
వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో భూవివాదం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ వర్గానికి చెందిన అనంతరాములు, రత్నమ్మలపై మరో వర్గానికి చెందిన అర్జున్‌రావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో నరికిన ఈ దాడిలో రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడు అర్జున్‌రావును అదుపులోకి తీసుకున్నారు. బుద్దారం శివారులోని 2ఎకరాల 30 గుంటల భూమి కోసం ఇరు వర్గాల మధ్య 10 ఏళ్ల నుంచి వివాదం జరుగుతుందని అక్కడి వారు చెబుతున్నారు. ఈ వివాదం విషయమై గతంలోనే పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరిగిందని, పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపారని తెలిపారు. ఈరోజు కూడా మళ్లీ అదే భూమి విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్రంగా గొడవ జరిగిందని, ఈ గొడవలో ఒక వర్గానికి మహిళపై దాడి జరిగిందని అంటున్నారు. వనపర్తి సీఐ సూర్యనాయక్.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ జరుపుతున్నారు.