్కార్ ఎలాంటి చొరవ చూపలేదు. దీంతో పశ్చిమ ఒడిశాలోని అనేక జిల్లాల్లో పోలింగ్ బాగా తగ్గిపోయిందని లెక్కలు చెబుతున్నాయి.