
- ఈ నెలలో ఇప్పటి వరకు 65 వేల మంది టెకీలు ఇంటికి
బిజినెస్ డెస్క్, వెలుగు: మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. దీంతో ఇండియాతో సహా గ్లోబల్‌గా ఈ నెలలో రోజుకి 3,000 మంది టెకీలు తమ జాబ్స్ కోల్పోయారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ రెసిషన్‌లోకి జారుకుంటుందనే భయాలతో ఉద్యోగులను తీసేయడంలో కంపెనీలు వేగం పెంచాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ముందుగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఒక్క నెలలోనే గ్లోబల్‌గా 65,000 మంది టెకీలు తమ జాబ్స్ కోల్పోయారు. సుమారు 166 టెక్ కంపెనీలు ఉద్యోగులను భారీగా తీసేశాయి. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ఇప్పటికే ప్రకటించింది. కంపెనీకి గ్లోబల్‌గా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. కంపెనీలో మార్పులు చేస్తున్నామని, 10 వేల మంది ఉద్యోగులను తీసేయాల్సి వస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అమెజాన్ తాజాగా 18 వేల మందిని తొలగిస్తామని ప్రకటించింది. ఇందులో వెయ్యి మంది ఇండియా నుంచి ఉన్నారు.
కిందటేడాది లక్షా యాభై వేలకు పైగా ఇంటికి..
కిందటేడాది ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తీసేశాయి. వెయ్యికి పైగా కంపెనీలు 1,54,336 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. కిందటేడాది దేశంలోని స్టార్టప్‌లే 18 వేల మందికి పైగా ఉద్యోగులను తీసేశాయి. ఈ ఏడాది కూడా దేశంలోని టెక్ కంపెనీలు లేఆఫ్స్ పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ నెలలో షేర్‌చాట్ 500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఐటీ మేజర్ విప్రో 400 మందికి పైగా ఉద్యోగులను, స్విగ్గీ 380 మందిని, డిజిటల్ హెల్త్‌కేర్ సర్వీస్‌లను అందించే మెడీబడ్డీ 200 మందిని తొలగించాయి. ఓలా, స్కిట్.ఏఐ, డంజో వంటి కంపెనీలు కూడా భారీగా ఉద్యోగుల కోత పెడుతూ వార్తల్లో నిలిచాయి.
స్టార్టప్‌లను వదిలేస్తున్న సీనియర్ ఉద్యోగులు..
స్టార్టప్‌లు ఎప్పుడు జాబ్స్ నుంచి తీసేస్తాయో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో 2021 లో భారీ శాలరీకి పెద్ద కంపెనీలను వదిలి స్టార్టప్‌ల బాట పట్టిన సీనియర్ ఉద్యోగులు, తిరిగి పెద్ద కంపెనీల వైపు చూస్తున్నారు. మార్కెట్‌లో నిలదొక్కుకున్న కంపెనీల్లో జాబ్స్ కోసం సీనియర్ ప్రొఫెషనల్స్ ప్రయత్నాలు పెంచారు. స్టార్టప్‌లకు ఫండింగ్ అందడంలో ఇబ్బందులు ఉండడం, లేఆఫ్స్ బాగా పెరగడం వంటి కారణాలతో సీనియర్ ఉద్యోగులు స్టార్టప్‌లను విడిచిపెట్టేయాలని చూస్తున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. ప్రొఫెషనల్స్ స్టార్టప్‌లలో పనిచేయడానికి ఒకప్పటిలా ఇప్పుడు ఆసక్తి చూపించడం లేదని వెంచర్ క్యాపిటల్ ఫండ్ పీర్‌క్యాపిటల్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ పహ్వా అన్నారు. కెరీర్ గ్రోత్‌పై అనిశ్చితి నెలకొనడంతో జాబ్ సెక్యూరిటీ ఉండే కంపెనీల వైపు వీరు చూస్తున్నారని చెప్పారు. సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ చేసిన సర్వే ప్రకారం, స్టార్టప్‌లలో పనిచేస్తున్న 80 శాతం మంది సీనియర్ ఉద్యోగులు మార్కెట్‌లో నిలదొక్కుకున్న కంపెనీల్లో చేరాలని చూస్తున్నారు. దేశంలోని 60 స్టార్టప్‌లలో పనిచేస్తున్న 900 మంది సీనియర్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను చేశారు. జాబ్ సెక్యూరిటీ లేకపోవడమే జాబ్ మారిపోవాలనుకోవడానికి ప్రధాన కారణమని 47 శాతం చెప్పారు. మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసమని 27 శాతం మంది, మంచి శాలరీ కోసమని 26 శాతం మంది వెల్లడించారు. లేఆఫ్స్ భయాలు ఒక విధంగా కారణమైతే, మరోవైపు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు సీనియర్ ప్రొఫెషనల్స్ కోసం వెతుకులాట పెంచడం మరో కారణం. స్టార్టప్‌లలో జాబ్స్ ఎప్పుడు పోతాయా? అనే అనిశ్చితి ఒకవైపు, ట్రెడిషనల్ కంపెనీలు హైరింగ్ యాక్టివిటీ పెంచడం మరోవైపు..దీంతో స్టార్టప్‌లను వదిలేసేందుకు సీనియర్ ప్రొఫెషనల్స్ రెడీ అవుతున్నారు. డిజిటల్‌కు మారేందుకు ట్రెడిషనల్ కంపెనీలకు సీనియర్ టెక్ ప్రొఫెషనల్స్ అవసరం. తాజాగా పేటీఎం నుంచి కోటక్ బ్యాంక్‌కు కమల్ రాఠీ మారారు. నైకా నుంచి టీ మృగంకి కోల్‌గేట్‌కు షిఫ్ట్ అయ్యారు. కాయిన్ డీసీఎక్స్ నుంచి ఏపీ మొల్లర్‌కు దివాకర్ ప్రయాగ, ఉడాన్ నుంచి అదిత్య బిర్లాకు సందీప్ కుమార్ మారారు.