
- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతరకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే బోనాల మహోత్సవాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేడు బోనాలు, తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపు,14న రంగం (భవిష్య వాణి) , పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నేడు పట్టువస్త్రాల సమర్పించనున్న సీఎం
ఆదివారం ఉదయం 4.10 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురిటీ కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. హైదరాబాద్జిల్లా ఇన్చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. -వేకువజాము నుంచే బోనాలతోపాటు సాధారణ భక్తులను అనుమతిస్తారు.
బోనాలతో వచ్చే మహిళలు ఎలా వెళ్లాలంటే..
భక్తుల కోసం బాట షోరూమ్ నుంచి రెండు, రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ వైపు నుంచి రెండు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డు వైపు నుంచి మరో రెండు కలిపి మొత్తం ఆరు క్యూలైన్లు సిద్ధం చేశారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూలైన్లలో ప్రతి 16 మీటర్లకు ఒక అత్యవసర ఎగ్జిట్ గేట్‌ను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఆర్పీరోడ్డు, రాంగోపాల్‌పేట ఠాణా నుంచి ఏర్పాటు చేసిన రెండు క్యూలైన్ల ద్వారా బోనాలతో వచ్చే మహిళలు ఆలయంలోకి చేరుకున్నాక గర్భగుడి ఎదురుగా ఉన్న మాతాంగేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద బోనాలు, సాక సమర్పించాలి. శివసత్తులు, జోగినీలు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు బాట వైపు నుంచి నేరుగా ఆలయానికి తమ సంప్రదాయం ప్రకారం రావచ్చని అధికారులు తెలిపారు.
2,500 మంది పోలీసులతో బందోబస్తు
ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మొత్తం 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వీటిని మహంకాళి పోలీస్‌స్టేషన్‌లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కుఅనుసంధానం చేశామన్నారు. ఆలయం చుట్టూ రెండు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ఆంక్షలు విధించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బయో మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు.
క్యూలైన్లతోపాటు ఆలయ పరిసరాల్లో 8 లక్షల వాటర్ ప్యాకెట్లు, 50 వేల మంచినీటి బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు వాటర్‌బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండడంతో బోనాల జాతరకు సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా మహిళలు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సిటీలోని పలు ప్రాంతాల నుంచి జాతరకు మొత్తం 175 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది.