BONALU 2025: సల్లంగా చూడమ్మా.. ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు

BONALU 2025: సల్లంగా చూడమ్మా.. ధూంధాంగా లాల్ దర్వాజ బోనాలు

హైదరాబాద్ లో  ఆషాఢమాసం బోనాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి.  లాల్ దర్వాజా బోనాల జాతరకు భక్తులు ఈ రోజు ( జులై 20) ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలతో బారులు తీరారు.  ఆషాఢమాసం నాలుగో వారం కావడంతో గ్రామ దేవతకు పూజలు చేయడానికి, బోనాలు సమర్పించడానికి ఉదయం నుంచే బారులు తీరారు.

అమ్మల గన్న అమ్మ, ఆది పరాశక్తికి బోనం నైవేద్యం సమర్పించి ...  తెలంగాణలో ఓ పండుగలా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తారు. డప్పు చప్పుళ్లతో పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో పాటు పసుపు బండారులు, వేపల సువాసనల నడుమ కల్లు సాకలతో ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల ఊరేగింపు సమయంలో నువ్వు పెద్దపులి ఎక్కినావమ్మో.. అంటూ అందరూ కలిసి ఆడుతూ పాడుతూ చేసే ఆ వేడుకే తెలంగాణ బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.

 హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరారరు. లాల్ దర్వాజాలో అమ్మవారు సింహవాహినీ రూపంలో కనిపించనున్నారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కోవారంలో బోనాలు సమర్పించే సంప్రదాయం ఉండటంతో  భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా.. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు మొత్తం సందడిగా మారిపోయింది.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆలయ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు.  బోనాల్లో పోకిరిల ఆట కట్టించేందుకు మఫ్టీల్లో ... షీ టీమ్స్ కూడా తిరుగుతున్నారు.  బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ బోనాల పండుగలో  పోతరాజులతో కలిసి బోనాల ఊరేగింపులో యువత చేసే విన్యాసాలు బాగా ఆకర్షిస్తున్నాయి.