జిల్లాలోని పశువులకు లాంపి స్కిన్​ వ్యాధి

జిల్లాలోని పశువులకు లాంపి స్కిన్​ వ్యాధి

గద్వాల, వెలుగు: జిల్లాలోని పశువులకు లాంపి స్కిన్​ వ్యాధి సోకుతోంది. దీంతో మూగజీవాలు విలవిల లాడుతున్నాయి. ఎద్దు, ఆవులకు ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రోగాన్ని నియంత్రించేందుకు యాంటీబయాటిక్ మందులు వెటర్నరీ దవాఖానాలలో లేకపోవడంతో రైతులే బయట కొనుక్కోవలసి వస్తోంది. మందులు వాడుతున్నా  వ్యాధి కంట్రోల్​ కావడం లేదు. ధరూర్ మండలంలోని ఉప్పెర్, గార్లపాడు, ఖమ్మంపాడు తో పాటు గద్వాల మండలం, కేటి దొడ్డి మండలంలో పశువులకు స్పీడ్ గా వ్యాధి అంటుకుంటోంది. 

మచ్చలు, కంతులు, టెంపరేచర్

లాంపి స్కిన్ డిసీజ్​ సోకిన పశువులకు చర్మం ముద్దగా మారి, మచ్చలు, కంతులు ఏర్పడుతున్నాయి. వాటితో పాటు పశువులు ఎక్కువ టెంపరేచర్ బారిన పడుతున్నాయి. పశువులు నిరసించి కనీసం మంచినీళ్లు తాగలేకపోతున్నాయని  రైతులు వాపోతున్నారు. ఒక పశువుకు వైరస్​ సోకినా  ఊర్లోని దాదాపు అన్ని పశువులకు ఈ వ్యాధి సోకుతోందని రైతులు అంటున్నారు. వీటికి మూడు రోజులపాటు యాంటీబయటిక్ మందులను వాడాల్సి ఉంటుంది. 

గోట్ ఫాక్స్ వైరస్ తో..

జోగులాంబ గద్వాల జిల్లాలో 1,33,000 పశువులు ఉన్నాయి.  గోజాతికి చెందిన తెల్ల ఎర్ర ఛాయలున్న పశువుల , చిన్న పశువుల్లో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. జిల్లాలో గో జాతికి చెందిన 60 వేల పశువులు ఉన్నాయి. ప్రస్తుతం వాటికే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది.

వ్యాక్సిన్ వేస్తున్నాం

లాంపి స్కిన్ డిసీజ్​ ను నియంత్రించేందుకు జిల్లాలో పశువులకు వ్యాక్సిన్ వేస్తున్నాం. 37వేల వ్యాక్సిన్లు తెప్పించాం. ఇప్పటికే 70శాతం  వ్యాక్సిన్ పూర్తి చేశాం. రైతులు వ్యాధి సోకిన పశువులను ఐసోలేట్ చేసుకుంటే మిగతా వాటికి వ్యాధి రాకుండా ఉంటుంది. మెడిసిన్ కూడా ఇస్తున్నాం. యాంటీబయాటిక్ మందుల కోసం గవర్నమెంట్ కి ఇండెంట్ పెట్టాం.

- డాక్టర్​ వెంకటేశ్వర్లు, జిల్లా వెటర్నరీ ఆఫీసర్​

మందులు ఇస్తలేరు

వ్యాధి సోకిన పశువులను తీసుకెళ్తే వెటర్నరీ డాక్టర్లు పట్టించుకుంటలేరు. మందులు లేవు బయట కొనుక్కోవాలని చెబుతున్నారు.  మూగజీవాల బాధ చూస్తే కండ్ల నీళ్లు వస్తున్నాయి.

- గోవర్ధన్ గౌడ్, రైతు ఉప్పేర్